తెలంగాణ పద్దు.. ‘సంక్షేమం’ పొద్దు | telangana government mainly focus on plan expenditure | Sakshi
Sakshi News home page

తెలంగాణ పద్దు.. ‘సంక్షేమం’ పొద్దు

Published Wed, Nov 5 2014 11:26 PM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

తెలంగాణ పద్దు.. ‘సంక్షేమం’ పొద్దు - Sakshi

తెలంగాణ పద్దు.. ‘సంక్షేమం’ పొద్దు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమానికి నీళ్లొదిలి కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేస్తున్న సమయంలో... తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికా వ్యయానికి బడ్జెట్‌లో 48 శాతం నిధులను కేటాయించడం విశేషం. కేటాయింపులతోపాటూ వాటి అమలులో పారదర్శకత కీలకం. కేటాయింపుల నుంచి అవి ప్రజలకు అందేవరకు నిధుల ప్రయాణాన్ని పారదర్శకంగా ఉంచి, ప్రజలకు తెలిసేలా చేస్తే నిధుల దుర్వినియోగానికి, అవినీతికి తావుండదు. అలాంటి పారదర్శకతకు హామీని కల్పిస్తేనే ప్రభుత్వం ఖర్చు  చేసే ప్రతి పైసా ప్రజల ముంగిటికి చేరుతుంది.
 
తెలంగాణ తొలి బడ్జెట్ రాష్ట్రంలో ఒక నూతన చారిత్రక ఘట్టానికి తెరతీసింది. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసానికి పూనుకుని ఈ ప్రభుత్వం ప్రణాళికా వ్యయాన్ని గణనీయంగా పెంచింది. తద్వారా అది ప్రజల తక్షణా భివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాననే భరోసాను కల్పించడం అభినందించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు 2009, 2010 రెండేళ్లు మినహా ఏనాడూ బడ్జెట్‌లోని ప్రణాళికావ్యయం 30 శాతం దాటలేదు.

నిన్నగాక మొన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్‌లోని ప్రణాళికా వ్యయం 24 శాతం మాత్రమే. ఇటీవలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను పరిశీలించినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రోజురోజుకీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదప్రజల సంక్షేమానికి, వారి అభివృద్ధికి నీళ్లొదిలి కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేస్తున్న ఈ సమయంలో... తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికా వ్యయానికి బడ్జెట్‌లో 48 శాతం నిధులను కే టాయించడం విశేషం. చంద్రబాబు ‘స్వర్ణాంధ్రప్రదేశ్’కోసం రూపొందించిన బడ్జెట్‌ను పరిశీలిస్తే...అది రోడ్లు, కారిడార్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, కార్పొరేట్‌లు తప్ప సాధారణ ప్రజల అవసరాలను తీర్చే పద్దులు కేటాయింపులకు నోచుకోలేద ని స్పష్టమవుతుంది.

సాగు నీటికి పెద్ద పీట
తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ప్రాధాన్యాలలో అత్యధిక భాగం ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉన్నాయని చెప్పక తప్పదు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు కాగా, అందులో ప్రణాళికా వ్యయం రూ.48,648 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు. వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి, చెరువుల మరమ్మతు, విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మా ణాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబర్చింది. మొదటగా నీటిపారుదల రంగం విషయంలో ప్రభుత్వం ఆచరణాత్మక విధానాన్ని అవలంబించింది. భారీ ప్రాజెక్టుల కోసం పరుగులు తీయకుండా తెలంగాణ ప్రజల జీవనాడిగా ఉన్న చెరువుల అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించడం అత్యంత విజ్ఞతాయుతమైన చర్య. మొత్తం నీటిపారుదల రంగానికి రూ. 6,500 కోట్లు కేటాయిస్తే అందులో రూ 2,000 కోట్లను చెరువుల అభివృద్ధికి కేటాయించి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను తీర్చారు.

చెరువుల విధ్వంసం తెలంగాణ వ్యవసాయం దెబ్బతిన డానికి ఒక ప్రధాన కారణం. సమైక్యాంధ్రలో ఉద్దేశపూర్వకంగానే చెరువుల అభివృద్ధి, మరమ్మతులపై కనీస శ్రద్ధ చూపలేదు. లక్షలాది ఎకరాల సాగుభూమి బీడు భూమిగా మారడానికి ఉమ్మడి పాలన కారణమైంది. ఫలితంగా 80 శాతం వ్యవసాయం కరెంటు బోర్లు, బావుల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఈ విధానానికి చరమగీతం పాడుతూ ఐదేళ్లలో 45 వేలకు పైగా చెరువులను రూ. 10,000 కోట్ల వ్యయంతో బాగు చేయాలని నిర్ణయించారు. ఇది దేశ వ్యవసాయ చరిత్రలోనే ఒక మరపురాని ఘట్టంగా మిగిలిపోతుంది. అదే విధంగా కరువు కాటకాలు, వలసలతో అలమటిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. కల్వకుర్తి, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, బీమా పథకాలను సత్వరమే పూర్తి చేసి అదనంగా దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు.

వ్యవసాయ అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్ ప్రత్యేక శ్రద్ధతో కేటాయిం పులను జరపడం గమనార్హం.  ఇన్‌పుట్ సబ్సిడీ, మార్కెట్ ధరల స్థిరీకరణ, విత్తన భాండాగారం ఏర్పాట్లు మంచి పరిణామాలు.  అలాగే చిన్న చిన్న కమతాల ఏకీకరణ అనే వినూత్న విధానాన్ని ముందుకు తెచ్చారు. నిజాం కాలంలో ఇటువంటి ప్రయత్నం ఒకసారి జరిగింది. కమతాల ఏకీకరణ వల్ల రైతులు లబ్ధి పొందడమే కాక,  భూమి రికార్డుల నిర్వహణ సులభం అవుతుంది.

కార్యరూపం దాల్చిన ఎస్సీ, ఎస్టీల సంక్షేమం
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి గత కొంతకాలంగా ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలకు బడ్జెట్ కార్యరూపం ఇచ్చింది. ముఖ్యంగా సబ్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వేరే పథకాలకు మళ్లిస్తూవచ్చిన తీరును ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగంలో తీవ్రంగా దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు వారికే చెందే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తా మని, నిధుల మళ్లింపు ప్రశ్నే తలెత్తదని హామీ ఇచ్చారు.

తెలంగాణ జనాభాలో 15.4 శాతంగా ఉన్న ఎస్సీల సబ్ ప్లాన్‌కు రూ. 7,579.45 కోట్లు, 9.34 శాతంగా ఉన్న ఎస్టీల సబ్ ప్లాన్‌కు రూ.4,559.81 కోట్లు ప్రతిపాదించారు. ఈ పద్దుల్లోంచే ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 50 వేలు చొప్పున సహాయం అందించాలని నిర్ణయించారు. ఇక భూమిలేని పేద దళితులకు సాగుభూమిని కొనుగోలు చేసి ఇవ్వడానికి రూ.1,000 కోట్లు కేటాయించారు. భూమి కొనుగోలు పట్ల అధికా రులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. తగు అధికారాలు కలిగిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తేనే ఈ పథకం ఆశించిన ఫలితాలను ఇస్తుంది. లేనట్లయితే పేరుకు కేటాయింపులు జరిగినా గత బడ్జెట్లలాగే అమలు అంగుళమైనా కదలని పరిస్థితే పునరావృత మయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి.

ప్రజలను భాగస్వాములను చేసిన వినూత్న బడ్జెట్
‘‘గత బడ్జెట్‌లతో పోలిస్తే విధానపరంగా ఈ బడ్జెట్ చాలా భిన్నమైనది. తెలం గాణకు ఇప్పుడు కావాల్సింది ప్రజల ప్రాధాన్యాలను ప్రతిబింబించే బడ్జెట్. ‘మన ఊరు, మన ప్రణాళిక’’ కార్యక్రమం ద్వారా ప్రజలు ఏం కోరుకుంటు న్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్లింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో ఈ పథకాలు రూపొందాయి. ప్రభుత్వం ఖర్చు చేసే ఏ ఒక్క పైసా వృథా కాకూడదు, పక్కదారి పట్టకూడదు, బలహీన వర్గాల అభివృద్ధికి ఉపయోగపడాలనేది మా లక్ష్యం.’’ తెలంగాణ రాష్ట్రం మొట్ట మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్న ఈ మాటలు ఆచరణరూపం దాల్చడానికి ప్రభుత్వంలోని అన్నివర్గాలు సర్వ శక్తులూ ఒడ్డి కృషి చేయాల్సి ఉంటుంది.

పారదర్శకతతోనే సత్వర అభివృద్ధి  
బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వం ప్రజలను భాగస్వాములను చేయడానికి ప్రయత్నించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ‘‘మన ఊరు, మన ప్రణాళిక’’ ద్వారా ప్రజల నుంచి ప్రతిపాదనలను తీసుకోవడం, 14 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రభుత్వేతర ప్రతినిధుల ద్వారా సలహాలను స్వీకరించడం అనే ప్రయత్నం... దేశ బడ్జెట్ రూపకల్పనా చరిత్రలోనే ముందడు గుగా చెప్పుకోవచ్చు. అయితే బడ్జెట్ అనంతరం కూడా ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతిపైసా ప్రజలకు చెందాలంటే... కేటాయించిన నిధులను ఖర్చు చేస్తున్న విధానం, అందుతున్న ఫలితాలు కూడా వారికి తెలియాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ కేటాయింపులతో పాటూ వాటి అమలులో పారదర్శకత అత్యంత కీలకం.

ఈ విషయంలో మనం కొన్ని అంతర్జాతీయ అనుభవాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అమెరి కాలో బడ్జెట్ పారదర్శకత కోసం 2006లో ఒక చట్టం చేసి, బడ్జెట్ కేటాయింపుల నుంచి అవి ప్రజలకు అందేవరకు వివిధ దశల్లో నిధుల ప్రయాణాన్ని పారదర్శ కంగా ఉంచారు. అందరికీ అందుబాటులో ఉండేలా వాటిని వెబ్‌సైట్‌లో పెట్టారు. దీంతో ప్రభుత్వం కేటాయించిన ప్రతి పైసా ఖర్చయ్యే విధానం ప్రజ లకు తెలిసే అవకాశం ఉంది. లాటిన్ అమెరికా దేశాలు సైతం ఇలాంటి ప్రయ త్నాలు చేస్తున్నాయి. బ్రెజిల్‌లో బడ్జెట్ రూపకల్పన, కేటాయింపులు, అమలు, తదితర అన్ని విషయాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధానం వల్ల ప్రజలు కూడా చైతన్యవంతులయ్యారు, కొందరు అవినీతిపరుల దుశ్చర్యలు బహిర్గతమయ్యాయి కూడా.

ఈ పద్ధతి సఫలం కావడంవల్లనే అవినీతి చర్యలకు పాల్పడిన కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులు, అధికారులు, మంత్రులకు శిక్షలు పడ్డాయి. అవినీతి మొత్తాన్ని తిరిగి రాబట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒక మంత్రి తన విదేశీ పర్యటనకు నిబంధనలకు నీళ్లొదిలి విచ్చలవిడిగా ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం ఆ దేశంలో సంచలనాన్ని సృష్టించింది. అక్కడి ప్రభుత్వం రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా జర్నలిస్టులు కూడా చాలా కథనాలు రాసి అవినీతిపరుల బాగోతం బట్టబయలు చేశారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా పారదర్శకత వైపు దృష్టి సారిస్తే ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రతిపైసా ప్రజల ముంగిటికి చేరుతుంది. తెలంగాణ సత్వర అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.

(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement