
ఆకలి రుచెరిగిన అక్షరం...
ఆకలి రుచి ఎరిగిన ఓ అక్షరం తెలుగు సాహిత్యం నుంచి వీడ్కోలు తీసుకుంది. గుప్పెడు అక్షరాలనే పిడికెడు ముద్దగా మలుచుకున్న ఒక కలం తెలుగు సాహిత్యానికి తనవైన కవి లి కట్టలను మూటగా ఇచ్చి అనంతలోకాలకు సాగిపోయింది. అక్షరం అంటే అగ్రవర్ణాల సొత్తు అనీ, ఏనుగు అంబారీ ఎక్కి తిరిగే పం డితుల పట్టు శాలువాల అంచుకు వేలాడే ముల్లె అని ప్రచారం అవుతున్న రోజుల్లో అక్ష రం ఒక పేదవాడి సొత్తు అని నిరూపించిన గొప్ప రచయిత- రావూరి భరద్వాజ (జూలై 5, 1927-అక్టోబర్ 18, 2013). దివ్య లోకా లలో అక్షర సరోవరాల చెంత సేద తీరడానికి పయనమై వెళ్లారు.
వందలాది పేజీలలో ఆయన జీవితాను భవాలు పరుచుకున్నాయి. అయినా ఇంకొన్ని మిగిలే ఉన్నాయి కాబోలు. జ్ఞానపీఠ్ పురస్కా రం లభించాక ఏ సత్కార సభలో ప్రసంగిం చినా ఆయన మనసు దొంతరల మధ్య పొం చి ఉన్న పాత జ్ఞాపకాలు కొత్తకొత్తగా వెలుగు చూశాయి. 2012 సంవత్సరానికి గాను భార తదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞాన పీఠ్‌ను డాక్టర్ రావూరి భరద్వాజకు ఈ ఏప్రి ల్‌లో ప్రకటించారు. మండుటెండలో వాసంత సమీరంలా తెలుగువారందరినీ ఆ వార్త ఆహ్లా ద పరిచింది. తెల్లటి గెడ్డంతో, చక్రాల కుర్చీలో వచ్చి తన అభిమానులను ఆయన పలక రించడం ఇప్పటికీ కళ్ల ముందు కదులుతోంది. ముదిమితో మూసుకుపోయిన గొంతు నుంచి ప్రతి సభలోను ఆయన జీవితానుభవాలే చీల్చుకుని వచ్చేవి. కంపించే కంఠం నుంచి బాధల గాథలే ఉబికాయి. వాటిలోని విషాదం అంత పదునైనది.
పేదరికంలో పుట్టడం ఎక్కైడెనా జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. దాన్ని ఛేదించినా, వెన్ను నిలుపుకుంటూ, అందునా రచయితగా బతకడం అంటే పెను సవాళ్ల మధ్య సాగడమే. భరద్వాజ జ్ఞానపీఠం అధిరో హించారు. ఆ పర్వతం మీదకు ఆయన ప్రయాణం సాగింది అక్షరాలా పాకుడురాళ్ల మీదనే. భరద్వాజ పేరు చెబితే ‘పాకుడురాళ్లు’ నవల జ్ఞప్తికి వస్తుంది. ఆ నవలలో మంజరి స్త్రీ, నటి. కాబట్టి ఆమె బాధలు వేరు. వెండి తెర వెలుగుల్లో వాటి రూపం, నేపథ్యం వేర్వేరు. కానీ భరద్వాజ నిజ జీవితంలో రచ యితగా నిలబడడానికీ ఎదగడానికీ తెర వెను క పడిన కష్టాలు తక్కువేమీ కాదు. ఆయన నడిచి వెళ్లింది కూడా పాకుడురాళ్ల మీదే. వెండి తెర మీది చీకటిరేఖలను చెప్పే ఈ నవల ఆయనకు చిరకీర్తిని తెచ్చింది.
1960 దశకంలో భరద్వాజ ‘పరిస్థితుల వారసులు’ అన్న శీర్షికతో కథ రాశారు. నిజం గానే ఆనాటి చాలా పరిస్థితులకు భరద్వాజ వారసుడు. భరద్వాజ సాహిత్య రంగంలో అడుగుపెట్టే కాలానికి సాహిత్య వ్యాసంగం ఒక వర్గం చేతిలో ఉంది. అటువంటి సమ యంలో కేవలం వానాకాలం చదువుతోనే ఆయన కలం పట్టి నెగ్గుకు వచ్చారు.అదే వర్గం వాడైనా ఆప్తమిత్రుడు ’శారద’ విషాదం మరో కోణం.
భావసంపన్నుడైన శారదపేదరికానికి బలైనవాడు. తనను రచయితగా తీర్చిదిద్దినవే పరిస్థితులని భరద్వాజ ప్రగాఢ నమ్మకం. అం దుకే జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించిన తరు వాత, ‘నా రచనా వ్యాసంగం నా ఒక్కడి కృషి వల్లనే సాధ్యమైంది కాదు. పరిస్థితులు నన్ను అందుకు ప్రేరేపించాయి. నా అనుభవాలకే నేను అక్షరరూపం ఇచ్చాను. చాలా జీవితా నుభవాలనే నేను రచనలలో నింపాను’ అన్నా రాయన. ఆ అనుభవాలు 140 పుస్తకాలై మన ముందు తెరుచుకున్నాయి.
గతకాలపు రష్యన్ సాహిత్యకారులకు మల్లే రావూరి భరద్వాజ కూడా కార్మికుల్లో కార్మికుడిగా, కర్షకుల్లో కర్షకుడిగా జీవితం ప్రారంభించారు. పతితులను, భ్రష్టులను, బాధాసర్పదష్టులనూ చూశారు. ఆకలి విశ్వ రూపం ఎత్తితే మనిషి తన విలువలనూ వ్యక్తి త్వాన్ని పక్కనపెట్టి గడ్డిపోచలాగా ఎలా కొట్టు కువెళతాడో దర్శించారు. అందుకే అక్షరం మనిషికి ఒక ఆలంబనగా ఉండాలని భావిం చాడాయన. జీవన సమరంలో అలిసి ముడు తలు పడ్డ ఆయన నుదుటిపై ఒక ముద్దుపెట్టి ఆయనను సేద తీర్చింది. వచన రచన అంటే తీరిగ్గా చేసే, బుద్ధి పుట్టినప్పుడు గిలికే సోమ రిపని కాదని, కాయకష్టం చేసే మనిషి వలే, రచయిత కూడా కాయకష్టం చేసి రచనలను పండిస్తూ సమాజం మేధ కోసం, బుద్ధి వైశా ల్యం కోసం ఆహారం అందిస్తూనే ఉండాలని ఆచరణతోనే సందేశం ఇచ్చిన భరద్వాజ ఒక తరానికి, ఒక శ్రమకు ఆఖరి గుర్తు. చెరిగిపోని జ్ఞాపకం. శిరస్సు వొంచి స్మరించదగ్గ గౌరవం.
-గిరీష్