
రైతుల ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వాలు
నానా పాటేకర్ బాలీవుడ్ నటుడు. రాజకీయవాది కాదు. ఓట్లు అడిగిన వాడు, పొందిన వాడు కాదు. కానీ విద ర్భలో రైతుల ఆత్మహత్యలపై వేదన చెంది స్పందించాడు. మృతుల కుటుంబాలను పరామర్శించి, చేతనైన సహాయం చేశాడు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని మీ కష్టాలలో తోడుగా ఉంటాననీ రైతు లకు భరోసా ఇచ్చాడు.
మరోపక్క ఇంత కుమించి స్పందించాల్సిన వాళ్లు మన ఓట్లు పొంది మన డబ్బుతో పెత్తనం చెలాయిస్త్తున్న కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్ పార్ల మెంటులో రైతుల ఆత్మహత్యలకు భగ్న ప్రేమలు, నపుంసకత్వం ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు. ఏపీ హోంమంత్రి చినరాజప్ప అదే పాటపాడుతూ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలు మరో కారణం అన్నారు. ఇంత దారుణంగా రైతులను పరిహసించిన తీరుకంటే జుగుప్సాకరం మరొకటి ఉండదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల రుణ విముక్తి ప్రదాతగా సెప్టెంబర్ 9 నుండి రైతు యాత్రలు ప్రారంభించారు. ఎన్నికల వాగ్దానం ప్రకారం 60, 70 వేల కోట్ల రుణమాఫీ జరగాలి. కమిటీ లు, కార్డులు పత్రాలు తిరకాసులతో దానిని రూ.24 వేల కోట్లకు కత్తిరించారు. దానిలో చెల్లించింది రూ.7,500 కోట్లు మాత్రమే. పంచపాండవులు ఎంతమంది అంటే తిప్పితిప్పి ఒక్కడన్నట్లుగా సాగిన రుణమాఫీ తంతుకు కొండంత రూపమిస్తూ, లబ్ధిదారుల తో ముచ్చట్ల యాత్ర సాగిస్తున్నారు. యాత్ర మొదలై మూడు నా లుగు రోజులు కాకుండానే అనంతపురం, ప్రకాశం జిల్లాలలో రుణ భారంతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారు తమ ప్రాణత్యాగంతో రుణమాఫీ డొల్లతనాన్ని ప్రకటించారు.
గత ఇరవై ఏళ్లలో దేశంలో 3,00,000 మంది రైతులు ఆత్మ హత్యల పాలైనట్లు లెక్కల రికార్డులు కనిపిస్తున్నాయి. ఇందులో సింహభాగం మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్ర దేశ్‌లలోనే జరుగుతున్నాయి. 2014 నేషనల్ శాంపుల్ సర్వే ప్రకా రం ఆంధ్రప్రదేశ్‌లో 92 శాతం, తెలంగాణలో 89 శాతం రైతు కుటుంబాలు అప్పులలో ఉన్నాయి. వ్యవసాయరంగ సంక్షోభం కొత్తదీ కాదు, పాలక పక్షాలకి, ప్రతిపక్షాలకి తెలియందీ కాదు. ఎన్నికల్లో అందరూ లాభసాటి వ్యవసాయం మీద గొంతు చించు కోవడం, ఎన్నికల తర్వాత మూగనోము పట్టడం పరిపాటైంది.
కేంద్రంలో, రాష్ర్టంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు దీనికి మినహాయింపు కాదని వారి నడక చెబుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలు రాకపోవడమే రైతులు అప్పులలో కూరుకుపోవడానికి, ఆత్మహత్యలకు ప్రధాన కారణం గా ఉంది. లాభసాటి ధరల చుట్టూ ఉన్న సమస్యలపై ఎలాంటి కొత్త చొరవలనీ ఈ ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. మొదటిది మద్దతు ధర: స్వామినాథన్ కమిటీ సిఫారసు మేరకు వ్యవసాయ పంటలకు ఉత్పత్తి వ్యయం మొత్తం మీద 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర ప్రకటిస్తామని బీజేపీ ఎన్ని కల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ఉన్న మోదీ తన ఎన్నికల ప్రచార సభలలో పదేపదే ప్రకటించారు.
ఎన్నికైన తర్వాత షరా మామూలుగా మాటమార్చారు. ఎన్నికల వాగ్దానం మేరకు మద్దతు ధరల నిర్ణాయక కమిటీ లెక్కల ప్రకారం గానైనా ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,000ల పైన మద్దతు ధర ప్రకటించాలి. దీనికి భిన్నంగా ఏటా ఇస్తున్న రూ.50లు మాత్రమే పెంచి 2015-16కు గానూ క్వింటాలుకు రూ.1,410లను మద్దతు ధరగా ప్రకటించారు. ఎన్నికల వాగ్దానాన్ని తుంగలో తొక్కడమే కాకుండా, స్వామినాథన్ కమిటీ సిఫారసు అమలు చేస్తే ధరల వక్రీకరణ జరుగుతుందని ప్రకటించారు.
కేంద్రం వాగ్దానం చేసిన మద్దతు ధర ప్రకటించకపోయినా, రాష్ర్ట్ర ప్రభుత్వం కోరిన రూ.2,636 మద్దతు ధరను పట్టించుకోక పోయినా ముఖ్యమంత్రి మౌనం పాటించడం తప్ప నోరు విప్ప డం లేదు. కేంద్రం ఇవ్వకపోతే రాష్ర్టం రైతుల కోరిక మేరకు కనీ సం క్వింటాలుకు రూ.300 బోనస్‌గా ఇస్తామని ప్రకటించనూ లేదు. గట్టిమాటలు లేకుండా వట్టి చేతులతో రైతు యాత్రలు మాత్రం చేస్తున్నారు.
రెండవది ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ: చిరకాలంగా రైతులు కోరుతున్న విధంగా తమ పంటలను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ను కల్పిస్తామన్నారు. కాని ఒకే జాతీయ మార్కెట్ ఏర్పాటుకు అడుగులు పడటం లేదు. ప్రపంచ మార్కెట్లలో అమ్ముకోడానికి అడ్డంగా ఉన్న ఆంక్షలు తొలగించలేదు.
మూడవది రైతుల స్వయం మార్కెట్లు: పంటల మార్కెట్‌లో దళారుల దోపిడీని వ్యవసాయ మార్కెట్ కమిటీలతో అరికడతా మన్న పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. ఇది జరగా లంటే పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సం ఘాలు లేదా ఉత్పత్తిదారుల కో-ఆపరేటివ్‌లు ప్రభుత్వ జోక్యానికి వీలులేని చట్టబద్ధ సంస్థలు రావాలి. రైతులు మాత్రమే సభ్యు లుగా, షేర్ హోల్డర్లుగా ఉండాలి. మార్కెట్ యార్డులు రైతుల పంటలను నిల్వ చేసుకోడానికి, మద్దతు ధరకు అమ్ముకునే కేం ద్రాలు కావాలి. ఈ యార్డులు జాతీయ, అంతర్జాతీయ మార్కె ట్లలో అమ్మకాలకు, ముడి పంటలకు అదనపు విలువనిచ్చే పరి శ్రమలతో వ్యవహరించే స్వేచ్ఛ ఉండాలి. వచ్చే లాభాలలో రైతు లకు డివిడెండ్లు ఇవ్వాలి. ఇది వ్యవసాయ మార్కెట్లో దళారుల తొలగింపునకు, రైతుల ఆధిపత్యానికి దారి తీస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్ట ప్రభుత్వం ఈ మార్కెట్ కమిటీలను రైతుల ప్రమేయం లేకుండా పాలక పక్ష సభ్యుల నామినేటెడ్ సం స్థగా మార్చింది. రాష్ర్టంలో దాదాపు 90 శాతం యార్డుల్లో కొనుగో లు-అమ్మకాల లావాదేవీలు లేకుండా దళారులకే వదిలేశారు. మార్కెట్ సెస్సుగా వసూలు చేస్త్తున్న వందల కోట్లను రైతులకు కాకుండా ప్రభుత్వమే వాడేసుకుంటున్నది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలతోనూ, ముఖ్యమంత్రి రోజుకో యాత్రతోనూ కాలం వెళ్లబుచ్చకుండా రైతుల ఆత్మహత్యల నివారణకు ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకు తగిన చర్యలు తీసుకోకపోతే... ప్రభు త్వాల బాధ్యతా రాహిత్యానికి నానా పాటేకర్ చెప్పినట్లు రైతులు తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే రావచ్చు.
- వ్యాసకర్త అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ లోక్‌సత్తా పార్టీ,
మొబైల్ 9866074023
- డీవీవీఎస్ వర్మ