
పాలస్తీనా కవికి సౌదీలో శిరచ్ఛేద శిక్ష
తన కవితల్లోనూ, సంభాషణల్లోనూ మతాన్ని వదిలిపెట్టమన్నాడని అష్రాఫ్‌పై ఆరోపణ.
తన కవితల్లోనూ, సంభాషణల్లోనూ మతాన్ని వదిలిపెట్టమన్నాడని అష్రాఫ్‌పై ఆరోపణ. గాజా ప్రాంతానికి చెందిన పాలస్తీనా శరణార్థుల దంపతులకు పుట్టిన అష్రాఫ్ ఫయాద్, సౌదీ అరేబియా దక్షిణాది పట్నం అబాలో పెరిగాడు. ఆయన కవి, చిత్రకారుడు. వయసు 35 సంవత్సరాలు.
తన కవితల్లోనూ, సంభాషణల్లోనూ మతాన్ని వదిలిపెట్టమన్నాడని అష్రాఫ్‌పై ఆరోపణలొచ్చాయి. 2014 జనవరి నుంచీ జైల్లో ఉన్నాడు. ఆయనపై ఆరోపణలేవీ రుజువు కాకుండానే కోర్టువారు నాలుగేళ్ల ఖైదు, 800 కొరడా దెబ్బల శిక్ష విధించారు. 2014 మే నెలలో ఈ శిక్ష ఖరారయింది. ఒక హోటల్‌లో వాదనల మధ్య తాను ఇలా మాట్లాడినట్లు ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు నిరాధారమని ఫయాద్ అప్పీల్ చేశాడు. దాన్ని డిస్మిస్ చేసిన కోర్టు 2015లో తిరిగి విచారణ జరిపింది. అతని తల నరికి చంపాలని కొత్త జడ్జీల ప్యానల్ తీర్పునిచ్చింది. ఈ వార్త విన్న ఫయాద్ తండ్రి గుండె ఆగి చనిపోయాడు. అంత్యక్రియలకు కూడా ఫయాద్‌ను అనుమతించలేదు.
ఈ కవికి విధించిన శిరచ్ఛేదం శిక్షను రద్దు చేయించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌లకూ, జర్మనీ విదేశాంగ శాఖకూ ప్రపంచంలోని 350 రచయితల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై రచయితలు ఒర్హాన్ పాముక్(టర్కీ), మారియో వర్గోస్ లోసా(పెరూ) కూడా సంతకాలు చేశారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు కూడా ఈ శిక్షను ఖండించారు. ఇది కళాస్వేచ్ఛకూ, భావప్రకటనా స్వేచ్ఛకూ ఘోరమైన ఉల్లంఘన అన్నారు.
44 దేశాల్లోని 122 సభల్లో గురువారం ఫయాద్ కవితా సంకలనం ‘ఇన్‌స్ట్రక్షన్స్ వితిన్’లోని కవితల పఠనం ఉద్యమంలా సాగింది. బెర్లిన్ అంతర్జాతీయ సాహిత్య ఉద్యమ వేదిక ఈ కార్యక్రమాలు జరిపింది. ఫయాద్ అప్పీలును వచ్చేవారం సౌదీ కోర్టు పరిశీలించనుంది. సౌదీ అరేబియా వంటి నియంతృత్వ రాచరిక ప్రభుత్వానికి ఆప్తమిత్రులైన అమెరికా, బ్రిటన్, జర్మనీలు ఈ దుర్మార్గపు శిక్షను తప్పించేలా చొరవ చూపాలని సాహితీ ప్రపంచం ఎలుగెత్తి కోరుతోంది.