
రైతన్న ఆక్రోశం వినపడదా?
ఎన్నికల ప్రచార సమయంలో రైతు రుణ మాఫీ గురించి గొప్ప గొప్ప ప్రకటనలు చేసి, వాటిని అరకొరగా అమలు చేసినందువల్ల కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ దుస్థితి దాపురించిందన్న సత్యాన్ని అంగీకరించాలి. ఈ విషయంలో తెలంగాణ కొంత మెరుగే అయినా, ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి లక్ష రూపాయలు రుణ మాఫీ కింద చెల్లించి ఉంటే బాగుండేది. ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన నాటి నుంచి ఒక్క రైతు కూడా రాష్ర్టంలో ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు ఒక కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కలసి చర్చించి రూపొందిస్తే బాగుండేది.
ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోయే తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావే శాలలో ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి అధికారపక్షం అస్త్రాలు సిద్ధం చేసు కుంటున్నట్టు పత్రికలలో వార్తలొచ్చాయి. గతనెలలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఐదురోజులు మాత్రమే జరిగిన ఆ రాష్ర్ట శాసనసభ సమావేశాలలో కూడా అధికార పక్షం అవతలి పక్షాన్ని మాట్లాడని వ్వకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎదురుదాడినే ఎంచుకున్నది. దాడులు, ఎదురుదాడులకే శాసనసభలు పరిమితం అయి పోయి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా, పరిష్కారాలకు నోచుకో కుండా నిరర్థకంగా తయారుకావడం ఇవాళ కొత్తేంకాదు. అసలు ప్రతి పక్షమే ఉండకూడదన్న ఒక పూర్తి అప్రజాస్వామిక, ప్రమాదకర ధోరణి కింది నుంచి పైదాకా రాజకీయాలలో చొరబడింది.
ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేని ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొని ఉంది. కొంతకాలం క్రితం వరకూ రాష్ట్రాల శాసనసభలు ఎలా ఉన్నా పార్లమెంట్ సమావేశాలు పద్ధతి ప్రకారం జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అక్కడ కూడా విపక్షం నోరు మూయించడానికి అధికారపక్షం ఎదురుదాడి అనే ఆయుధాన్ని ఎంచుకోడంతో జనం దృష్టిలో అవీ పలచనైపోయాయి. ప్రభుత్వం చేస్తున్న పనులలో మంచీచెడులను ఎత్తిచూపడం విపక్షాల పని. వాటిని సరిచేసుకోడం ప్రభుత్వ పక్షం బాధ్యత. తప్పులు జరుగుతున్నా యని మొత్తుకుంటూ ఉంటే, వినడానికి కూడా సహనం లేని అధికారపక్షాలు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయి తప్ప, ప్రజాసమస్యల పరిష్కారానికి ఏమా త్రం ఉపకరించవు.
ఎక్కడైనా ఆ దృశ్యాలే
గత నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నిర్వాకం చూశాం. రేపటి నుంచి తెలంగాణ సమావేశాలు కూడా ఇంచుమించు ఇదే పద్ధతిలో జరుగుతాయనడంలో సందేహం లేదు. అయితే ఒక్క తేడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక్కటే విపక్షం. అది ఎంత బలమైన విపక్షం అయినా, తోడు మరో విపక్షం ఏదీ సభలో లేక ఒంటరి పోరాటం చేయవలసి వస్తున్నది. తెలంగాణ సభలో పరిస్థితి వే రు. ఒకటి కంటే ఎక్కువ ప్రతిపక్షాలు ఉమ్మడిగా అధికార పక్షం మీద దాడికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ సభలో చర్చకు రావలసిన అంశాలు చాలానే ఉన్నా, ప్రధానంగా చర్చ జరగవలసింది- అడ్డూ ఆపూ లేకుండా జరిగిపోతున్న రైతుల ఆత్మహత్యల మీద.
గాలికి కొట్టుకుపోయిన హామీ
తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే ఇక అన్నదాతల ఆత్మహత్యలు ఉండబోవని ఉద్య మకాలంలో పదే పదే ప్రకటించిన తెలంగాణ రాష్ర్ట సమితి ఇవాళ అధికారం లోకి వచ్చాక ఆ విషయంలో ఇరుకున పడబోతున్నది. అందుకే ఎదురుదాడికి సిద్ధమవుతున్నది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడినా రైతుల ఆత్మహత్యలు ఆగ లేదు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ ఉమ్మడి రాష్ర్టంలో అధికారం చలాయించినవే. ఆ పార్టీలు అధికారంలో ఉన్న కాలంలో కూడా రైతుల ఆత్మహత్యలు జరిగిన మాట వాస్తవం.
‘మీ మీ ప్రభు త్వ హయాంలలో జరిగిన రైతుల ఆత్మహత్యల మాటేమిటి?’ అనే ఎదురు దాడికి ప్రస్తుత అధికారపక్షం సిద్ధంగా ఉందనే విషయం మంత్రులు చేస్తున్న ప్రకటనలను బట్టి అర్థమవుతూనే ఉంది. నిజానికి ఇప్పుడు తెలంగాణ లో ఏ సమస్య గురించి మాట్లాడబోయినా, ఇదంతా గతంలో దశాబ్దాల తరబడి అధికారంలో ఉండగా మీరు చేసిన నిర్వాకం ఫలితమేననీ, ఆంధ్రపాలకుల కారణంగానే ఈ దుస్థితి దాపురించిందనీ ఎదురుదాడికి టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంది. ఆకుపచ్చ తెలంగాణ నా స్వప్నం అన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హయాంలో, ఈ ఏడాదిన్నర కాలంలో కొన్ని వందల మంది రైతన్నలు ఆత్మ హత్యలు చేసుకున్నారన్నది వాస్తవం.
ప్రణాళిక రూపొందించలేరా?
నిజానికి ఈ శాసనసభ సమావేశాలు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ఏం చెయ్యాలో చర్చిస్తే బాగుండేది. అవసరమను కుంటే మిగతా సభా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి అన్ని రాజకీయ పార్టీలు ఈ ఆత్మ హత్యలను ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చించి, ఒక ప్రణా ళిక రూపొందిస్తేనన్నా అన్నదాతలలో ఆత్మ విశ్వాసం పెరగడానికి అవకాశం ఉంటుందేమో! కానీ అటువంటి ప్రయత్నం జరగదని మనకూ తెలుసు.
కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద చలించిపోయిన సభ్య సమాజం మన దేశ వ్యవసాయ విధానం, రైతుల కోసం చేయవలసిన కార్యక్రమాలను నిర్ణయించేందుకు పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఒక సమగ్ర విధానం రూపొందించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ మార్గంలో వెళ్లేందుకు ఏలికలు ఆలోచించడమే లేదు. గతవారం తెలంగాణ రాష్ర్ట మంత్రి వర్గం సమావేశం జరిపి, ఆత్మహత్యలు చేసుకునే రైతుల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయానికి అందరూ హర్షించవలసిందే. అయితే ఈ నిర్ణయం జరిగిన తరువాత ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకే ఇది వర్తిస్తుందనడం న్యాయం కాదు. ఇప్పటికే ఈ ఏడాదిన్నర కాలంలో చనిపోయిన రైతు కుటుంబాల గతే మిటి మరి? నిజమే, ఖజానాకు భారమే కావచ్చు. కానీ ఆ మేరకు ఇతరత్రా జరగబోతున్న బోలెడు వృథా వ్యయాన్ని నివారించగలిగితే ఇది సాధ్యమే. ఆ పని చేయవలసింది పోయి, ఒక మంత్రిగారు ఇంకొంచెం ముందుకు పోయి, మరో నాలుగేళ్ల తరువాత జరిగే రైతుల ఆత్మహత్యలకు మాత్రమే మా ప్రభుత్వానిది బాధ్యత, ఇప్పుడు జరిగేవన్నీ పాత ప్రభుత్వాల ఖాతాలో వెయ్యాలి అన్నారు. ఓ పక్క మనకు తిండి పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకుంటుంటే, మనం దాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలా అని ఆలోచిస్తున్నాం. ఆ మంత్రి తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కావడా నికి పూర్తిగా అర్హుడు కదా! ఇటువంటి పిచ్చి ప్రకటనలు గత ప్రభు త్వాలలో మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు కూడా చేశారు.
ఒక మంత్రి మానసిక వ్యాధుల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారంటే, ఒక ముఖ్యమంత్రి స్వయంగా, ప్రభుత్వం చెల్లించే పరి హారం కోసం వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రంటూ వాచాల త్వాన్ని కూడా ప్రదర్శించారు. అసలు ఎన్నికల ప్రచార సమ యంలో రైతు రుణ మాఫీ గురించి గొప్ప గొప్ప ప్రకటనలు చేసి, వాటిని అర కొరగా అమలు చేసినందువల్ల కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ దుస్థితి దాపురించిందన్న సత్యాన్ని ప్రభుత్వాలు అంగీకరించాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత మెరుగే అయినా, ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి లక్ష రూపాయలు రుణ మాఫీ కింద చెల్లించి ఉంటే మరింత బాగుండేది. అసలు ఇదంతా కాదు. ముందే చెప్పుకున్నట్టు ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన నాటి నుంచి ఒక్క రైతు కూడా రాష్ర్టంలో అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు ఒక కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కలసి చర్చించి రూపొందిస్తే బాగుండేది. కానీ అది సాధ్యమేనా, రాజకీ యంగా ఎవరికి వారు తమదే పైచేయి అనిపించుకునే ప్రయత్నంలో పడి దాడి, ఎదురుదాడులతోనే కాలం గడపడం ఖాయం.
ఆత్మహత్యలే ప్రధాన ఎజెండా కాగలదా?
రైతుల ఆత్మహత్యలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాలు ఉమ్మడి పోరు సాగిం చాలని అనుకున్నా, అది ఇప్పుడున్న పరిస్థితులలో సాగకపోవచ్చు. కాంగ్రెస్ పక్షం శాసనసభలో రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నది. అధికార పక్షాన్ని ఎండగట్టాలన్న వర్గం ఒకటయితే, చూసీచూడనట్టు పోవాలన్న ధోరణి మరో వర్గానిది. తెలుగుదేశం పరిస్థితి మరీ దారుణం. ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు కోట్లు ఉదంతంలో పట్టుబడి, జైలుకు కూడా వెళ్లి వచ్చిన రేవంత్‌రెడ్డిని పక్కన పెట్టుకుని ఆ పార్టీ ఎవరికి, ఏ నీతి చెప్పగలుగుతుంది శాసనసభలో? మరో పక్షం మజ్లిస్ ఉన్నా, అది అధి కార పక్షానికి కొంచెం దగ్గరగా, కొంచెం దూరంగా ఉంటుంది. వామపక్షాల ఉనికి అంతంత మాత్రమే. అందుకే అద్భుతమైన వాక్పటిమ కలిగిన అధికార పక్ష సభ్యుల ఎదురుదాడిని తట్టుకుని నిలబడటం ప్రతిపక్షాలకు కష్టమే.
datelinehyderabad@gmail.com
- దేవులపల్లి అమర్