పిల్లనగ్రోవి పాటకాడ.. పిలచిన పలికే దాననోయ్
తలచిన వలచే జాణనోయ్.. గానమే కామనమని జీవనమని కలవరించు కన్నెనోయ్
ఒకమారు టి.వి.రాజు ‘ఋష్యశృంగ’కు పాడమని ఆమెని పిలిపించారు. అవి తమిళ మాతృకలో వసుంధరాదేవి గొప్పగా పాడిన పాటలు. రాజు పాడగా విని ఆమె వరసలు మార్చమన్నారు. హక్కులు కొని తెలుగులో తీస్తున్నామనీ, అవే వుండాలనీ దర్శక నిర్మాతలంటే ‘‘ఇదుగో గార్డన్ ఉడ్‌లాండ్స్‌లో కాఫీ తాగి వస్తా’’నని అంతే సంగతులు.
- రావు బాలసరస్వతీదేవి
ఈ మాటలను పాటగా వ్రాసింది మల్లాది రామకృష్ణశాస్త్రి, వరసకట్టి వట్టివేరు పరిమళం అద్దినది అశ్వత్థామ(చిన్నకోడలు, 1952). పాడినది చివురులో చిలక, మావి కొమ్మపై కోయిల, జుంటితేనె చినుకు అయిన ఆర్.బాలసరస్వతీదేవి. ఇవి అతిశయోక్తులు కావా, విమర్శకులిలా నుతించవచ్చునా అని ప్రశ్నిస్తే దానికొకే జవాబు. ఈ మాటలు విమర్శకుని కొలతలు కావు. సంగీత సాహిత్యాలింకా వంటబట్టని చిననాటనే కలిగిన వినుకలి కొలుపులు.
చిన్నప్పటి నుంచి నాకు గ్రామఫోనూ, రికార్డులూ సరిగంగ స్నానాలు. మేముంటున్న బొబ్బిలి రాజమహల్లో వారానికి మూడునాలుగు ఆటవిడుపులు. ఇంట్లో కుక్కలతో, తోటలో నెమళ్లతో ఆడి, విచ్చలవిడిగా గూళ్లలోనూ బయటా తిరిగే ఎగిరే పావురాలతో కువకువలాడి, నేలనుబడితే పెంచిన ఉడతతో కిచకిచలాడి, విసుగెత్తితే వినోదం కోసం ఆశ్రయించే విలాసాలు. అంతటి చిరుత వయసులోనే జాతీయ గీతాలు పాడాలంటే టంగుటూరి సూర్యకుమారి, సినిమా పాటలు పాడాలంటే బాలసరస్వతి అన్న నిర్ణయానికి క్రమేణా రావడం గుర్తున్న విషయమే. తక్కిన వారి పాటలు వినలేదా?
మొట్టమొదట నేపథ్య గాయని బెజవాడ రాజరత్నం, శాంతకుమారి, బళ్లారి లలిత, ఋష్యేంద్రమణి పాటలన్నా యిష్టమే. బాలసరస్వతి ప్రైవేటు పాటలూ పాడింది, నలభైల నడిమి నుంచి అరవైల అంతందాకా, అప్పుడప్పుడు. ఎస్.రాజేశ్వరరావుతో పోటీపడి పాడిన యుగళగీతాల (రావేరావే కోకిల, కోపమేల రాధా, రజనీవి; పొదరింటిలోన, తుమ్మెదా ఒకసారి, సన్యాసి రాజువి) ప్రౌఢ సౌందర్యం - వరసల్లో, వలపు సరసాల్లో - అర్థమయేసరికి కొంతకాలం పట్టింది.
ఆమె కంఠంలో ప్రత్యేకత ఏమిటి? ఒక్కటే, మాధుర్యం. ‘అందాల ఆనంద’మంటూ (దేవదాసు, 1953) ఆకర్షించినా, ‘ఏల పగాయే’ (లైలామజ్నూ, 1949) అంటూ ప్రేమించి వదలిన ప్రియునికై అలమటించినా, ‘కనిపించితివా నరసింహా’ అంటూ కుంతలవరాళిలో వేడినా (చెంచులక్ష్మి 1943), కాదు, మధురభక్తిలో ముంచినా బాలసరస్వతికి సాటి బాలసరస్వతే.
ఇందరున్నారీ చిత్రసీమలో సొంతగొంతుతో పాడుకొనేవారు, తెరవెనుక నుంచి ఆలపించేవారు కాని యీమెకున్న ఒక ఘనత మరెవ్వరికీ లేదు. హాస్యనటులుగా హీరోలకు సమ ఉజ్జీలై ప్రజాభిమానం చూరగొన్న శివరావుతో, రేలంగితో కలసి త్రిగళగీతం పాడింది మరొకరు లేరు. ఆ పాట ‘ముంత పెరుగండోయ్’ అన్నది (ప్రేమ, 1952). ఆ పాటలోనే కణుపులు లేని చెరుకు గడలు కురంజిలో ‘శివదీక్షా పరురాలనురా’ (ఘనం శీనయ్య పదం), ఆనందభైరవిలో ‘మధురా నగరిలో’ (చిత్తూరు సుబ్రమణ్యం పిళ్లై, గోపికా గీతం). కోలంక రాజావారిని పెళ్లాడి ఆమె నాకు పిన్నమ్మయ్యారు. ఆమెను ముఖతా కలుసుకొనడం నాకింకా జ్ఞాపకం వుంది. నాకు ఎనిమిదేళ్లుంటాయేమో, మద్రాసు రేసు కోర్సులో. అప్పటి నుంచి నేనంటే ఆమె ఆలపించేది వ్యక్తిగతంగా వాత్సల్యరాగమే.
ఇక వృత్తిగతంగా ఆమెకూ నాకూ చుక్కెదురు. పి.మంగపతి హెచ్‌ఎంవీలో కీలక పదవిలో ఉండగా నా దగ్గరున్న రికార్డులతో ఆమె పాటలతో ఒక ఎల్.పి. సమకూర్చమన్నారు. ఆ పాటల జాబితా ఆమె చూసి ‘‘అందులో ‘తన పంతమే’ ఉండకూడదు. రాజేశ్వరరావుతో పాడిన కొన్ని ప్రైవేటు పాటలుండా’’లన్నారు. నేనా తలవంచేవాడిని! ఆ ప్రయత్నం వదలుకొని శశిగోపాలన్న ఒక సత్పురుషుడు బ్రాంచి మేనేజర్‌గా అధికారంలోకి వచ్చిన తరువాత నా పంతం నెగ్గించుకున్నాను. అవే అలనాటి అందాలు.
ఇంతకూ ఆ పాట ‘తన పంతమే’ రజనీ వ్రాసి వరస చేసినది (మానవతి, 1952) అరుదైన రసాళి రాగంలో. ఈ రాగంలో ప్రచారంలో ఉన్న ఒకే ఒక పాట ‘అపరాధములనోర్వ’ ననే త్యాగరాజ కీర్తన. ఒకమారు టి.వి.రాజు ‘ఋష్యశృంగ’కు (1961) రెండు పాటలు పాడమని ఆమెని పిలిపించారు. అవి తమిళ మాతృకలో (1941) వసుంధరాదేవి గొప్పగా పాడిన పాటలు, ‘ఆనందమే ఉన్ కాట్చి’ ‘నానే భాగ్యవతి’ అన్నవి. రాజు పాడగా విని ఆమె వరసలు మార్చమన్నారు.
హక్కులు కొని తెలుగులో తీస్తున్నామనీ, అవే వుండాలనీ దర్శక నిర్మాతలంటే ‘‘ఇదుగో గార్డన్ ఉడ్‌లాండ్స్‌లో కాఫీ తాగి వస్తా’’నని అంతే సంగతులు. ఏమిటి కారణం అని అడిగితే అంటారు కదా ‘‘కాపీ ట్యూనులు పాడను’’ అని. వసుంధర ఆ తమిళ గీతాలను అలవోకగా, అవలీలగా హిందుస్తానీ సంగతులు సుడులు త్రిప్పుతూ పాడటమూ ఈ పలాయనమునకొక మంత్రమయిందేమో! మరి అదే రాజుకి ‘రావా అమ్మా నిదురా’ (నిరుపేదలు, 1954) అని, లతా-సలిల్ అజరామర సృష్టి ‘ఆజారే నిందియా’ (దో బిగా జమీన్, 1953) ఎలా పాడారు? ‘అనార్కలి’లో సి.రామచంద్ర వరసలను మంగపతి కోరికపై ప్రైవేటు పాటలుగా పాడి, ‘రావా నను మరచినావా’ ‘సలామోయి సలీమా’ పాడి ఎలా ఆ లలిత పల్లవ ప్రాణులను శంకరగిరి మాన్యాలు పట్టించారు?
ఒకటి మాత్రం నిజం. ఆమెకు దుశ్చింత ఎవరిపట్లా, ఎప్పుడూ లేదు. రమేశ్ నాయుడికి యీ మధురకంఠమంటే చాలా యిష్టం. దక్షిణాదిన ఆయన చేసిన మొదటి చిత్రం ‘దాంపత్యం’లో (1957) మంచి పాటలు పాడించారు. ‘తానేమి తలంచేనో’ (రాజాతో యుగళం), ‘నడివీథిలో జీవితం’ మొదలైనవి. ఆమె సినిమాకు పాడిన చివరిది అంపకాల పాట (సంఘం చెక్కిన శిల్పాలు, 1979) ఆయన పాడించినదే. అంతకు ముందే తెలుగులో మీరా గీతాలు (సి.నారాయణరెడ్డి అనుసృజన) ప్రైవేటు రికార్డుగా ఆయనే శ్రమ తీసుకొని సాధించారు.
సినిమాలు చూడని, ఆ పాటలు వినని రేడియో శ్రోతలకూ ఆమె పాటంటే అభిమానమే. నాకు తెలిసిన రెండు : అన్నమయ్యది ‘రమ్మనవే మాని రచనలు’ (రజని), ‘తెలతెలవారింది చలిగాలి వీచింది’ (ఎస్.దక్షిణామూర్తి). ఇంకెందరికో ఆమె పాడిన పాటలు మలయానిల లాలనలు. పెండ్యాలకు ‘సృష్టిలో తీయనిది’ (ప్రైవేటు), ‘ఎవరినీ ప్రేమించకూ’ (అంతేకావాలి, 1955), విజయభాస్కర్‌కి ‘ఝళకిన ఝళకిన’ (కన్నడం, భాగ్యచక్ర, 1956 హిచ్‌కాక్ ‘స్టేజ్‌ఫ్రైట్’, 1950లో మార్లీన్ డీట్రిచ్ పాడిన మంద్రస్వర గీతానికి అనుసరణ), నాగయ్యకు సారంగరాగనిసర్గ సౌందర్యం తెలిపే ‘అదిగదిగో గగనసీమ’ (జిక్కితో, నాయిల్లు, 1953), అద్దేపల్లి రామారావుకి ‘మాలైనిల వరవేండుమ్’(తాయ్ ఉళ్లమ్, 1952), తమిళంలో ప్రైవేట్ పాటలెక్కువ పాడలేదు గాని, వాటిలో ముత్తు సంగీతానికి పాడిన ‘ఆడుదు పార్ మయిల్’ వింటే మబ్బును చూసి ఉబ్బితబ్బిబ్బయిన మయూరాలమవుతాము.
నటించిన చిత్రాలన్నీ కనకవర్షం కురిపించలేదు ఒక్క తిరునీలకంఠర్ తప్ప. ఇప్పుడు ఆ ఒక్క చిత్రమే లభ్యం. దాసిప్పెణ్, సువర్ణమాల చిత్రాలలో ఆమె గాన నాట్యాభినయం చేసినా ‘‘ఏముంది! ఆనాటి నాట్యాలెవరు చేసినా ఉడతలు పట్టడమే’’ అని తీసిపారవేయడం ఆమెకలవాటు. నటించిన చిత్రాలన్నింటిలో ‘చంద్రహాస’ తప్ప మంచి పాటలున్నవి. సువర్ణమాలలోని ‘రావోయి జీవనజ్యోతి’ మూడు నిమిషాలు మెరిసే మెరుపు. ఏడుపులు, ఎక్కిళ్లు లేకుండా విచార విరహగీతం ఎలా పాడాలో నేర్పే పాఠం. ఈ పాటలు వింటుంటే ‘అబ్బ ఎంత గొప్పగా పాడారో’ అనిపించదు. ‘ఎంత హాయిగా ఉందో’ అని కూడా అనిపించదు. ఆ గొప్పతనం, ఆ హాయి చాపకిందనీరులా మనని తడిపేస్తాయి. దటీస్ బాలసరస్వతి!
- వి.ఎ.కె.రంగారావు
9444734024
(నేడు గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌వారు బాలసరస్వతీదేవికి విశిష్ట సేవా పురస్కారం ప్రదానం చేస్తున్నారు.)