‘సీమ’ పోరుబిడ్డలు పాలెగాళ్లు!
బ్రిటిష్ సామ్రాజ్యం మొక్కదశలో ఉన్న ప్పుడే తుంచేయాలని బ్రిటిష్ వారితో రాయ లసీమ పాలెగాళ్లు క్రీ.శ.1801 నుంచి 1805 వరకూ ఐదేళ్లపాటు గెరిల్లా పోరాటాలు చేసి ఉరికంబాలు ఎక్కి అమరులయ్యారు. బ్రిటిష్ సైనిక చట్టాన్ని భారతదేశంలో మొట్టమొద టిగా ఎదిరించిన ఘనత వారిదే. రాయల సీమ పాలెగాళ్లలో కొందరిని ఉరితీయగా కొం దరిని ద్వీపాంతరం పంపగా మరికొందరిని దేశ బహిష్కరణ చేశారు. ఎవరీ పాలెగాళ్లు? రాయలసీమ పాలెగా ళ్లను విజయనగర ప్రభువులు క్రీ.శ.15వ శతా బ్దిలో ప్రజలకు రక్షణ కల్పించేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకు నియమించారు. బ్రిటిష్ వాళ్లను ఎదిరించే నాటికి పాలెగాళ్లు 350 ఏళ్లుగా కొండ మార్గాల్లో దుర్గాలు, కోట లు, బురుజులు నిర్మించుకుని ప్రజల రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేవారు.
విజయ నగర రాజ్య పతనానంతరం పాలెగాళ్ల పాలన ప్రారంభమైంది. క్రీ.శ.1800 నాటికి సీమలో 80 మంది పాళెగాళ్లు, 30 వేల మంది సైని కులు ఉండేవారు. పాలెగాళ్లను తమిళంలో పాలైయాక్కరర్ అని, తెలుగులో పాలెగాడని, కన్నడంలో పాళె యగరరు అని అంటారు. వీళ్లు క్రీ.శ.17, 18వ శతాబ్దాల్లో సాయుధులై పాలన సాగించారు. క్రీ.శ.1600 నుండి క్రీ.శ.1800 వరకు రాయల సీమ ప్రాంతంలో బలమైన రాజుల పాలన లేదు. పాళెగాళ్ల పాలనే రాయలసీమలో ఉం డేది. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట పరాయి రాజుల వశమైనప్పటికీ బురుజులు మాత్రం పాళెగాళ్ల ఆధీనంలోనే ఉండేవి.
విజయనగర రాజుల కాలంలోనే క్రీ.శ. 1336-1680) పాళెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాళెగాళ్లు విజయనగర రాజు లకు పన్నులు వసూలు చేయడంలోనూ, అం తర్గత రక్షణ కల్పించడంలోనూ, రాజులకు అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. క్రీ.శ.1565లో జరిగిన తళ్లి కోట యుద్ధంలో సుల్తానుల చేతులలో పరాజ యం పొందిన విజయనగర రాజులు తమ రాజధానిని బళ్లారి జిల్లాలోని హంపీ నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు మార్చారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాతో బీజాపూర్, గోల్కొండ నవాబులు ఉమ్మడిగా 1650లో పెనుగొండ మీద దాడి చేసి విజయనగర రాజ్యాన్ని ధ్వంసం చేశారు. ఈ యుద్ధాలన్నింటికీ యుద్ధ భూమి సీమే. క్రీ.శ.1572లో పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యం ఏర్పడినప్పటి నుం చి 1800 సంవత్సరంలో బ్రిటిష్ వారికి రాయ లసీమ ప్రాంతం దారాదత్తమయ్యే దాకా ఇక్కడ 30 యుద్ధాలు జరిగాయి. ఈ 230 ఏళ్లలో ముస్లిం సైన్యాల ఘోరకృత్యాల వల్ల సీమ ప్రజల ధన, మాన, ప్రాణ నష్టం జరిగి ఈ ప్రాంతం సర్వనాశనమైంది.
బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడినందు వలన పాలెగాళ్లను బ్రిటిష్ సర్కార్ బంది పోట్లు అంటూ నిందించింది. నిజాం నవాబు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన ‘సైన్య సహకార’ పద్ధతికి తలొగ్గి సంధి షర తుల్లో భాగంగా సీమను 1800లో ఆంగ్లేయు లకు దారాదత్తం చేసిన ఫలితంగా సీమ ఎర్ర బడింది. 80 మంది పాలెగాళ్లు 33,000 మంది సైనికులతో బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టారు. క్రీ.శ.1801 నుంచి 1806 వరకు చిత్తూరు పాలెగాళ్లు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలబడ్డారు. ఈ పోరాటాలలో యాదరకొండ పాలెగారు రామప్ప నాయు డిని కల్లియబండ అడవులలో క్రీ.శ.1804లో బ్రిటిష్‌వారు ఉరి తీశారు. ఆ తరువాత వరుసగా బంగారు పాళెం పాలెగారు కుమారున్ని, చారగళ్లు పాలె గాళ్లను ఉరితీశారు. మిగిలిన పాళెంలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
1760లో హైదరాలీ కాలం నుంచి బ్రిటిష్ వారి వరకు 40 ఏళ్లపాటు పాలెగాళ్ల అణచివేతతో రాయలసీమ ఎరుపెక్కింది. ఆ నాడు బ్రిటిష్‌వారు పాలెగాళ్లను బందిపోట్లని ముద్రవేస్తే ఈ నాటి సీమ నాయకులను హత్యా రాజకీయాలు చేసేవాళ్లని నిందిస్తున్నా రు. చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు పన్నిన పన్నుగడ ఇది. క్రీ.శ.1500 నుంచి 1800 వరకు సీమను రక్షించేదెవరు? పాలె గాళ్లే! పాలెగాళ్లే ఫ్యాక్షనిస్టులనుకోవడం తప్పు డు అవగాహన. అనుకరణే చరిత్రగా మారి పోతే, మనకు మనమే పరాయివాళ్లుగా మిగిలి పోతాం. శతాబ్దాల బ్రిటిష్ ఆధిపత్యాన్ని జయించగలిగామే కానీ, వారు వదిలివెళ్లిన సాంస్కృతిక, చారిత్రక కాలుష్యపు కాడిని మాత్రం ఆరు దశాబ్దాల అనంతరం కూడా గుడ్డిగా మోస్తూనే ఉన్నాం. అందుకే సీమ అన గానే బాంబులు, కొడవళ్లతో కక్షలూ, కార్ప ణ్యాల కోలాటంగా ప్రవహించే నెత్తురే అని నమ్మించే ప్రయత్నాలు ఈ నాటికీ సాగుతూనే ఉన్నాయి.
శతాబ్దాలుగా సాగిన చెరువుల నిర్మాణం ఫలితంగా సీమ పచ్చటి పొలాలు ‘రత్నాలరాశుల’ను పండించిన చరిత్ర మనకు చెప్పరు. బ్రిటిష్ పాలనలో పరాయీకరణకు గురైన పాలెగాళ్లు తమ భూములూ, హక్కుల కోసం సాగించిన పోరులో అగ్రభాగాన నిలిచి, ఉరికొయ్యల ఊయలలూగిన ఉయ్యా లవాడ నరసింహారెడ్డి వంటి వీరులను నేటి చరిత్రకారులు మరచిపోవడం మహానేరం. దానికితోడు నాటి పాలెగాళ్ల సంస్కృతే నేటి ముఠాకక్షలకు మూలమని నిందించడం చారి త్రక ద్రోహం. పిడికెడు బువ్వ, గుక్కెడు నీళ్లు కరువై గుండె ఆగి మరణిస్తున్న కరువు సీమ బక్క రైతుల కన్నీటి గాథకు ‘ముఠా కక్షల’ ముసుగు తొడిగి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే సాధ్యం కాదన్న రీతిలో చరి త్రను వక్రీకరించడం నాయకుల, చరిత్రకారుల దౌర్బల్యం.
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ప్రపంచానికి సగర్వంగా చాటిన శ్రీకృష్ణ దేవ రాయలు తన అద్భుత పాలనతో సిరిసంపద లకు నెలవుగా మార్చిన భూభాగమే నేటి రాయలసీమ. ‘ఆంధ్ర పథం’ అని లిఖించిన అతి పురాతన శిలాశాసనం సీమ నేలలోనే బయటపడింది. 16వ శతాబ్దంలో దక్కన్ పీఠ భూమి నుంచి సుల్తానులు సాగించిన దండ యాత్రలతో కళ తప్పి రాళ్లసీమగా మారిన రాయలసీమలో తొలి స్వాతంత్య్ర పోరాట యోధులు పాలెగాళ్లు!
- డా॥ఎనుగొండ నాగరాజనాయుడు
విశ్రాంత ప్రధానాచార్యులు