ఆ 'ప్రవేశిక' జాతికే దీపశిఖ | preamble in parliament | Sakshi
Sakshi News home page

ఆ 'ప్రవేశిక' జాతికే దీపశిఖ

Published Tue, Feb 3 2015 1:05 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

ఆ 'ప్రవేశిక' జాతికే దీపశిఖ - Sakshi

ఆ 'ప్రవేశిక' జాతికే దీపశిఖ

 రాజ్యాంగ నిర్ణయసభలో ముసాయిదా రాజ్యాంగం చర్చకు వచ్చినపుడు ‘దేవుని పేరిట’ (‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’) ‘‘ఈ ప్రియాంబుల్‌ను ఆమోదిస్తున్నాం’’ అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు చాలామంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకని? ‘దేవుని పేరిట’ అనగానే ఏ దేవుని పేరిట, ఏ మతం పేరిట, ఏ మతదైవం పేరిట అన్న మీమాంస తలెత్తే ప్రమాదముంది. అందుకే అసలా పదాన్నే సభ వారు ఉపసంహరించడం జరిగిందని మరచిపోరాదు!
 
 తన దాకా వస్తేగాని తలనొప్పి బాధ తెలియదట. ఆ తెలివి రావడానికి బీజేపీ, ఎన్డీఏ సారథులకూ, పరివార్ పాలకులకూ ఇంతకాలం పడుతోంది. భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారాలు చేసి, ఆ రాజ్యాంగం ఆదేశాలకే విరుద్ధంగా వికృతార్థాలూ, విధాన ప్రకటనలూ చొప్పిస్తూ భారతీయ సమాజంలో స్థిరపడిన సెక్యులర్ భావనా స్రవంతిని దారి మళ్లించాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. డిసెంబర్ 9, 1946 నుంచి జనవరి 1, 1950 వరకు తాత్కాలిక రాజ్యాంగ నిర్ణయ సభ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ముసాయిదా రాజ్యాంగాన్ని సవరణలతో ఆమోదిస్తూ ‘భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకుని నేడు, నవంబర్ 26, 1949 అమలు జరుపుకునేందుకు దీనిని మాకై మేము సమర్పించుకుంటు న్నాం’ అని ప్రతినబూనారు.
 
 వృథా ప్రయాస
 
 అలాంటి రాజ్యాంగ ముసాయిదాకు సంబంధించిన ఒక చిత్తుప్రతి దుమ్ము దులిపి మొన్న గణతంత్ర దినోత్సవాన మోదీ ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక వ్యాపార ప్రకటనగా కొన్ని పత్రికలకు విడుదల చేసింది. అది ఎలాంటి చర్చకు నోచుకోని 1946 నాటి చిత్తుప్రతి. ఇందులో ‘లౌకిక’ (సెక్యులర్), ‘సోషలిస్ట్’ అన్న పదాలు లేవు. కాబట్టి దీని మీద ఉన్న ముద్ర (వాటర్ మార్క్) ఆధారంగా దుమ్ము దులిపి ఒక ప్రభుత్వ ప్రకటనగా ప్రచురించి గందరగోళం సృష్టించే యత్నం చేశారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో కూడా రాజ్యాంగ ఉపోద్ఘాతంలోని ఆ రెండు పదాలను తొలగించే ప్రయత్నం జరగకపోలేదు. అప్పుడు ఎల్‌కే అద్వానీ ఉప ప్రధాని. నాడు కూడా ఎన్డీఏ అందుకు తీవ్రంగా ప్రయత్నించలేదు. కానీ, ఇప్పుడు న రేంద్ర మోదీ ప్రభుత్వం ఆ వివాదం నుంచి లబ్ధి పొందాలని చూడడం ఒక హెచ్చరిక గానే భావించాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత జరిగిన అనేక సవరణలను, వాటితో పాటు ఈ రెండు పదాలను గౌరవిస్తూనే అన్ని ప్రభు త్వాలు పాలన సాగించాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలే కాదు, ఇతర సంకీర్ణాలు, కూటములు కూడా దేశాన్ని రాజ్యాంగం ప్రవచించినట్టు ‘సర్వసత్తాక, సోషలిస్ట్, లౌకిక ప్రజాస్వామిక గణతంత్రం’గానే గౌరవించాయి. కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ రెండు పదాలు లేని, అసలు చర్చకే రాని తొలి చిత్తు ప్రతిని బయటకు లాగి ఉపయోగించుకోదలచింది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ‘రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని లేదా ప్రవేశిక (ప్రియాంబుల్)ను మార్చవలసిన అవసరమే లేదు’ అని ప్రకటించవలసి వచ్చింది. చిత్రం ఏమిటంటే, ఈ గత్తర పట్ల ప్రధాని మోదీ మాత్రం ఇంతవరకు మౌనంగానే ఉండిపోయారు.
 
 ‘ప్రవేశిక’ ప్రత్యేకతను గుర్తించవద్దా!
 
 ఒక వివాదాన్ని లేవనెత్తడం, అది ప్రజా బాహుళ్యాన్ని ఏ రీతిలో ప్రభావితం చేస్తున్నదో పరీక్షించడం; తీరా ప్రయోగం వికటించి పార్టీ ఆస్థిత్వం దెబ్బతినే విధంగా పరిస్థితులు మారే సమయంలో ప్లేటు ఫిరాయించడం బీజేపీ లక్ష ణం. చర్చకే రాని ఆ చిత్తుప్రతిలో ఈ రెండు పదాలు కనిపించకపోవచ్చు. తరువాత ఎన్నో చర్చలు జరిగి, ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సవరణ ద్వారా ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ అన్న పదాలు రాజ్యాంగ ప్రవేశికలో చేరాయి. ఆ రెండు పదాల వెనుక ఉన్న ఆదర్శం ఏ మేరకు ఆచరణలో నెరవేరుతున్నదీ అనేది మాత్రం వేరే చర్చ. కానీ ప్రియాంబుల్ రాజ్యాంగ మౌలిక చట్రంలో భాగంగానే న్యాయశాస్త్ర కోవిదులు పరిగణిస్తు న్నారు. అయినా బీజేపీని శాసించే సంఘ పరివార్ శాఖలు, వాటి ఉప శాఖలు యథేచ్ఛగా రాజ్యాంగ వ్యతిరేక విధాన ప్రకటనలు చేస్తూ ఉంటాయి. గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ రగడ లేచిన తరు వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన రాజ్యాంగంలోని అధికరణ లతో సహా ఉదహరిస్తూ, ఈ రాజ్యాంగం ఇస్తున్న స్వేచ్ఛను అమలు చేసే అవ కాశమే లేకుంటే అభివృద్ధి శూన్యం కాగలదని బాహాటంగా హెచ్చరించారు. ఈ హెచ్చరిక వచ్చేదాకా అమిత్‌షా స్పందించకపోవడం గమనించదగిన అంశం. అంతేగాదు, ‘ప్రియాంబుల్‌ను మార్చవలసిన అవసరంలేద’ని చెబు తూనే ‘మతమార్పిళ్ల’ను నిషేధిస్తూ చట్టం తేవాలని ఆయన అంటున్నారు.
 
 ఆ రెండు పదాలు రెండు కళ్లు
 
 రాజ్యాంగం గుర్తించిన పౌరుల మతస్వేచ్ఛకూ, మత ప్రచారానికీ, నమ్మకా నికీ, ఆరాధనా స్వేచ్ఛకూ అభ్యంతరం చెప్పే హక్కు ఎవరికీ ఉండదు. మత స్వేచ్ఛకూ, అందులో అల్పసంఖ్యాక వర్గాల (మైనారిటీల) ప్రయోజనాలకూ సంబంధించిన రాజ్యాంగ అధికరణలు (25 నుంచి 30 వరకూ) నిర్దేశిస్తున్న నియమ నిబంధనలకు అంతా కట్టుబడి ఉండక తప్పదు. ఆదర్శవంతమైన సామాజిక వ్యవస్థ ఉండాలని, స్త్రీ పురుషులకు సమాన హక్కులుండాలని, ఉత్పత్తి పరికరాలు, ప్రకృతి వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై సామాన్య ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండేలా దేశ ఆర్థిక విధానం ఉండాలని 38-39 అధికరణల ద్వారా రాజ్యాంగం ఆదేశిస్తున్నది. ఈ నిర్దేశాన్ని పాటిస్తే- మత వివక్షకు సంబంధించిన సమస్యలు కూడా పరి ష్కారమైపోతాయన్న ఇంగితజ్ఞానం పాలకులకు ఉండాలి. అన్నింటి కన్నా ముఖ్యం- జాతిపిత గాంధీజీని సంఘ్ పరివార్ ప్రచారక్ నాథురాం గాడ్సే హతమార్చినా కూడా, దానిని హత్యగా పరిగణించడానికి ఇష్టపడని వర్గాలు మన మధ్యనే ఉండటం! పైగా గాడ్సేపై చలనచిత్రాన్ని విడుదల చేయడానికి బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యమించడం! ఇలాంటి ధోరణులు దేశంలో తలెత్తుతూండటం వల్లనే రాజ్యాంగంలో ‘‘51-ఎ’’ అధికరణ ద్వారా పౌర బాధ్యతల అధ్యాయాల్ని రాజ్యాంగ నిర్ణేతలు తెరవాల్సి వచ్చిందని గుర్తిం చాలి. తద్వారా పౌరులలో మూఢనమ్మకాలను పారదోలి హేతువాద దృక్ప థాన్ని, శాస్త్రీయమైన అవగాహనను పెంపొందించాలనీ సుసంపన్నమైన సమష్టి వారసత్వాన్ని కాపాడుకోవాలనీ అదే అధికరణంలో ‘51-ఎ’లో భాగంగా ‘ఎఫ్’, ‘హెచ్’ అంశాలు ఆదేశించవలసి వచ్చింది! అందువల్ల రాజ్యాంగ కోవిదులు ‘సెక్యులర్’ పదాన్ని వ్యవస్థ భద్రతకూ, భిన్నత్వంలో ఏకత్వానికీ చేసే దిశానిర్దేశంగానూ; ‘సోషలిస్టు’ పదాన్ని సామాజిక న్యాయ ప్రతిష్ఠాపనకు ఆదర్శంగానూ ఉంచవలసి వచ్చిందని గుర్తించాలి!
 
 సెక్యులరిజం అంటే ఏమిటి?
 
 అందుకే భారత రాజ్యాంగానికి భాష్య నిర్దేశకుడిగా 29 సంపుటాల బృహత్ వ్యాఖ్యానాన్ని ప్రపంచానికి అందించిన న్యాయశాస్త్ర కోవిదుడు డాక్టర్ డి.డి. బసు ప్రియాంబుల్ విశిష్టతను ఇలా వివరించాడు: ‘సెక్యులరిజం అంటే- ప్రభుత్వానికి తనకై ఒక మతం ఉండదు, విభిన్న మతాలకు చెందిన ప్రజలు నివసిస్తుండే వ్యవస్థే సెక్యులరిజం’ అన్నాడు (బసు కామెంటరీ: వాల్యూం-1, పేజి : 400). అంతేకాదు, ఇండియా ఒక ప్రత్యేక మతాన్ని అంటకాగకుండా ఉన్న సెక్యులర్ వ్యవస్థ, అంటే ప్రభుత్వం సెక్యులర్ గాని, దేశ ప్రజలు భిన్న మతానుయాయులై ఉండటం. అంతేగాని అది రాజ్యాధికార మతవ్యవస్థ కాదు అని కూడా నిర్వచించాడు. కనుకనే రాజ్యాంగ నిర్ణయసభలో ముసా యిదా రాజ్యాంగం చర్చకు వచ్చినపుడు ‘దేవుని పేరిట’ (‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’) ‘‘ఈ ప్రియాంబుల్‌ను ఆమోదిస్తున్నాం’’ అంటూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు పెక్కుమంది సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఎందుకని? ‘దేవుని పేరిట’ అనగానే ఏ దేవుని పేరిట, ఏ మతం పేరిట, ఏ మతదైవం పేరిట అన్న మీమాంస తలెత్తే ప్రమాదముంది. అందుకే అసలా పదాన్నే సభ వారు ఉపసంహరించడం జరిగిందని మరచిపోరాదు! విశ్వాసాల్ని కలిగి ఉండటానికి, లేదా ప్రచారం చేసుకోవడానికి పౌరులకు స్వేచ్ఛ ఉండాలి.
 సెక్యులరిజం అంటే దైవనింద కాదని, ఇతర మతాల పట్ల అవగాహ నను, గౌరవాన్ని పెంపొందించుకోవటమే; మత భేదాల ఆధారంగా రాజ్యవ్య వస్థ ప్రజల పట్ల వివక్షతో వ్యవహరించకుండా ఉండటమే సెక్యులరిజమని బసు స్పష్టంగా వివరించాడు! రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం పాదుకొల్పడం ద్వారానే ‘సాంఘిక న్యాయా’నికి ద్వారాలు తెరచుకుం టాయి. అవి పరస్పరాధారాలు. కనుకనే రాజ్యాంగాన్ని అమలు చేసేటప్పుడు ఏ సందర్భంలో, ఎక్కడ అస్పష్టత, అనుమానం తలెత్తినా ఉపోద్ఘాతాన్ని (ప్రియాంబుల్) ఆశ్రయించమంటారు న్యాయశాస్త్రకోవిదులు. ప్రియాంబు ల్‌ను అనుల్లంఘనీయమైన ‘దీపశిఖ’ అన్నారు! అందుకే, సుప్రీంకోర్టు 1975 నుంచీ 2004 వరకూ చెప్పిన అనేక తీర్పులలో, చివరికి కాశీవిద్యా పీఠానికి చెందిన ఆది విశ్వేశ్వర (యూపీ), ఎస్‌ఆర్ బొమ్మయ్, యూనియన్- ప్రవీణ్ తొగాడియా (కర్ణాటక) కేసులలో సహా చెప్పిన తీర్పులలో, వ్యాఖ్యలలో ఈ ప్రియాంబుల్‌ను సమర్థించాల్సివచ్చింది! ఇప్పటిదాకా మతాతీతంగా పాలనా వ్యవహారాలను, ఆర్థికాంశాలను ఆలోచించక బొందలో పెడుతున్న బీజేపీ నాయకత్వం పిదప ఆలోచనల్ని ఇప్పటికైనా మానుకోవటం అవసరం. తాత్కాలిక వైరాగ్యం అక్కరకు రాదు, రాదు. ఇంతకూ భారతీయ జనతాపార్టీ తన పేరును ‘హిందూ జనతా పార్టీగా మార్చుకోక పోవడానికి కారణం ఏమిటో!
 
 విశ్లేషణ: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త మొబైల్: 9848318414)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement