Chennuri Venkata subbarao
-
అమెరికాలో వెల్లివిరుస్తున్న 'భారతీయం'.. మునుపు ఎన్నడూ లేనంతగా!
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు అనటం కంటే కూడా అగ్రరాజ్యంలో మునుపు ఎన్నడూ లేనంతగా ఉనికి చాటుకొనేలా, అందరూ గుర్తించేలా మనవాళ్లు ఉంటున్నారని చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్వయంగా వైట్‌హౌస్‌లో దివాలి వేడుకలు చెయ్యటం, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా దివాలి వేడుకలలో పాల్గొనటం మనవాళ్ల ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది. వైట్‌హౌస్‌లో దీపావళి... బైడెన్ ఆతిధ్యంపై భారతీయుల సంతోషం అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో నిలిచిపోయేలా అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ వేళ వైట్‌హౌస్ దీపాల వెలుగులతో మెరిసిపోయింది. బైడెన్ దంపతులు ఈ సందర్భంగా నిర్వహించిన ‘దీపావళి రిసెప్షన్’కి 200 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ సంబరాలలో పూర్తి భారతీయత కనిపించడం విశేషం. సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. సితారిస్ట్ రిషబ్ శర్మ, ఎస్ఏ డ్యాన్స్ కంపెనీ ట్రూపు ఆధ్వర్యాన సాగిన ఆర్టిస్టుల డ్యాన్సులు, వారి పర్ఫామెన్స్ కట్టి పడేశాయి. గెస్టుల వస్త్ర ధారణ చూస్తే ఇండియాలోనే ఉన్నట్టు అనిపించేలా కనిపించిందని చెబుతున్నారు. దీపావళి సందర్భంగా జోబైడెన్ దంపతుల విశిష్ట ఆదరణను మరిచిపోలేమని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అతుల్ కేశప్ వ్యాఖ్యానించారు. ఈ ఆతిథ్యాన్ని అందుకోవడం ఓ గొప్ప ప్రివిలేజ్ అని టీవీ ఏసియా సీఈఓహెచ్ఆర్ షా పేర్కొన్నారు. అలాగే ఆసియన్ అమెరికన్స్ పై గల అడ్వైజరీ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటారియా .. దక్షిణాసియా వాసులను బైడెన్ ప్రభుత్వం ఎంతగా గౌరవిస్తుందో ఈ ఈవెంట్ నిరూపిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం 130 మందికి పైగా ఇండియన్ అమెరికన్లను ఉన్నత స్థానాల్లో నియమించిందని ఆయన చెప్పారు. అంతకు ముందు బైడెన్ దంపతులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ.. ‘మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు పెద్దసంఖ్యలో ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా-దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరవంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అమెరికా వృద్ధిలో ఇండో అమెరికన్ల కృషి చాలా ఉందని బైడెన్ చెప్పారు. కరోనా సమయంలో సైతం ఇక్కడి ప్రవాస భారతీయులు దేశ సేవకే అంకితమయ్యారని ఆయన ప్రశంసించారు. వీరి కృషిని తాము సదా గుర్తుంచుకుంటామన్నారు. దేశం ఆర్థికంగా ఎదిగేందుకు తాము ప్రవాస భారతీయుల సేవలను ఎప్పుడూ ఉపయోగించుకుంటామన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు ప్రత్యేక అతిథులు ఈ దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఆహ్వానించారు. దీని ద్వారా డిఫర్డ్ యాక్షన్ లీగల్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏఎల్‌సీఏ) పిల్లలకు సంఫీుభావం తెలుపుతున్న సందేశాన్ని ఆయన అందించారని భావిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలసి అమెరికా వెళ్లి, అక్కడ నివసించడానికి తగిన పత్రాలు లేని పిల్లలు డీఏసీఎల్‌ఏలో ఉన్నారు. వీరిని ఎప్పుడైనా అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. డీఏఎల్‌సీఏ పిల్లల తరఫున పోరాడుతున్న ‘ఇంప్రూవ్ ద డ్రీమ్’సంస్థ వ్యవస్థాపకుడు దీప్ పటేల్‌తోపాటు పరీన్ మహత్రే, అతుల్య రాజ్‌కుమార్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధ్యక్షుడు బైడన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలసి దీపావళి వేడుకల్లో పాల్గొనడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శుక్రవారం(అక్టోబర్ 28) నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారి నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరికీ కమలా హ్యారిస్ దంపతులు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు. కమలా హ్యారిస్.. అతిథులతో కలిసి బాణాసంచా కాల్చారు. దీపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని వ్యాఖ్యానించారు. ‘అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటిని తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి’అని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. అమెరికాలో భారతీయ సంతతి వారి ప్రభావం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దీపావళి పండుగ.. అమెరికాలో ముఖ్య వేడుకగా ప్రాముఖ్యం సంతరించుకుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాల్లోనూ దీపావళి వేడుకలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దీపావళి వేడుకలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగోలో(ఫ్లోరిడా రాష్ట్రం) పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు భారతీయ అమెరికన్లతోపాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, జగదీశ్ ప్రభలతోపాటు అనేక మంది తెలుగు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన శలభ్‌కుమార్, సతీష్ వేమన, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ, దీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో పలు ప్రధాన విషయాలను ట్రంప్ ప్రస్తావించారు. భారతదేశం, అమెరికా దౌత్య సంబంధాలు.. పరస్పర సహాయ సహకారాలు ఉన్నత శ్రేణిలో కొనసాగాలని ఆకాంక్షించారు. అదే విధంగా తన 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వాన్ని, సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే కాలంలో ఈ సహకారం ఇలాగే అందించాలని విజ్ఞప్తి చేస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చి.. సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో భాగస్వాములను చేస్తామని.. శలభ్ కుమార్‌ను తమ తరపు భారత రాయబారిగా నియమిస్తామని తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పధాన్ని అవలంభించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను మట్టుబెడతామన్నారు. భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలోఐనా కస్టపడి, సానుకూల దృక్పధంతో సాగే వారి స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టిందని, మంచి ఎక్కడున్నా అందరూ అవలంబించాలని, నేర్చుకోవాలని సూచిస్తూ.. విభిన్న వ్యక్తులు, భాషలు, ప్రాంతాలు, దేశాల సమాహారమే అమెరికా అని, ప్రతిభకు పట్టం కట్టే విధానంతో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని ఉద్ఘాటించారు. అదే విధంగా భారతీయుల పట్ల, హిందువుల సంస్కృతీ, సంప్రదాయాలపట్ల తనకు గౌరవమని.. వారి అపార ప్రతిభ పాటవాలు పరస్పరం ఇరుదేశాల అభివృద్ధికి తోడ్పడాలని అభిలషిస్తూ, భారత అమెరికా సంబంధాలు అత్యున్నత స్నేహపూర్వకంగా నిలిపేందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సాంప్రదాయక విందు పలువురిని ఆకర్షించింది. పూర్తి సంప్రదాయ బద్దంగా అన్ని భాషల, రాష్ట్రాల వంటల రుచులను ప్రత్యేకంగా అతిధులకు అందించటం జరిగింది.. ఒక్కొక్క అతిథికి విందుకు సుమారు 85,000 రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేశారు. కాగా కార్యక్రమం నిర్వాహకులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే అతిథులను ఈ వేడుకలకు అనుమతించారు. ఇలా వచ్చిన వారిలో కేవలం ఇద్దరు తెలుగు వారికి మాత్రమే ట్రంప్‌తో కలిసి ఫొటో దిగే అవకాశం లభించడం గమనార్హం. వారిలో తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు, జగదీశ్ ప్రభల కూడా ఉన్నారు. భారత్ అంటే ఎంతో అభిమానమన్న ట్రంప్ తన నివాసం ‘మార్-ఎ-లాగో’లో దీపావళి వేడుకలు నిర్వహించినందుకు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ హిందూ కోఅలియేషన్ (ఆర్‌హెచ్‌సీ) సహకారంతోనే కీలకమైన ప్రాంతాల్లో 4 లక్షల మంది ఓటర్లు తమ పార్టీకి ఓటేసినట్లు ఆయన అంగీకరించారు. ఈ క్రమంలోనే ఆర్ఎన్సీ, ఎన్ఆర్సీసీ, ఎన్ఎస్ఆర్సీ వంటి హిందూ కోఅలియేషన్లకు చైర్మన్‌గా షల్లీ కుమార్ (శలభ్ కుమార్)ను నియమించాలని ట్రంప్ ప్రతిపాదించారు. 2024లో తాను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే ఆ సమయంలో తన హిందూ కోలియేషన్ విభాగం అధినేతగా షల్లీ కుమార్‌ను నియమిస్తానని చెప్పారు. ఆర్‌హెచ్‌సీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోని నైపుణ్యాలను మెచ్చుకున్న ట్రంప్.. తాను అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే ఆర్‌హెచ్‌సీ సభ్యులను పరిపాలనలో భాగం చేస్తానని హామీ ఇచ్చారు. హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని తాను కూడా సందర్శిస్తానని, ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానిస్తానని అన్నారు. పాకిస్తాన్‌కు మిలటరీ ఆయుధాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటానని, ఎఫ్16 విమానాల అమ్మకాన్ని కూడా అడ్డుకుంటాన్నారు. చైనా దిగుమతులపై పన్నులు కొనసాగిస్తానని చెప్పారు. అలాగే షల్లీ కుమార్ రచిస్తున్న ‘చైనీస్ కాలనైజేషన్ ఆఫ్ అమెరికా 2049 అండ్ ది ఓన్లీ మ్యాన్ హు కెన్ స్టాప్ ఇట్’అనే పుస్తకానికి తన వంతు సహకారం చేస్తానని, ఆ పుస్తకం ‘ముందుమాట’ను రచిస్తానని ట్రంప్ మాటిచ్చారు. డీఏఎల్‌సీఏ చిన్నారులు దేశ బహిష్కరణకు గురికాకుండా కాపాడటానికి కృషి చేస్తానని, గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. భారతదేశం, హిందువులు అంటే తనకు చాలా అభిమానమని చెప్పిన ట్రంప్.. ‘షల్లీ అండ్ ట్రంప్ సబ్సే అచ్ఛే దోస్త్.. అండ్ భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్ఛే దోస్త్’ అంటూ తన ప్రసంగం ముగించారు. టెక్సాస్ గవర్నర్ ఇంట్లో దీపావళి వేడుకలు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్, సతీమణి సిసిలియా దంపతులు టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ పట్టణంలో తమ నివాస గృహంలో అక్టోబర్ 23న వైభవంగా దీపావళి వేడుకలు జరిపారు. ఆ వేడుకలకు టెక్సాస్ రాష్ట్రం నుంచి అనేక మంది భారతీయ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భగా గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్ మాట్లాడుతూ.. ‘దీపావళి పండుగ ముందరి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకురావాల’ని అన్నారు. తానా మాజీ అధ్యక్షులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర.. గవర్నర్ దంపతులకు అభినందనలు తెలిపారు. (క్లిక్ చేయండి: బ్రిటన్ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ) న్యూయార్క్‌లో టైం స్క్వేర్ వద్ద దీపావళి వేడుకలు న్యూయార్క్ నగరం లోని కొందరు భారతీయ ప్రముఖులు కలిసి అక్టోబర్ 15న న్యూ యార్క్ నగర బొడ్డున వున్నా టైం స్క్వేర్ సెంటర్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. న్యూ యార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ముఖ్య అతిధిగా వచ్చి భారతీయ సంతతిని, భారతీయ సంస్కృతిని, పండుగలను అభినందించారు. 2023 నుంచి న్యూయార్క్ నగరంలోని అన్ని పబ్లిక్ స్కూల్స్‌కి దీపావళి పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని ప్రకటించారు. తెలుగు వారిలో ప్రముఖులైన డాక్టర్ నోరి దత్తాత్రేయులుని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సన్మానించారు. తెలుగు నాయకులు రాజేందర్ డిచ్పల్లి.. మేయర్ ఎరిక్ ఆడమ్స్కి అభినందనలు తెలిపారు. - వేంకట సుబ్బారావు చెన్నూరి అమెరికాలో ప్రచురితమయ్యే తెలుగు టైమ్స్ సంపాదకులు -
మందులు దొరక్క ఎన్ఆర్ఐల ఇక్కట్లు
అమెరికాలో ఎన్నారైలు ఎప్పుడూ ఎదురుచూడని సంక్లిష్ట స్థితిని నేడు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న ఎన్నారైలు ఎక్కువమంది 35–45 ఏళ్ల వయస్సులోని వారే. దాంతో వారు తమకు తోడుగా తల్లిదండ్రులను, అత్తమామలను అమెరికాకు పిలిపించుకోవడం మామూలే. విజిటర్స్ వీసా మీద వారు వచ్చి ఆరునెలలు తమ పిల్లలకు సహాయంగా ఉంటూ ఇండియాకు వెళుతుంటారు. తాము ఉండే కాలానికి తగ్గట్టుగా షుగర్, బీపీ, ఇతర మందులను వారు భారత్ నుంచి తమతో తెచ్చుకుంటారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ అమెరికాను అష్టదిగ్బంధనం చేయడంతో వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. లాక్‌డౌన్‌తో వారు ఇండియాకు వెళ్ళలేని పరిస్థితి. అమెరికాలో ఉందామంటే తెచ్చుకున్న మందులు అయిపోయి మందులకోసం వారు పడుతున్న కష్టాలు చెప్పనలవి కావు. టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ తది తర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో తెలుగువాళ్ళు ఉన్నారు. తాము ఉండాల్సిన కాలానికి తెచ్చుకున్న బీపీ, షుగర్, ఇతర మందులు అయిపోవడంతో ఆ మందులకోసం వారు పడరాని కష్టాలు పడుతున్నారు. మామూలు సమయాల్లో ఇలాంటివారు ఇండియా నుంచి వచ్చేవారితో, లేదా తెలిసినవారి ద్వారా ఇండియానుంచి మందులను తెప్పించుకుంటారు. కానీ, లాక్డౌన్ వేళలో ఇండియా నుంచి మందులు వచ్చే పరిస్థితి లేదు. అమెరికాలోనే మందులు కొందామంటే తమ వల్ల కావడం లేదని పలువురు తల్లిదండ్రులు, అత్తమామలు వాపోతున్నారు. ఎందుకంటే భారతదేశంలో లాగా వీధి చివర ఉన్న మందుల షాపుకు వెళ్ళి తీసుకుని వచ్చేంత ఈజీగా అమెరికాలో కుదరదు. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. పేషెంట్‌కు మందులు ఇవ్వాలని డాక్టర్ ఇచ్చే ప్రిస్కిప్షన్తోపాటు, వాళ్ళు ఎంౖMð్వరీలు చేసిన తరువాతనే మందులను ఇస్తారు. ఎవరైనా ఫార్మసీ షాప్‌కు వెళ్ళి తమ డాక్టర్ ఇచ్చిన చీటి చూపగానే వాళ్ళు డాక్టర్ ఎవరో నిర్దారిం చుకుని ఎన్పీఐ (నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిఫికేషన్) నెంబర్ అడుగుతారు. అలాగే డీఈఏ (డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ) నెంబర్ అడుగుతారు. ఇప్పుడు తెలుగువారికి సహాయం చేయడంకోసం ముందుకు వచ్చిన డాక్టర్లు కూడా ఒక్కో ఫార్మసిస్ట్తో మాట్లాడి, ఒక్కో కేసు విశదీకరించేందుకు సమయం చాలడం లేదు. దానికితోడు ఆ ఫార్మసిస్ట్‌ను ఒక్కో కేసుకు సంబంధించి కన్విన్స్ చేయడం కుదరడం లేదు. ఈ విషయంపై శాండియాగోలో వున్న హైదరాబాద్ వాస్తవ్యులు పాలకోడేటి ప్రభాకర్, ఉష దంపతులు మాట్లాడుతూ తాముతమ కుమార్తె స్వాతి దగ్గరకు వచ్చామని, తిరుగు ప్రయాణం అనుకున్నట్టుగా ఏప్రిల్ నెలలో వెళ్ళలేమని, తమ మందులు అయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డల్లాస్‌లో తెలుగు వారికి సుపరిచితులైన డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ మాట్లాడుతూ వ్యక్తిగతంగా చాలా ఏళ్లుగా తనకు తెలిసిన తెలుగువారి తల్లిదండ్రుల మెడికల్ అవసరాలకు సహాయపడుతూ ఉంటానని, ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ సమస్య పెద్దది అయ్యిందని, ప్రతి పట్టణంలో తనలాంటి డాక్టర్లు కలిసి కొంతవరకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఫిలడెల్ఫియాలో నివసిస్తున్న నాగరాజు నలజుల మాట్లాడుతూ చాలామంది తెలుగు వారు తమ ఇంటిలో వున్న పెద్దవారి మెడికల్ అవసరాలకు సహాయం కోసం వస్తున్నారని, మా పట్టణంలోనే వున్న డాక్టర్ ప్రమీల నాయుడుగారు వారికి సలహాలు ఇస్తున్నారని, ఆవసరం అయితే పేషెంట్‌గా గుర్తించి వైద్య సదుపాయాలు కూడా చేస్తున్నారని తెలిపారు. బే ఏరియాలో వున్న తానా ఉపకోశాధికారి వెంకట్ కోగంటి మాట్లాడుతూ అమెరికాలో వచ్చిన విజిటర్స్ తగిన ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండా మెడికల్ సౌలభ్యం పొందటం కష్టమే కాకుండా చట్టరీత్యా తప్పు కూడా కనుక తెలుగువారు ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవాలి అన్నారు. ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ, ఒకట్రెండురోజుల్లో ఒక డాక్టర్ ప్యానెల్ ఏర్పాటు చేసి వారిని ఈ–మెయిల్ ద్వారా సంప్రదించే ఏర్పాటు చేస్తామని, అప్పుడు ఆ డాక్టర్లు కూడా వారి ఫ్రీ టైమ్‌లో వారికి వచ్చిన ఈ–మెయిల్ చూసి ప్రిస్క్రిప్షన్‌లో ఉన్న మందులను గుర్తించి వారికి ఈ– మెయిల్ ద్వారా జవాబు ఇస్తారని చెప్పారు. అప్పుడు ఎవరికి వారు తమ దగ్గరలో ఉన్న ఫార్మసిస్ట్ దగ్గరకు వెళ్లి ఆ మందులు కొనుక్కొని వారి తల్లిదండ్రులు, అత్తమామలను వీలున్నంతవరకు అటెండ్ కావచ్చని పరమేష్ భీంరెడ్డి తెలిపారు. చెన్నూరి వేంకట సుబ్బారావు వ్యాసకర్త సంపాదకులు, తెలుగుటైమ్స్ పత్రిక, అమెరికా -
అమెరికాలో మనవాళ్లు క్షేమమే
ఇదివరకు అమెరికా తుమ్మితే, ప్రపంచానికి జలుబు చేస్తుంది అనేవారు. కానీ ఇప్పటి పరిస్థితి అలాగా లేదు. అమెరికాకు జలుబు చేయడమే కాకుండా మంచం ఎక్కే పరిస్థితి వచ్చినా, ఇండియా లాంటి దేశాలు తుమ్ములు కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మొత్తానికి ఏప్రిల్ 30 వరకు సామాజిక దూరం పాటించాలని ప్రకటించారు అంటే అమెరికా ఎలాంటి సంక్షోభంలో ఉందో అర్థం అవుతోంది. అమెరికాలో కూడా సామాజిక మాధ్యమాల్లోనూ, చానెళ్లలోనూ కరోనా వ్యాధిగ్రస్తుల గురించి, మరణాల గురించి రకరకాల సంఖ్యలు వస్తున్నా అధికారికంగా సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సీడీసీ) ఇచ్చే లెక్కలనే అందరూ విశ్వసిస్తారు. కరోనా వైరస్ బాగా ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సి రాష్ట్రాల గవర్నర్లు కూడా కరోనా సంక్షోభంలో తమ తమ విధులను నిర్వర్తిస్తూనే మరోవైపు ఎప్పటికప్పుడు వాళ్ళ వెబ్సైట్లలో ఈ వైరస్ విషయమై గందరగోళం లేకుండా వివరాలు ఇస్తుంటారు. మార్చి 31 నాటికి అమెరికా 1,65,000 కేసులతో 3000కు పైగా మరణాలతో అగ్రస్థానంలో ఉంది. అమెరికాలోని 50 రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృం భించింది. ఈరోజుకీ న్యూయార్క్ రాష్ట్రం లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మాన్ హట్టన్ నగరం ప్రపంచ వాణిజ్యానికి మూలస్తంభం లాంటిది.. అక్కడ జన సాంద్రత కూడా ఎక్కువే.. అలాంటి నగ రంలో కరోనా కట్టడి చేయకపోవటంతో కరోనా పూర్తిగా ప్రబలింది. ఓ వారం రోజుల క్రితమే సైన్యాన్ని దింపి నగరాన్ని కట్టడి చేయడం మొదలు పెట్టారు కానీ అది చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందాన వుంది అని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్షం డెమోక్రాటిక్ పార్టీ విరుచుకుపడుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో స్పీకర్ నాన్సి పెలోసి సీఎన్ఎన్ఎన్తో మాట్లాడుతూ ట్రంప్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు రిపబ్లిక్ పార్టీ కూడా వెంటనే స్పందించి ట్రంప్ ప్రభుత్వం ఇప్పుటివరకు ఎవరూ చేయని విధంగా 2లక్షల కోట్ల డాలర్లను కేటాయించారని గుర్తు చేశారు. అమెరికాలో పేదవారికి, నిరుద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం సాయం మొదలుపెట్టిందని, అంతే వేగంతో చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు, పరిశ్రమలకు కూడా అనేక వెసులుబాట్లు కల్పించి ఆదుకునేందుకు చర్యలు తీసుకుందని జవాబిచ్చారు. ప్రతి రాష్ట్రం తన శక్తిమేరకు నివారణ చర్యలు తీసుకుంది. అమెరికాలో మెజారిటీ ప్రజలకు వైద్య బీమా వుంటేనే చికిత్స జరుగుతుంటుంది. వివిధ బీమా సంస్థలు అందుకు సహకరిస్తున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూస్కమ్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 15–20 తేదీల మధ్యనే చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రవేశపెట్టాయి. ఫిబ్రవరి 20 నుంచే కాలిఫోర్నియా రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రవేశపెట్టి బయటతిరగడాన్ని పూర్తిగా నిషేధిం చారు. అందువల్లే మార్చి నెలాఖరుకు కాలిఫోర్నియా రాష్ట్రంలో కేవలం 16,000 వరకు కేసులు ఉండగా, న్యూయార్క్‌లో 1,63,000 కేసులు, న్యూజెర్సిలో 67,000 కేసులు నమోదయ్యాయి. అదృష్టవశాత్తు తెలుగువారు క్షేమంగా ఉన్నారని సమాచారం అందుతోంది. ఇప్పటివరకూ భారతీయులెవరూ కరోనా బారిన పడ్డట్లు లేదు. దాదాపు అన్ని తెలుగు సంఘాలు కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. తానా అన్ని ప్రాంతాల్లో వెబి నార్ నిర్వహించి తెలుగువారిని చైతన్యపరచింది. గోఫండ్ ద్వారా దాదాపు లక్ష డాలర్ల నుంచి పది లక్షల డాలర్ల దాకా విరాళాలు సేకరించే పనిలో ఉన్నామని, ఆ నిధులను కరోనా బాధితులకు, కుటుంబాలకు ఉపయోగిస్తామని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి తెలిపారు. ఆటా అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ మహాసభలను వాయిదా వేశామన్నారు. నాటా అధ్యక్షులు రాఘవరెడ్డి గోసల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు నాటా తరపున రూ.10 లక్షలు ఇచ్చామని తెలిపారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మాట్లాడుతూ అందరికీ తమ సంస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాలిఫోర్నియాలో ఉంటున్న సురేష్ రెడ్డి ఉయ్యూరు మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రభావం తీవ్రత ఎక్కువగానే ఉండటం వల్ల 4వారాల నుంచి తాము ఇళ్ళకే పరిమితమవుతున్నామని చెప్పారు. వాల్ మార్ట్, కాస్ట్ కో లాంటి పెద్ద సంస్థలు బాగా పని చేస్తూ నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాయని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్న శ్రావ్య చెన్నూరి తెలిపారు. బే ఏరియా తెలుగు సంఘం పూర్వ అధ్యక్షులు వీరు ఉప్పల మాట్లాడుతూ, అందరూ ఇళ్ళకే పరిమితమవడం అనేది అమెరికాలోని పిల్లలకు కొత్త అనుభవమని, చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు కలిసి మొదటిసారిగా ఆనందకరమైన కుటుంబ జీవితం గడుపుతున్నారని చెప్పారు. ఏప్రిల్ నెలాఖరునాటికి అయినా సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశించాలి. చెన్నూరి వేంకట సుబ్బారావు వ్యాసకర్త తెలుగుటైమ్స్ పత్రిక సంపాదకులు, అమెరికా -
మూలాలు మరచిపోని ఆంధ్రులు
ప్రతి సంవత్సరంలాగే ఈసారి జనవరి 7-9 మధ్య భారత ప్రభుత్వం ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో తెలుగువారి కృషి; స్వదేశానికీ, స్వస్థలాలకు వారు అందిస్తున్న చేయూతలను గురించి గుర్తుచేసుకోవాలి. జనవరి 9,1914న గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు. ఆ రోజునే ఈ కార్యక్రమం కోసం భారత ప్రభుత్వం ఎంచుకుంది. 1960 నుంచే అమెరికాలో తెలుగువాళ్ల సంఖ్య పెరగడం మొదలైంది. సాఫ్ట్వేర్ బూమ్ తరువాత 2000 సంవత్సరంలో తెలుగువారైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద ఎత్తున అమెరికా వెళ్లారు. ఇప్పుడు అమెరికా సం యుక్త రాష్ట్రాలలో తెలుగువారి సంఖ్య పది లక్షలకు చేరుకుందని అంచనా. పరాయి దేశం. భాష వేరు. సంస్కృతి వేరు. అక్కడ మాతృభాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాలన్న తపన తెలుగువారందరిలో కనిపిస్తుంది. తెలుగునాట కొన్ని కళలను మరచి పోయి ఉండవచ్చు గానీ, అమెరికా తెలుగువారు మాత్రం అన్ని కళలను ఆదరిస్తున్నారు. మాతృభాషను మరచిపోకుండా నిత్య జీవి తంలో ఒక భాగం చేసుకున్నారు. అక్కడ ఏటా సాహిత్య ఉత్సవాలను జరుపుకుంటున్నారు. పెద్ద పెద్ద నగరాలలో కవి సమ్మేళనా లు జరుగుతున్నాయి. వంగూరి ఫౌండేషన్, అప్పాజోస్యుల, విష్ణుభట్ల, కిదాంబి ఫౌండేషన్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అమెరికా నలుమూలలా ‘మనబడి’ని ఏర్పా టు చేసి తెలుగు పిల్లల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. రెండో తరంలో కూడా తెలుగు నిలబడి ఉందంటే కారణం ఇవే. అమెరికాలో తెలుగు పత్రికల నిర్వహణ కూడా దిగ్విజయంగా సాగుతోంది. అట్లాం టాకు చెందిన పెమ్మరాజు వేణుగోపాలరావు, గవరసాన సత్యనారాయణరావు ‘తెలుగు భాష పత్రిక’ను స్థాపించి, భాషా సేవ చేశారు. విజ్ఞాన శాస్త్ర అంశాలను తెలుగులో అందించడమే ఈ పత్రిక ఉద్దేశం. 1968 నాటి ‘కంప్యూటర్లు’ పుస్తకం ఇందులో ధారావాహికంగా వెలువడింది. వేమూరి వెంకటేశ్వరావు రాసిన ఈ రచన కంప్యూటర్ల మీద వచ్చిన తొలి తెలు గు పుస్తకంగా ఖ్యాతి చెందింది. ‘ఈమాట’ (1998, మొదటి తెలుగు వెబ్ మ్యాగజైన్), ‘తెలుగుజ్యోతి’ (1983, కిడాంబి రఘునాథ్), ‘బ్రాహ్మి’ (శొంఠి శారదాపూర్ణ) పత్రికలను అక్కడ నుంచి ప్రచురిస్తున్నారు. ‘తెలుగునాడి’ (జంపాల చౌదరి), ‘తెలుగు అమెరికా’ (దండమూడి రామమోహనరావు) కొద్దికాలం వెలువడినాయి. ‘తెలుగు టైమ్స్’ పదేళ్ల నుంచి వెలువడుతోంది. అమెరికాలో ప్రతి నగరంలోను తెలుగు సంఘాలు ఉన్నాయి. వీటిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘ (తానా),అమెరికా తెలుగు సంఘం (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) ప్రముఖంగా సేవలు అందిస్తున్నాయి. తెలుగువారి విద్యాభివృద్ధి, భాష, సంస్కృతుల పరిరక్షణకు ఇవన్నీ రకరకాలుగా పాటు పడుతున్నాయి. ప్రవాసాంధ్రులు సొంత గడ్డకు సేవలందించడంతో పాటు, రాష్ట్ర రాజకీయాలలో కూడా కీలకమైన స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ ధోరణి బలపడింది. చంద్రబాబు చేపట్టిన జన్మభూమి వీరికి మరింత ఊతమిచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత చాలామంది జగన్ వైపు మొగ్గారు. వీరంతా ఒకప్పుడు కాంగ్రెస్ అభిమానులు. ఆత్మచరణ్‌రెడ్డి, మధుయాష్కీ ఎంపీలుగా ఎన్నికయ్యారు. గల్లా అరుణ, జితేందర్‌రెడ్డి కూడా ఇలాంటి సేవలోనే ఉన్నారు. జయరాం కోమటి, సతీష్ వేమన, పాలెం శ్రీకాంత్‌రెడ్డి, ఎం. వెంకటరమణ (టీడీపీ), మహేశ్ సలాడి, గడ్డం దశరథరామిరెడ్డి, నాగేశ్వరరావు (కాంగ్రెస్), డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి, వీరారెడ్డి, సురేశ్ ఉయ్యూరి, నగేశ్ (వైఎస్ఆర్సీపీ), చవ్వా విజయ్, జానకి రామరెడ్డి, రాజు చిం తల (టీఆర్ఎస్) వంటి వారు రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉన్నారు. అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా తమ లక్ష్యాలు నెరవేరిన తరువాత స్వస్థలాలకు చేరుకున్న వారూ ఉన్నారు. గల్లా రామచంద్రనాయుడు, రవి రెడ్డి సన్నారెడ్డి ఇలాంటి వారే. స్వచ్ఛంద సేవకు ముందుకొచ్చిన ప్రవాసులు కూడా ఎందరో ఉన్నారు. డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, డాక్టర్ హనిమరెడ్డి, జయరాం కోమటి, మోహన్ నన్నపనేని, కాట్రగడ్డ కృష్ణప్రసాద్ వంటి వారు కోట్లు వెచ్చించి తమ తమ ప్రాం తాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. తమ మూలాలను మరచిపోని ప్రవాసాంధ్రులు ఇంకా ఎందరో! చెన్నూరి వెంకటసుబ్బారావు, (‘తెలుగు టైమ్స్’ సంపాదకుడు, ఎండీ) (జనవరి 9 ప్రవాసీ భారతీయ దివస్)