తెలుగుకు సోకిన తెగుళ్లకు మందేది | No medicine for telugu language | Sakshi
Sakshi News home page

తెలుగుకు సోకిన తెగుళ్లకు మందేది

Published Tue, Sep 15 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

తెలుగుకు సోకిన తెగుళ్లకు మందేది

తెలుగుకు సోకిన తెగుళ్లకు మందేది

మనలో మనమే తగాదాలాడుకునే దుస్థితిని తెచ్చుకుని పరాయి భాషను అవసరంగా కాక, వ్యసనంగా మార్చుకుంటున్నాం. ఇంతకూ అసలు రహస్యం -నిత్య వాడకం ద్వారా మాతృభాషల మీద పిల్లలు అదుపు సాధించుకున్నప్పుడు ఆ భాషా పద, వాక్య, ఉచ్చారణ ప్రభావంలో ఇతర భాషలను ఎన్నయినా నేర్చుకోగలరని, నిలదొక్కుకోగలరని, బహుభాషా పాండిత్యమూ పొందగలరని ప్రపంచ భాషల చరిత్ర రుజువులు చూపుతోంది.
 
 ‘ఆంధ్ర అను పదము కులమును తెలుపదు. వర్ణమునకు వర్తించదు. మత మునకు సంబంధించదు. ఆంధ్రులు అంటే, తెలుగు మాట్లాడేవారు. అట్టి ఆంధ్రపదమునకు కొత్త అర్థమునిచ్చుటకు ఏ మాత్రమును మనకు అధికా రము లేదు.’    
- పండిత సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రులు వేరు, మేము తెలంగాణ వాళ్లం’     
 - రసమయి బాలకృష్ణ
 
 (తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు.
 కొద్దికాలం క్రితం ఒక టీవీ కార్యక్రమంలో అన్నట్టు వార్త)
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి తెలుగు పాఠ్యగ్రంథంలో ఇప్పటి దాకా ఉన్న హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గురిం చిన పాఠాన్ని తొలగించాలి. స్థానికతకు చెందని అంశాలను, పరిచయం లేని పదాలకు చెందిన 17 పాఠాలను తొలగించాలి. (ఏపీ పాఠశాల విద్యాశాఖ, ఎస్‌సీయూఆర్‌టీ సంచాలకులు జారీచేసిన ఉత్తర్వు-ఆర్‌సీ నం.279 బీ/సీ అండ్ టీ/ ఎస్‌సీఈఆర్‌టీ/ 2014. విడుదల తేదీ: 22-8-2015)  మంచికో చెడుకో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. విభ జన తరువాత కూడా రెండు రాష్ట్రాల పాలకులు పితపబుద్ధులు మానకోక పోగా, ప్రాపకం కోసం, అధికార ప్రయోజనాల కోసం ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య విభేదాలను కల్పిస్తున్నారు.
 
 తిండి, బట్ట, విద్య, ఉపాధి, వసతి కల్పన వంటి మౌలిక సమస్యలను పరిష్కరించలేని పాలకులే జాతి, భాష, కుల, మత వైషమ్యాలను ఆశ్రయిస్తా రని మానవజాతి చరిత్ర చెబు తున్న పాఠం. అటు తెలుగు శిష్ట భాషా ప్రతిపత్తిని సాధించుకుని ఒక స్థాయి లో గుర్తింపు పొందింది. ఇటు మాతృభాషగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశా లలు, కళాశాలల్లో-ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో కూడా- సహజ గౌరవ స్థానాన్ని నిలబెట్టుకోలేక సతమతమవుతోంది. పాలనాపరంగా పాలకుల మధ్య కీచులాటల ఫలితంగా ఒక వైపున తెలుగు మాతృభాషా ప్రతిపత్తికి చేటు దాపురించింది. మరొక వైపున రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవే టు విద్యాసంస్థలలో ‘ఆధునిక అవసరాలు’ పేరిట, ఉపాధి సౌకర్యాల పేరిట తెలుగు డిగ్రీ స్థాయి వరకు కూడా ఒక అం శంగానైనా కొనసాగించలేని దుర్దశ ప్రాప్తించింది. ప్రపంచ బ్యాంక్ తాఖీదుల పుణ్యమా అని, ఆంగ్ల విద్యాధికుల మోజుకు లోబడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంగ్లిష్ భాషా చరి త్రకన్నా ఎంతో పటిష్టమైన పునాదులపైన ఎదిగిన భాష తెలుగు. అది 2,500 సంవత్సరాల చరిత్ర కలిగిన భాష.
 
 మాతృభాషా ద్రోహానికి సమాధానం
 ఈ సందు చూసుకునే తమిళ ‘సోదరుడు’ ఒకడు తెలుగుకు శిష్ట భాషా ప్రతి పత్తిని ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, దానిని సవాలు చేస్తూ రిట్ దాఖలు చేశాడు. ఇది జరిగి ఏడేళ్లు గడుస్తోంది. అయినా తెలుగు పాల కులు పట్టించుకోకపోవడం వల్ల ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టు నిలి చిపోయింది. అన్నింటికన్నా చిత్రం, అవమానకరమైన విషయం- ‘ఈ భాష మాది కాదనీ, ఈ తెలుగు మాది కాదనీ’ ఒక ప్రాంతపు తెలుగు లాయరే (పైగా హైకోర్టు లాయరు. కేరాఫ్ ఎన్టీఆర్ స్టేడియం కాలనీ) ఆ తమిళ సోదరు డితో నిస్సిగ్గుగా చేతులు కలిపాడు. కానీ తమిళుడి రిట్ మీద విచారణ అనేక పర్యాయాలు వాయిదా పడింది. అయితే ఇటీవలనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా తాజా అఫిడవిట్లను దాఖలు చేశాయి.
 
  ఈ అంశంలో ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కృష్ణారావు (ఏపీ), రాజీవ్‌శర్మ (టీఎస్)లను ప్రశంసించాలి. ఎందుకంటే, తమిళుడి కొమ్ముకాసిన తెలుగు లాయరు చేసిన ద్రోహానికి విరుగుడు అన్నట్టు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఏకాభిప్రాయంతో అఫిడవిట్లు అందచేశారు. ఇదంతా చూసైనా ‘ఆంధ్రులు వేరు, తెలంగాణ వారు వేరు’ వంటి అభిప్రాయాలను సురవరం వారి మాట సాక్షిగా అయినా తుడిచివేసుకోవడం మంచిది. పైగా ‘తెలుగుకు విశిష్ట భాషా ప్రతిపత్తి’ అంశం మీద మద్రాస్ హైకోర్టులో నలుగుతున్న సమస్య మీద తుది విచారణ జరిగి ఈ నవంబర్ 23-24 తేదీలలో అంతిమ తీర్పు వెలువ డనున్నది.
 
 ఈ సమయంలో ఉభయ రాష్ట్రాల తెలుగు భాషాభిమానులు ఒక మాట మీద నిలబడాలి. మాండలిక భేదాలు ఒక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోనే ప్రతి 60 కిలో మీటర్లకు మారిపోతూ ఉంటాయి. రకరకాల ‘యాస’లతోనూ, భిన్న ఉచ్చా రణ భేదాలతోనూ ఉంటాయి. మాండలిక / ప్రాదేశిక సొగసులను కలుపు కుంటూ వర్ధిల్లని మాతృభాషలు ప్రపంచంలో ఉండవు. ఆ మాటకొస్తే వలస వాద, సామ్రాజ్యవాద దోపిడీకి గురికాని, ఎరగాని భాషలూ, ప్రభావితం గాని బాసలూ కూడా లేవు! అందుకే సురవరం వారు - ‘బ్రిటిష్ ఇలాకాలో ఇంగ్లీషున్నూ, హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూయున్నూ రాజభాషలగుట చేత ఈ రెంటి సంబంధం మనకు ఎక్కువగా అయిపోయింది. ఈ విషయంలో అక్కడి మన వారిది ఎంత తప్పో, ఇక్కడ మనదిన్నీ అంతే తప్పు... మన తెలంగాణ జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఏస కనబడుతున్నది. అంతే గాదు, ఒక జిల్లాలో సాధారణంగా వాడే పదాలు ఇంకొక జిల్లాలో కానరావు’ అనలేదూ! ఒకే జిల్లాలోనూ, ఒకే ప్రాంతంలోనూ ఎన్ని రకాల భాషా భేదా లున్నాయో సోదాహరణంగా ఆయన వివరించారు!
 
 గుర్తించాల్సిన వాస్తవాలు
 ఆ మాటకొస్తే ఇంగ్లిష్‌ను 16-17వ శతాబ్దాలలో జాతీయ భాషగా పార్లమెం టు ప్రకటించే వరకూ 300 సంవత్సరాల పాటు గ్రీక్, లాటిన్, ఫ్రెంచి భాషల భల్లూకపు పట్టులోనే మగ్గిపోయింది. కానీ అనేక పోరాటాల ద్వారా, ఉద్య మాల ద్వారా అంతిమ విజయం సాధించగలిగింది. అంటే, వలస దోపిడీ, పాలనా దాస్యాల నుంచి రాజకీయంగా విముక్తమైనా, భారతీయ భాషలు మాతృభాషా స్థానాలను కాపాడుకోలేకపోవడానికి ప్రధాన కారణం - పెట్టు బడుల మీద లాభాల కోసం దేశాల దారిద్య్రాన్ని ప్రపంచీకరించడం; తద్వారా ఆంగ్లభాషా ప్రతిపత్తిని స్థిరీకరించడమేనని మరవరాదు. జపనీస్, చైనీస్, కొరియన్ మాతృభాషలకు విద్యాబోధనలో తొలి ప్రాధాన్యం కల్పించి, వ్యాపార అవసరాల కోసం ఇంగ్లిష్‌ను మోతాదు మేరకు వాడుతున్నారన్న వాస్తవాన్ని గుర్తించడం మనకూ అవసరమే.
 
 ఈ స్పృహ లేకపోవడంతోనే మాతృభాషను ఈసడించుకుని, మనలో మనమే తగాదాలాడుకునే దుస్థితిని తెచ్చుకుని పరాయి భాషను అవసరంగా కాక, వ్యసనంగా మార్చుకుంటు న్నాం. ఇంతకూ అసలు రహస్యం -నిత్య వాడకం ద్వారా మాతృభాషల మీద పిల్లలు అదుపు సాధించుకున్నప్పుడు ఆ భాషా పద, వాక్య, ఉచ్చారణ ప్రభా వంలో ఇతర భాషలను ఎన్నయినా నేర్చుకోగలరని, నిలదొక్కుకోగలరని, బహుభాషా పాండిత్యమూ పొందగలరని ప్రపంచ భాషల చరిత్ర రుజువులు చూపుతోంది.
 
 అందుకే ప్రజాకవి కాళోజీ కూడా ఘాటుగానే అనవలసి వచ్చిం ది: ‘అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకించు ఆంధ్రుడా!/ఏ భాషరా నీది? ఏమి వేషమురా?/ఈ భాష ఈ వేషమెవరికోసమురా’ అని ఆగ్రహిం చాడు. తిడితేనన్నా తెలుగువాడు బాగుపడతాడేమోనన్న ఆశతో ‘‘చావవెందు కురా’’ అని ఒక శాపనార్థం కూడా వదిలి చూశాడు. కాళోజీ కన్నా ముందు ‘సవర’ భాషా సూర్యుడు గిడుగు వారు భాషా పరిణామాన్ని గోదావరి ఉప మానంతో ఇలా పేర్కొన్నాడు: ‘నన్నయ నాటి తెలుగు భాషే నేటికీ ఉండా లనుకోవడం అవివేకం. నన్నయ్య నాటి గోదావరే ఈనాడూ ప్రవహిస్తోంది. కాని ఆనాటి గోదావరి జలాలు మాత్రం ఈనాటివి కావు! అందుకే ‘నిత్య ప్రవాహినీ దేశ్యా’ (దేశీభాషలు) అన్నారు!
 
ఉభయులు తెలుగు బోధనకు విలువ ఇవ్వాలి
 ప్రపంచీకరణ నేపథ్యంలో మన రెండు రాష్ట్రాలూ ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా ‘తెలుగు’ మాతృభాషను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో కూడా బోధించి తీరాలి. నాలుగు నాలుగులు (గీ) అంటే 16 అని నోటితో ‘ఠక్’మని చెప్పడానికి కాలిక్యులేటర్ విప్పితే గాని చెప్పలేని దుస్థితిలో మన తెలుగు పిల్లలు ఉన్నారని చెప్పుకోవటం గణితశాస్త్రంలో ఉద్దండ పండితుల్ని తలకె త్తుకున్న భారతీయ, తెలుగు భాషలను మరచిపోరాదు! ‘ఆంధ్ర’ శబ్దాన్నీ, తెలుగు వాళ్లంటే ఆంధ్రులనీ పదే పదే గుర్తు చేసిన సురవరం, కాళోజీ, దాశ రథులు ‘అన్నపూర్ణ నామాంకిత ఆంధ్రావని సౌభాగ్యాన్నీ,’ ‘సేద్యమంటే సంబరపడిన కాపుబిడ్డ తెలుగు వాడూ తెలుగువాడే’నని పదే పదే గుర్తు చేయ బట్టే-‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులు కూడా తన వంతు గొంతును ఇలా బలంగా వినిపించారు:

‘‘ప్రాచ్యదేశాంధ్ర‘‘ శ్రీమహాభారత మ్ము’’/భవ్య తెలంగాణ ‘‘శ్రీమహాభాగవతము’’/ మహిత రాయలసీమ ‘‘రామాయణమ్ము’’/ఘన ‘‘త్రివేణీ’’ సమాగమాకరమూనె’’ అన్నారు! ఆ ఆకారాన్ని ఇప్పుడు వికారంగా మనం మార్చుకున్నా దాన్ని ‘గతం గతంగా’ భావించి ఇకనైనా హుందాగా ఉభయులు తెలుగు దీప్తితో, తెలుగు కీర్తితో, దిగులుపడకుండా తెగులు పట్టకుండా ఆచంద్ర తారార్కం వెలుగొందుగాక!
 (వ్యాసకర్త మొబైల్: 9848318414)
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement