మూలాలు మరచిపోని ఆంధ్రులు | Non resident indian telugu people like social service | Sakshi
Sakshi News home page

మూలాలు మరచిపోని ఆంధ్రులు

Published Thu, Jan 9 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

మూలాలు మరచిపోని ఆంధ్రులు

మూలాలు మరచిపోని ఆంధ్రులు

 ప్రతి సంవత్సరంలాగే ఈసారి జనవరి 7-9 మధ్య భారత ప్రభుత్వం ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో తెలుగువారి కృషి; స్వదేశానికీ, స్వస్థలాలకు వారు అందిస్తున్న చేయూతలను గురించి గుర్తుచేసుకోవాలి. జనవరి 9,1914న గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు. ఆ రోజునే ఈ కార్యక్రమం కోసం భారత ప్రభుత్వం ఎంచుకుంది.
 
 1960 నుంచే అమెరికాలో తెలుగువాళ్ల సంఖ్య పెరగడం మొదలైంది. సాఫ్ట్‌వేర్ బూమ్ తరువాత 2000 సంవత్సరంలో తెలుగువారైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పెద్ద ఎత్తున అమెరికా వెళ్లారు. ఇప్పుడు అమెరికా సం యుక్త రాష్ట్రాలలో తెలుగువారి సంఖ్య పది లక్షలకు చేరుకుందని అంచనా.
 
  పరాయి దేశం. భాష వేరు. సంస్కృతి వేరు. అక్కడ మాతృభాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాలన్న తపన తెలుగువారందరిలో కనిపిస్తుంది. తెలుగునాట కొన్ని కళలను మరచి పోయి ఉండవచ్చు గానీ, అమెరికా తెలుగువారు మాత్రం అన్ని కళలను ఆదరిస్తున్నారు. మాతృభాషను మరచిపోకుండా నిత్య జీవి తంలో ఒక భాగం చేసుకున్నారు. అక్కడ ఏటా సాహిత్య ఉత్సవాలను జరుపుకుంటున్నారు. పెద్ద పెద్ద నగరాలలో కవి సమ్మేళనా లు జరుగుతున్నాయి. వంగూరి ఫౌండేషన్, అప్పాజోస్యుల, విష్ణుభట్ల, కిదాంబి ఫౌండేషన్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అమెరికా నలుమూలలా ‘మనబడి’ని ఏర్పా టు చేసి తెలుగు పిల్లల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. రెండో తరంలో కూడా తెలుగు నిలబడి ఉందంటే కారణం ఇవే.
 
 అమెరికాలో తెలుగు పత్రికల నిర్వహణ కూడా దిగ్విజయంగా సాగుతోంది. అట్లాం టాకు చెందిన పెమ్మరాజు వేణుగోపాలరావు, గవరసాన సత్యనారాయణరావు ‘తెలుగు భాష పత్రిక’ను స్థాపించి, భాషా సేవ చేశారు. విజ్ఞాన శాస్త్ర అంశాలను తెలుగులో అందించడమే ఈ పత్రిక ఉద్దేశం. 1968 నాటి ‘కంప్యూటర్లు’ పుస్తకం ఇందులో ధారావాహికంగా వెలువడింది.  వేమూరి వెంకటేశ్వరావు రాసిన ఈ రచన కంప్యూటర్ల మీద వచ్చిన తొలి తెలు గు పుస్తకంగా ఖ్యాతి చెందింది. ‘ఈమాట’ (1998, మొదటి తెలుగు వెబ్ మ్యాగజైన్), ‘తెలుగుజ్యోతి’ (1983, కిడాంబి రఘునాథ్), ‘బ్రాహ్మి’ (శొంఠి శారదాపూర్ణ) పత్రికలను అక్కడ నుంచి ప్రచురిస్తున్నారు. ‘తెలుగునాడి’ (జంపాల చౌదరి), ‘తెలుగు అమెరికా’ (దండమూడి రామమోహనరావు) కొద్దికాలం వెలువడినాయి.
 
 ‘తెలుగు టైమ్స్’ పదేళ్ల నుంచి వెలువడుతోంది. అమెరికాలో ప్రతి నగరంలోను తెలుగు సంఘాలు ఉన్నాయి. వీటిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘ (తానా),అమెరికా తెలుగు సంఘం (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) ప్రముఖంగా సేవలు అందిస్తున్నాయి. తెలుగువారి విద్యాభివృద్ధి, భాష, సంస్కృతుల పరిరక్షణకు ఇవన్నీ రకరకాలుగా పాటు పడుతున్నాయి.
 ప్రవాసాంధ్రులు సొంత  గడ్డకు సేవలందించడంతో పాటు, రాష్ట్ర రాజకీయాలలో కూడా కీలకమైన స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ ధోరణి బలపడింది. చంద్రబాబు చేపట్టిన జన్మభూమి వీరికి మరింత ఊతమిచ్చింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత చాలామంది జగన్ వైపు మొగ్గారు. వీరంతా ఒకప్పుడు కాంగ్రెస్ అభిమానులు.
 
 ఆత్మచరణ్‌రెడ్డి, మధుయాష్కీ ఎంపీలుగా ఎన్నికయ్యారు. గల్లా అరుణ, జితేందర్‌రెడ్డి కూడా ఇలాంటి సేవలోనే ఉన్నారు. జయరాం కోమటి, సతీష్ వేమన, పాలెం శ్రీకాంత్‌రెడ్డి, ఎం. వెంకటరమణ (టీడీపీ), మహేశ్ సలాడి, గడ్డం దశరథరామిరెడ్డి, నాగేశ్వరరావు (కాంగ్రెస్), డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి, వీరారెడ్డి, సురేశ్ ఉయ్యూరి, నగేశ్ (వైఎస్‌ఆర్‌సీపీ), చవ్వా విజయ్, జానకి రామరెడ్డి, రాజు చిం తల (టీఆర్‌ఎస్) వంటి వారు రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉన్నారు. అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా తమ లక్ష్యాలు నెరవేరిన తరువాత స్వస్థలాలకు చేరుకున్న వారూ ఉన్నారు.
 
  గల్లా రామచంద్రనాయుడు, రవి రెడ్డి సన్నారెడ్డి ఇలాంటి వారే. స్వచ్ఛంద సేవకు ముందుకొచ్చిన ప్రవాసులు కూడా ఎందరో ఉన్నారు. డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, డాక్టర్ హనిమరెడ్డి, జయరాం కోమటి, మోహన్ నన్నపనేని, కాట్రగడ్డ కృష్ణప్రసాద్ వంటి వారు కోట్లు వెచ్చించి తమ తమ ప్రాం తాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. తమ మూలాలను మరచిపోని ప్రవాసాంధ్రులు ఇంకా ఎందరో!
 
 చెన్నూరి వెంకటసుబ్బారావు,  (‘తెలుగు టైమ్స్’ సంపాదకుడు, ఎండీ)  (జనవరి 9 ప్రవాసీ భారతీయ దివస్)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement