పార్లమెంటే ‘సర్వాధికారి’ కాదు! | there is no full rights to parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంటే ‘సర్వాధికారి’ కాదు!

Published Mon, Feb 3 2014 11:38 PM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

పార్లమెంటే ‘సర్వాధికారి’ కాదు! - Sakshi

పార్లమెంటే ‘సర్వాధికారి’ కాదు!

విశ్లేషణ
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
 
‘ఆర్టికల్-3’ ప్రకారం రాష్ట్రాల విభజనకు భారత ప్రభుత్వం చట్టం తేవడానికి గల అధికారం కొన్ని షరతులకు లోబడి ఉండాలని అంబేద్కర్ స్పష్టం చేశారు. పైగా రాష్ట్రాల సరిహద్దుల విభజనకు శాసనసభల అనుమతి, తీర్మానమూ అనివార్యమని కూడా చెప్పారు.
 
 ‘దేశంలో పాలనాపరమైన, రాజకీయ సం బంధమైన ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే రాజ్యాంగం లక్ష్యమూ, పనీ. అంతేగాని, అధి కార పార్టీకి తాత్కాలిక రాజకీయ ప్రయోజనా లను సాధించి పెట్టడం రాజ్యాంగం పనికాదు. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో పార్లమెం టులో మెజారిటీ పక్షం అనేది తాత్కాలిక పరిణామం. ఆ మెజారిటీ శాశ్వతం కాదు. పైగా, లిఖిత రాజ్యాంగం కింద పని చేయవల సిన పార్లమెంటు తానేదో సర్వశక్తిమంతురాలు నని భావించుకుని, రాజ్యాంగాన్ని చిన్నా భిన్నం చేయడానికి ప్రయత్నించకూడదు. నేడు మెజారిటీలో ఉన్న ఒక పార్టీ లేదా పక్షం రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా మార్చు కుంటే, రేపు మరో రాజకీయ పక్షం కూడా అదే పనిచేస్తుంది. అప్పుడు, రాజ్యాంగం అంత వరకూ తన సామర్థ్యానికి, ఉనికికీ ఏ ప్రజల పైన ఆధారపడుతూ ఉందో, ఆ ప్రజల గౌర వాభిమానాలకు దూరమైపోవాల్సివస్తుంది’.
 - ప్రొ. ఎం.పి.జైన్
 ‘ఇండియన్ కాన్‌స్టిట్యూషనల్ లా’ : 2011, పే: 1857)
 
 తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ (యూపీఏ) పాలకులు పన్నిన ‘విభజన’ కుట్రలో భాగంగా వచ్చిన తప్పులతడక ‘బిల్లు’ను శాసనసభ తిరస్కరించ డాన్ని జీర్ణించుకోలేక, కొలది మంది వేర్పాటువాదులు కొత్త వాదనలకు దిగుతున్నారు. వాటిలో- ఒకటి: మైనారిటీల రక్షణకు చిన్నరాష్ట్రాల ఏర్పాటును రాజ్యాంగ నిర్మాత డా॥అంబేద్కర్ సమర్థించారు. రెండు: ‘విభజన’కు సంబంధిం చిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (2013) బిల్లు’ను రాష్ట్ర శాసనసభ తిరస్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి పంపిన నోటీసు ఆధారంగా స్పీకర్‌కు పంపిన తీర్మానాన్ని స్పీకర్ మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధం. మూడు: రాష్ట్రాన్ని విభజించే అధికారం రాజ్యాం గంలోని ‘అధికరణ-3’ ప్రకారం పార్లమెంటుకు ఉంది. శాసనసభ, శాసనమండలి పునర్వ్యవస్థీకరణ బిల్లును (లేదా ముసాయిదా బిల్లును) తిరస్కరించినా అది చెల్లదు. కొందరు వేర్పాటువాదులు, మరికొంత మంది మంత్రులూ భారత రాజ్యాంగాన్ని తిరగేసి చదువుకొని ఉండకపోతే, తాత్కాలిక రాజ్యాంగ నిర్ణయసభలో 1948, నవంబర్ 4 నుంచి 1949, డిసెంబర్ 8వ తేదీ వరకు జరిగిన చర్చలలో, ముఖ్యంగా ‘అధికరణ-3’ పైన నడిచిన సుదీర్ఘ చర్చల సారాంశాన్ని అయినా తెలుసుకుని ఉండేవారు! కాని ఆ యోగ్యత వారికి లేదని ఇటీవల రాష్ట్ర విభజన ప్రతిపాదిత బిల్లుపై వెలిబుచ్చిన అభిప్రాయాలు నిరూపించాయి! ఇం దుకు ఉదాహరణ, దళిత వర్గానికి చెందిన ఒక విభజనవాద మంత్రి, అంబేద్కర్ రాజ్యాంగ నిర్ణయసభలో చెప్పిన కొన్ని విషయాలను వక్రీకరించారు. వాటిలో ప్రధానమైన అంశం - మైనారిటీ ప్రజలకు చిన్నరాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉందని అంబేద్కర్ చెప్పారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ విభజన సమర్థనీయమేనని వాదించబోవటం!
 
 మైనారిటీలకు వక్రభాష్యం
 
 అంబేద్కర్ (1948, నవంబర్ 17) రాజ్యాంగ నిర్ణయ సభా చర్చల సందర్భంగా చేసిన ప్రస్తావన ప్రధానంగా జాతీయ ‘మైనారిటీ’ల గురించేగాని, భాషా సంస్కృతుల పునాదిగా ఏర్పడే భాషా రాష్ట్రాల గురించి కాదు! ‘మైనారిటీ’లంటే ఆయన ఉద్దేశం వివిధ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూ ల్డ్ తెగలు విభిన్న ప్రత్యేక ఆచార వ్యవహారాలతో కూడిన జాతులనే గాని, ప్రత్యేకించి ఏకభాషా జాతిగా ప్రత్యేక భూభాగంలో సువిశాలమైన ప్రాంతంగా ఏర్పడిన సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు జాతి లాంటి భాషా రాష్ట్రాల ప్రజల గురించి కాదు. రాజకీయ నిరుద్యోగులు స్వార్థ ప్రయోజ నాల కోసం అంబేద్కర్ భావాలనూ, రాజ్యాంగ సభలో ‘ఆర్టికల్-3’ గురించి ఆయన విశదీకరించిన విషయాలనూ వక్రీకరించడం తగదు!
 
  విభజనకు గురయ్యే స్వతంత్ర ప్రతి పత్తి గల రాష్ర్టం లేదా రాష్ట్రాల తాలూకు సరిహద్దుల్ని చెదర గొట్టేప్పుడు సంబంధిత రాష్ట్ర / రాష్ట్రాల ప్రభుత్వాల, శాస నసభల అనుమతిని పొందాలని ‘అధికరణ-3’ నిర్దేశిస్తు న్నది. అయినా, అడ్డగోలు విభజనకు కాంగ్రెస్ గంతులే స్తోంది! పైగా ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర విభ జన కోసం ఎరువు తెచ్చుకున్న వాదన - పరాయి రాష్ర్ట మైన మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు జాతిలోని ఆంధ్ర ప్రాంతం వారు విడిపోవాలనుకున్నప్పుడు మద్రాసు శాస నసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభలో మెజారిటీ సభ్యు లు తిరస్కరించినందున ఆంధ్రులు వేరుపడాల్సివచ్చిన పరిణామాన్ని ఉదహరించారు. కానీ, ఉప ముఖ్యమంత్రి గుర్తించవలసిన అంశం - ఆనాటి మద్రాసు రాష్ట్రం అప్ప టికి ఐదేళ్ల క్రితం వరకూ బ్రిటిష్ పాలనలోనే ఉన్న మద్రాసు ప్రావిన్సు, అందులో భాగంగా ఆంధ్ర భూభాగమూ ఉండి పోయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లలోనే భాషా ప్రయుక్త ప్రాతిపదికపైన మొత్తం తెలుగు వారంతా కలిసి ఏర్పరచుకున్న తొలి భాషాప్రయుక్త రాష్ట్రం విశాలాంధ్ర! ఉమ్మడిగా ఇరు ప్రాంతాల ప్రజలు పరాయి పాలనల నుం చి ఎదుర్కొన్న ఇబ్బందులను, బాధలను పక్కన పెట్టి చరి త్రను వక్రీకరించుకోవడానికి నాయకులనుకున్న వాళ్లే నడుం బిగించడం ప్రజావ్యతిరేక రాజకీయం!
 
 ప్రజలందరి సమ్మతి ఉండాలి


 ‘ఆర్టికల్-3’ ప్రకారం రాష్ట్రాల విభజనకు భారత ప్రభుత్వం చట్టం తేవడానికి గల అధికారం కొన్ని షరతులకు లోబడి ఉండాలని అంబేద్కర్ స్పష్టం చేశారు. పైగా రాష్ట్రాల సరి హద్దుల విభజనకు శాసనసభల అనుమతి, తీర్మానమూ అనివార్యమని కూడా చెప్పారు.

 

(రాజ్యాంగ నిర్ణయ సభ చర్చలు, వాల్యూమ్ 7, బుక్ నం.2. పే.439)! ఈ సంద ర్భంగా ఆయన ఉదహరించిన ‘చిన్న మైనారిటీలు’ అల్ప సంఖ్యాకవర్గాలే గాని తెలుగు జాతిలోని ఒకే రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు కారుగదా! పైగా రాష్ట్రాల స్వయం సత్తాకత ఆ రాష్ట్రాల ప్రజలకే ఉంటుంది కాబట్టి విభజనకు ఆ ‘ప్రజల సమ్మతిని విధిగా పొందాలని’ కూడా అంబేద్కర్ ఆ చర్చలలో స్పష్టం చేశారని మరవరాదు! అం దుకనే విశిష్ట రాజ్యాంగ నిర్ణయ సభా చర్చలలో పాల్గొన్న మరొక ఉద్దండుడు ప్రొఫెసర్ కె.టి. షా అభిప్రాయాలు కొన్నింటితో ఏకీభవించకపోయినా రాష్ట్ర శాసనసభల నిర్ణ యానికే ప్రాధాన్యమివ్వాలన్న షా ప్రతిపాదనతో అంబే ద్కర్ ఏకీభవిస్తూ, ‘షా ప్రతిపాదించిన తీర్మాన సవరణకూ, నా సవరణకూ మధ్య ఎక్కువ భేదం లేద’ని ప్రకటించాల్సి వచ్చింది! ‘అధికరణ-3’ పేరిట కేంద్రం చేతుల్లో అసాధార ణాధికారాలను గుప్పించటం ఉత్తరోత్తరా దేశ సమైక్యతకు చేటనీ, రాష్ట్రాల ఫెడరల్ అధికారాలను కుంచించడానికి మార్గమనీ నాడే హెచ్చరించిన వాడు ప్రొఫెసర్ షా! రాష్ట్రా ల విభజన, వారి సరిహద్దుల, భూభాగాల విభజన సమ స్యకు పరిష్కారం అనేది విభజన వల్ల దెబ్బతినే ప్రాంతాల ప్రజల అభిప్రాయాలతో ముడిపడిన సమస్య కాబట్టి నిర్ణ యం వారి నుంచి రావాలే గాని కేంద్రాధికార స్థానాల నుం చి మాత్రం కాదని షా స్పష్టంగా పేర్కొన్నారు!
 
 స్పీకర్‌కు అనివార్యమే
 
 ఇక స్పీకర్ మూజువాణి ఓటు అంటారూ, సభా నాయకుడి తీర్మానంపై ఓటింగ్ జరగకుండా, చర్చకు సహితం సభ్యు లు సహకరించకుండా సభను పదే పదే వాయిదా వేయడం తప్ప మరొక మార్గంలేని స్థితిలోకి స్పీకర్‌ను నెట్టిన తరవాత సభాపతికి మిగిలిన మార్గం ఏమిటి? విభజన బిల్లును వ్యతిరేకిస్తూ సభా నాయకుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభాపతి సభ తీర్మానంగానే మూజువాణి ఓటుతో ప్రకటిం చటం! ఆ పనే చేశాడాయన. ఆ హక్కును రాజ్యాంగమే స్పీకర్‌కు సాధికారికంగానే కల్పించింది! పార్లమెంటులో ‘బ్రూట్ మెజారిటీ’ (నిరంకుశ నిర్ణయాలకు వీలు కల్పించే) గల పార్టీ రాజ్యాంగాన్నే కాదు, ఎన్నుకున్న ప్రజలనే నట్టేట ముంచగలదని 39/42 రాజ్యాంగ సవరణల ద్వారా పొం దిన నిరంకుశాధికారాల ద్వారా కాంగ్రెస్ పాలకులు నిరూ పించారు! ఇటీవల చివరికి సుప్రీంకోర్టు తీర్పులను కూడా ప్రభావితం చేసే సన్నాయి నొక్కుళ్లకు కేంద్రంలో కాంగ్రెస్ పాలకులు అలవాటుపడ్డారు! అధికారంలో ఉన్నప్పుడే కాదు, కోల్పోతున్నామన్న బెంగతో కూడా పాలక పక్షాలు అవినీతికి పాల్పడతాయని అనుభవ పాఠం!        
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement