Telangana first budget
-
‘దుబ్బాక’ చేనేతకు రూ.10 కోట్లు
- ఫలించిన దుబ్బాక ఎమ్మెల్యే వీఐపీ రిపోర్టింగ్ - ‘సాక్షి’ కథనాన్ని సీఎంకు చూపించి ఒప్పించిన రామలింగారెడ్డి సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: దుబ్బాక చేనేతకు మహర్దశ పట్టనుంది. తెలంగాణ తొలిబడ్జెట్‌లో టెక్స్‌టైల్‌పార్కు కోసం కేటాయించిన రూ.10 కోట్ల నిధులు చేనేతల అభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. అయి తే ఈ కేటాయింపులకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా కారణమయ్యారు. ఆయన ఇటీవల ‘సాక్షి’ విఐపి రిపోర్టర్‌గా వ్యవహరించి చేనేత కార్మికులు పడుతున్న అవస్థలు, రోజంతా కష్టం చేసినా కనీసం రూ.100 కూడా కూలీ గిట్టుబాటు కా ని విధానాన్ని వెలుగులోకి తెచ్చారు. ‘సాక్షి’ ఈ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. టెక్స్‌టైల్‌పార్కు నిధులను దు బ్బాక చేనేత సొసైటీ అభివృద్ధికి విని యోగించాలని జిల్లా జౌళి శాఖ ఏడీకి సీఎం ఆదేశాలిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో ఒక్క వపర్లూం కూడా లేదని, అన్ని హ్యాండ్లూం మగ్గాలే ఉన్నాయని, అలాంటప్పుడు టెక్స్టైల్ పార్కు నిధులు కేటాయించడం వల్ల ఆశించిన ఫలితాలు రావని తాను ముఖ్యమంత్రికి వివరించానని ఎమ్మెల్యే తెలిపారు. చేనేత కార్మికులు రోజంతా కష్టం చేసినా రోజుకు రూ. 60 మాత్రమే కూలీ పడుతోందని, దుబ్బాక చేనేత కార్మికులకు నాణ్యమైన బట్టలు నేసే పనితనం ఉన్నా.. పెట్టుబడి పెట్టి నాణ్యమైన ముడి సరుకులు కొని బట్టలు కొనలేకపోతున్నారని,వారికి కొద్దిపాటి ఆర్థిక సహకారం అందిస్తే ప్రతి చేనేత కూడా లె నిన్ బట్టలు నేస్తారని, అప్పుడు వారికి నెలకు కనీసం రూ.15 వేల నుంచి 20 వరకు గిట్టుబాటు అవుతుందని, ముఖ్యమంత్రి కేటాయించిన రూ. 10 కోట్లలో కొంత డబ్బును ఇందుకోసం వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయమని జిల్లా జౌళి శాఖ ఏడీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. డైయింగ్ సెంటర్ ఏర్పాటు కోసం రూ 50 లక్షలు అవసరమవుతాయని, ఇలాంటివి దుబ్బాక నియోజకవర్గంలో కనీసం ఐదు గ్రామాల్లో ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు చేయాలని, మరి కొంత డబ్బుతో వీవర్ కమ్యునిటి హాల్ కట్టుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జౌళి శాఖ ఏడీని కోరినట్లు ఎమ్మెల్యే రామలింగారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రి, ‘సాక్షి’లకు కృతజ్ఞతలు: సోలిపేట ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్ చేయబట్టే తాను క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవ పరిస్థితిని గమనించానని, తాను చూసిన విషయాలనే ముఖ్యమంత్రికి చెప్పి ఒప్పించగలిగానని, తన నియోజకవర్గం చేనేత కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు,రూ 10 కేటాయించడంలో సహకరించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు, తనను క్షేత్రస్థాయిలోకి తీసుకొనిపోయి చేనేతల కష్టాలను కళ్లకు గట్టిన ‘సాక్షి’కి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
బడ్జెట్ కేటాయింపులపై నిరసనలు
తెలంగాణ తొలి బడ్జెట్లో విద్యారంగానికి సరైన కేటాయింపులు జరపలేదని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించాయి. ఈమేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బడ్జెట్ ప్రతులను తగులబెట్టారు. ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఓయూకు తీరని అన్యాయం జరిగిందని ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం ఆర్ట్స్ కళాశాల ఎదుట రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను వేర్వేరుగా దహనం చేశారు. వర్సిటీల నిధులను పెంచి ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. టీటీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి తీరని ద్రోహం చేసిందని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను, విద్యార్థి అమరుల కలలను కల్లలు చేశారని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఆంజనేయగౌడ్ విమర్శించారు. ఈమేరకు తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య పార్కు వద్ద టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక, బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యారంగానికి 16 శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం 10 శాతమే కేటాయించిందని విమర్శించారు. కార్యక్రమంలో టీటీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ గౌడ్, రాష్ట్ర నాయకులు సాయి, కిరణ్, రఘుకిరణ్, శ్రావణ్, శరత్ చంద్ర, సుశాంత్, పృథ్వీ, సాయినాథ్‌రెడ్డి, అర్జున్, వర్ధన్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో... చిక్కడపల్లి : బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌నాయక్, కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ విద్యారంగానికి ఇంత తక్కువగా నిధులిస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విద్య, ఉపాధికి ప్రాధాన్యతలేని బడ్జెట్ వృధా అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట రమేష్, సహాయ కార్యదర్శి జగదీష్, నాయకులు గణేష్, జావిద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో..... హిమాయత్‌నగర్ : బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం నారాయణగూడలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ, సహాయ కార్యదర్శి ఎం.వేణు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు సత్యప్రసాద్, నగర నాయకులు కృష్ణనాయక్, చైతన్య, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ మర్చిపోవడం దారుణమని వారు విమర్శించారు. -
బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ తొలి ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజల ఆశలను ఆవిరి చేసిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌తో జిల్లా ప్రజలకు ఒరిగేదేమీ లేదని అంటున్నాయి. ప్రాధాన్యత క్రమంలో జిల్లాకు నిధులు కేటాయిస్తారని ఆశించినా చివరకు నిరాశే మిగిలింది. రాష్ట్రస్థాయిలో వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్లో జిల్లాకు రావాల్సిన వాటా మినహా ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులూ జరగలేదు. సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వేలకోట్లు కేటాయించిన ప్రభుత్వం జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులకు నామమాత్రంగానే నిధులు మంజూరు చేసింది. బడ్జెట్లో రాజీవ్‌సాగర్ (దుమ్ముగూడెం), ఇందిరాసాగర్, పెదవాగు, వైరా రిజర్వాయర్, గుండ్లవాగు, తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ నిధులు కేటాయించిన ప్రభుత్వం అవి ఏ ప్రాతిపదికన కేటాయించిందో మాత్రం స్పష్టతలేదు. రాజీవ్‌సాగర్‌కు రూ.11 కోట్లు, ఇందిరాసాగర్‌కు రూ.5 కోట్లు కేటాయించారు. కిన్నెరసానికి రూ.10 లక్షలు, తాలిపేరుకు రూ.10 లక్షలు, వైరాకు రూ.10 లక్షలు, గుండ్లవాగుకు రూ.10 లక్షలు, పెదవాగుకు రూ.20 లక్షలు కేటాయించినట్లు బడ్జెట్లో చూపించారు. రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అటవీశాఖ క్లియరెన్స్ రావాల్సి ఉన్నందున ఈ సంవత్సరం పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో నిర్మాణ పనులు కొనసాగడానికి అవసరమైన నిధులను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసిందని అధికారపార్టీ నేతలు అంటున్నారు. ఆంధ్రా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉన్నందున ఇందిరాసాగర్ సైతం ఉన్నపళంగా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతోనే రూ.5 కోట్లు కేటాయించారని తెలుస్తోంది. జిల్లాలో రైతులు ఆశలు పెట్టుకున్న అనేక ప్రాజెక్టులు నిధులు కేటాయించలేదు. ఇలా విస్మరించిన వాటిలో భద్రాచలంలోని మోడుకుంట వాగు, వద్దిపేట వాగు, పినపాక నియోజకవర్గంలోని పులుసుబొంత ప్రాజెక్టులు ఉన్నాయి. ఇతర కేటాయింపుల్లోనూ జిల్లాకు తగు ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏరియా ఆస్పత్రులకు కోటి రూపాయలు మంజూరు చేస్తామని బడ్జెట్లో చెప్పిన ప్రభుత్వం జిల్లా వైద్యశాలను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయింది. ప్రభుత్వం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు, పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుదలకు ఎంత కేటాయిస్తుందో మాత్రం పేర్కొనలేదు. జిల్లాలో అనేక తాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా వీటికి న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రజానీకానికి నిరాశే మిగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి రూ.2వేల కోట్లే కేటాయించడం..జిల్లాకు గుక్కెడు నీళ్లు రావడానికి ఏమేరకు నిధులు కేటాయిస్తారో తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వం అంకెలగారడీ, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ వంటి పార్టీలు విమర్శలు చేశాయి. టీఆర్ఎస్ మాత్రం ఇది జనరంజక బడ్జెట్‌గా అభివర్ణించింది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులకు మౌలిక సదుపాయాల కల్పనకు, గిరిజన సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తీవ్ర ఆక్షేపణ చేశారు. ప్రభుత్వం జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో ఈ బడ్జెట్‌తో చెప్పకనే చెప్పిందని విమర్శలు చేశారు. బడ్జెట్ కేటాయింపులు నిరాశ జనకంగా ఉన్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు అన్నారు. ఈ స్థాయిలో కేటాయింపులు జరిగితే జిల్లా ప్రజల కలలు నెరవేరడానికి దశాబ్దాలు సరిపోవన్నారు. బడ్జెట్లో వైద్యరంగాన్ని పూర్తిగా విస్మరించిందని, 104, 108 వంటివాటికి నిధులు కేటాయింపు సరిగా లేదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఫాస్ట్ పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందన్నారు. బడ్జెట్లో జిల్లాకు సరైన ప్రాధాన్యమే లభించిందని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ అన్నారు. జిల్లా సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఆ మేరకే అన్ని రంగాలకు నిధులు కేటాయించిందన్నారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చితీరుతుందన్నారు. జిల్లాలో నిధులు ఎక్కడ అవసరమో అక్కడ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
తెలంగాణ పద్దు.. ‘సంక్షేమం’ పొద్దు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమానికి నీళ్లొదిలి కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేస్తున్న సమయంలో... తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికా వ్యయానికి బడ్జెట్లో 48 శాతం నిధులను కేటాయించడం విశేషం. కేటాయింపులతోపాటూ వాటి అమలులో పారదర్శకత కీలకం. కేటాయింపుల నుంచి అవి ప్రజలకు అందేవరకు నిధుల ప్రయాణాన్ని పారదర్శకంగా ఉంచి, ప్రజలకు తెలిసేలా చేస్తే నిధుల దుర్వినియోగానికి, అవినీతికి తావుండదు. అలాంటి పారదర్శకతకు హామీని కల్పిస్తేనే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల ముంగిటికి చేరుతుంది. తెలంగాణ తొలి బడ్జెట్ రాష్ట్రంలో ఒక నూతన చారిత్రక ఘట్టానికి తెరతీసింది. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసానికి పూనుకుని ఈ ప్రభుత్వం ప్రణాళికా వ్యయాన్ని గణనీయంగా పెంచింది. తద్వారా అది ప్రజల తక్షణా భివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాననే భరోసాను కల్పించడం అభినందించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు 2009, 2010 రెండేళ్లు మినహా ఏనాడూ బడ్జెట్లోని ప్రణాళికావ్యయం 30 శాతం దాటలేదు. నిన్నగాక మొన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్లోని ప్రణాళికా వ్యయం 24 శాతం మాత్రమే. ఇటీవలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను పరిశీలించినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రోజురోజుకీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదప్రజల సంక్షేమానికి, వారి అభివృద్ధికి నీళ్లొదిలి కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేస్తున్న ఈ సమయంలో... తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికా వ్యయానికి బడ్జెట్లో 48 శాతం నిధులను కే టాయించడం విశేషం. చంద్రబాబు ‘స్వర్ణాంధ్రప్రదేశ్’కోసం రూపొందించిన బడ్జెట్‌ను పరిశీలిస్తే...అది రోడ్లు, కారిడార్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, కార్పొరేట్లు తప్ప సాధారణ ప్రజల అవసరాలను తీర్చే పద్దులు కేటాయింపులకు నోచుకోలేద ని స్పష్టమవుతుంది. సాగు నీటికి పెద్ద పీట తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ప్రాధాన్యాలలో అత్యధిక భాగం ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉన్నాయని చెప్పక తప్పదు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు కాగా, అందులో ప్రణాళికా వ్యయం రూ.48,648 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు. వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి, చెరువుల మరమ్మతు, విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మా ణాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబర్చింది. మొదటగా నీటిపారుదల రంగం విషయంలో ప్రభుత్వం ఆచరణాత్మక విధానాన్ని అవలంబించింది. భారీ ప్రాజెక్టుల కోసం పరుగులు తీయకుండా తెలంగాణ ప్రజల జీవనాడిగా ఉన్న చెరువుల అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించడం అత్యంత విజ్ఞతాయుతమైన చర్య. మొత్తం నీటిపారుదల రంగానికి రూ. 6,500 కోట్లు కేటాయిస్తే అందులో రూ 2,000 కోట్లను చెరువుల అభివృద్ధికి కేటాయించి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను తీర్చారు. చెరువుల విధ్వంసం తెలంగాణ వ్యవసాయం దెబ్బతిన డానికి ఒక ప్రధాన కారణం. సమైక్యాంధ్రలో ఉద్దేశపూర్వకంగానే చెరువుల అభివృద్ధి, మరమ్మతులపై కనీస శ్రద్ధ చూపలేదు. లక్షలాది ఎకరాల సాగుభూమి బీడు భూమిగా మారడానికి ఉమ్మడి పాలన కారణమైంది. ఫలితంగా 80 శాతం వ్యవసాయం కరెంటు బోర్లు, బావుల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఈ విధానానికి చరమగీతం పాడుతూ ఐదేళ్లలో 45 వేలకు పైగా చెరువులను రూ. 10,000 కోట్ల వ్యయంతో బాగు చేయాలని నిర్ణయించారు. ఇది దేశ వ్యవసాయ చరిత్రలోనే ఒక మరపురాని ఘట్టంగా మిగిలిపోతుంది. అదే విధంగా కరువు కాటకాలు, వలసలతో అలమటిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. కల్వకుర్తి, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, బీమా పథకాలను సత్వరమే పూర్తి చేసి అదనంగా దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్ ప్రత్యేక శ్రద్ధతో కేటాయిం పులను జరపడం గమనార్హం. ఇన్పుట్ సబ్సిడీ, మార్కెట్ ధరల స్థిరీకరణ, విత్తన భాండాగారం ఏర్పాట్లు మంచి పరిణామాలు. అలాగే చిన్న చిన్న కమతాల ఏకీకరణ అనే వినూత్న విధానాన్ని ముందుకు తెచ్చారు. నిజాం కాలంలో ఇటువంటి ప్రయత్నం ఒకసారి జరిగింది. కమతాల ఏకీకరణ వల్ల రైతులు లబ్ధి పొందడమే కాక, భూమి రికార్డుల నిర్వహణ సులభం అవుతుంది. కార్యరూపం దాల్చిన ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి గత కొంతకాలంగా ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలకు బడ్జెట్ కార్యరూపం ఇచ్చింది. ముఖ్యంగా సబ్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వేరే పథకాలకు మళ్లిస్తూవచ్చిన తీరును ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగంలో తీవ్రంగా దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు వారికే చెందే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తా మని, నిధుల మళ్లింపు ప్రశ్నే తలెత్తదని హామీ ఇచ్చారు. తెలంగాణ జనాభాలో 15.4 శాతంగా ఉన్న ఎస్సీల సబ్ ప్లాన్‌కు రూ. 7,579.45 కోట్లు, 9.34 శాతంగా ఉన్న ఎస్టీల సబ్ ప్లాన్‌కు రూ.4,559.81 కోట్లు ప్రతిపాదించారు. ఈ పద్దుల్లోంచే ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 50 వేలు చొప్పున సహాయం అందించాలని నిర్ణయించారు. ఇక భూమిలేని పేద దళితులకు సాగుభూమిని కొనుగోలు చేసి ఇవ్వడానికి రూ.1,000 కోట్లు కేటాయించారు. భూమి కొనుగోలు పట్ల అధికా రులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. తగు అధికారాలు కలిగిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తేనే ఈ పథకం ఆశించిన ఫలితాలను ఇస్తుంది. లేనట్లయితే పేరుకు కేటాయింపులు జరిగినా గత బడ్జెట్లలాగే అమలు అంగుళమైనా కదలని పరిస్థితే పునరావృత మయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి. ప్రజలను భాగస్వాములను చేసిన వినూత్న బడ్జెట్ ‘‘గత బడ్జెట్లతో పోలిస్తే విధానపరంగా ఈ బడ్జెట్ చాలా భిన్నమైనది. తెలం గాణకు ఇప్పుడు కావాల్సింది ప్రజల ప్రాధాన్యాలను ప్రతిబింబించే బడ్జెట్. ‘మన ఊరు, మన ప్రణాళిక’’ కార్యక్రమం ద్వారా ప్రజలు ఏం కోరుకుంటు న్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్లింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో ఈ పథకాలు రూపొందాయి. ప్రభుత్వం ఖర్చు చేసే ఏ ఒక్క పైసా వృథా కాకూడదు, పక్కదారి పట్టకూడదు, బలహీన వర్గాల అభివృద్ధికి ఉపయోగపడాలనేది మా లక్ష్యం.’’ తెలంగాణ రాష్ట్రం మొట్ట మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్న ఈ మాటలు ఆచరణరూపం దాల్చడానికి ప్రభుత్వంలోని అన్నివర్గాలు సర్వ శక్తులూ ఒడ్డి కృషి చేయాల్సి ఉంటుంది. పారదర్శకతతోనే సత్వర అభివృద్ధి బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వం ప్రజలను భాగస్వాములను చేయడానికి ప్రయత్నించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ‘‘మన ఊరు, మన ప్రణాళిక’’ ద్వారా ప్రజల నుంచి ప్రతిపాదనలను తీసుకోవడం, 14 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రభుత్వేతర ప్రతినిధుల ద్వారా సలహాలను స్వీకరించడం అనే ప్రయత్నం... దేశ బడ్జెట్ రూపకల్పనా చరిత్రలోనే ముందడు గుగా చెప్పుకోవచ్చు. అయితే బడ్జెట్ అనంతరం కూడా ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతిపైసా ప్రజలకు చెందాలంటే... కేటాయించిన నిధులను ఖర్చు చేస్తున్న విధానం, అందుతున్న ఫలితాలు కూడా వారికి తెలియాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ కేటాయింపులతో పాటూ వాటి అమలులో పారదర్శకత అత్యంత కీలకం. ఈ విషయంలో మనం కొన్ని అంతర్జాతీయ అనుభవాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అమెరి కాలో బడ్జెట్ పారదర్శకత కోసం 2006లో ఒక చట్టం చేసి, బడ్జెట్ కేటాయింపుల నుంచి అవి ప్రజలకు అందేవరకు వివిధ దశల్లో నిధుల ప్రయాణాన్ని పారదర్శ కంగా ఉంచారు. అందరికీ అందుబాటులో ఉండేలా వాటిని వెబ్సైట్లో పెట్టారు. దీంతో ప్రభుత్వం కేటాయించిన ప్రతి పైసా ఖర్చయ్యే విధానం ప్రజ లకు తెలిసే అవకాశం ఉంది. లాటిన్ అమెరికా దేశాలు సైతం ఇలాంటి ప్రయ త్నాలు చేస్తున్నాయి. బ్రెజిల్లో బడ్జెట్ రూపకల్పన, కేటాయింపులు, అమలు, తదితర అన్ని విషయాలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధానం వల్ల ప్రజలు కూడా చైతన్యవంతులయ్యారు, కొందరు అవినీతిపరుల దుశ్చర్యలు బహిర్గతమయ్యాయి కూడా. ఈ పద్ధతి సఫలం కావడంవల్లనే అవినీతి చర్యలకు పాల్పడిన కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులు, అధికారులు, మంత్రులకు శిక్షలు పడ్డాయి. అవినీతి మొత్తాన్ని తిరిగి రాబట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒక మంత్రి తన విదేశీ పర్యటనకు నిబంధనలకు నీళ్లొదిలి విచ్చలవిడిగా ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం ఆ దేశంలో సంచలనాన్ని సృష్టించింది. అక్కడి ప్రభుత్వం రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా జర్నలిస్టులు కూడా చాలా కథనాలు రాసి అవినీతిపరుల బాగోతం బట్టబయలు చేశారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా పారదర్శకత వైపు దృష్టి సారిస్తే ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రతిపైసా ప్రజల ముంగిటికి చేరుతుంది. తెలంగాణ సత్వర అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) -
బడ్జెట్లో జిల్లాకు భారీ కేటాయింపులు?
నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు తెలంగాణ తొలి బడ్జెట్... రాజీలోని పోరాటంతో రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్ తొలిసారి ప్రవేశపెట్టబోతోన్న బడ్జెట్.. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కలల బడ్జెట్.. అందుకే ఇపుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకర్లు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో మెతుకుసీమపై ఎలాంటి వరాలు కురుస్తాయోనని జిల్లా వాసులంతా ఎదురుచూస్తున్నారు. మన ఆశలకు తగ్గట్టుగానే తొలి బడ్జెట్లో మనకే తొలి ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాకతీయల కాలంలో ఆతర్వాత నిజాం హయాంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు కాలంతో పాటే అంతర్థానమయ్యాయి. మాయమైన చెరువులకు మళ్లీ జీవం పోసి నాటి జలకళను తెప్పించి, బీడు భూములను తడిపే దిశగా కేసీఆర్ సర్కారు తొలి అడుగులు వేస్తోంది. ఉన్న ఒక్క మంజీరా జీవనదిని వలస వాదులు చెరబట్టి హైదరాబాద్‌కు తరలించుకుపోతే, ఉన్న చిన్న నీటి వనరులతోనే ఆయకట్టుకు నీరు పారించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కసరత్తు చేశారు. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇంతకాలం కాంట్రాక్టర్ల జేబులు నింపిన చెరువుల మరత్తుల పునరుద్ధరణ ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుల శాఖ మంత్రి హరీష్‌రావు ఈ జిల్లాకు చెందిన బిడ్డలే కావటంతో బడ్జెట్లో జిల్లాకే పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. రోడ్ల విస్తరణ కోసం రూ.1000 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు రూ. 500 కోట్లు వాటర్ గ్రిడ్లకు రూ. 500 కోట్లు, గ్రీన్‌హౌస్‌కు రూ.200 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు సమాచారం. ప్రాణహిత- చేవెళ్ల, సింగూరు, ఘణపురం ప్రాజెక్టులకు కూడా బడ్జెట్లో నిధుల వరద పారినట్టు తెలుస్తోంది. ఇవికాకుండ ‘మన ఊరు- మన ప్రణాళిక’ పథకం కింద సిద్ధం చేసిన ప్రతిపాదనల కోసం రూ.1,500 కోట్లు ఇచ్చి, తొలి తెలంగాణ బడ్జెట్ మెతుకు సీమ రైతాంగం ఆశలను చిగురించే విధంగా రూపొందించినట్లు తెలుస్తోంది. సామాజిక ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ జిల్లాలో ఇటీవలే నీటివనరులకు సంబంధించి నీటిపారుదలశాఖ సమగ్ర సర్వే నిర్వహించింది. జిల్లాలో మొత్తం 9,970 నీటి వనరులు ఉన్నట్లు తేలింది. వీటిలో 578 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 109 ఆనకట్టలు, 5,509 పంచాయతీరాజ్ కుంటలు, 274 ప్రైవేటు కుంటలు, 1,927 చెక్‌డ్యాంలు, 1,336 పర్కులేషన్ ట్యాంకులు, 237 ఇతర నీటి వనరులు ఉన్నాయి. వీటి మీదనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. జిల్లాలో గుర్తించిన చెరువుల, కుంటలను ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో దశల వారీగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని 20 శాతం చెరువుల, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులను చేపట్టనున్నారు. నీటివనరుల సమగ్ర సర్వే ఆధారంగా అధికారులు జిల్లాలో మొదటి దశలో చెరువులు, కుంటల మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. జిల్లాలో మొదటి దశ కింద 1,588 చెరువులు, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 175, దుబ్బాకలో 275, గజ్వేల్‌లో 239, అందోలులో 124, సంగారెడ్డిలో 107, పటాన్చెరులో 92, జహీరాబాద్‌లో 25 చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నారు. నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 551 చెరువుల మరమ్మతు పనులు చేపట్టే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి దశల వారీగా జిల్లాలోని ప్రతి ఇంటికీ తాగునీటి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. మొత్తం 446 కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీళ్లు అందించే యోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. దీనికోసం ప్రభుత్వం రూ.5,600 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. తాగునీటికోసం సింగూరు ప్రాజెక్టు నుంచి 8 టీఎంసీల నీళ్లను వాడుకునేందుకు రూపకల్పన చేసినట్లు సమాచారం. మండలానికి రెండు లేన్ల రోడ్లు బడ్జెట్లో జిల్లాలోని రోడ్లకు అధిక ప్రాముఖ్యత కల్పించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించినట్లుగా మెదక్ జిల్లాలో రోడ్ల విస్తరణకు రూ.1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు సమాచారం. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ కనీసం రెండు లేన్ల రోడ్లు నిర్మించే విధంగాబడ్జెట్లో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు, ఇస్మల్కాపూర్ నుంచి హైదరాబాద్ వరకు నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు సమాచారం. దీంతోపాటు గజ్వేల్, సంగారెడ్డి పట్టణాల్లో రింగ్ రోడ్డు నిర్మాణానికి బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. విత్తనోత్పత్తి హబ్‌గా జిల్లాలో గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లోరూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. గజ్వేల్ పట్టణంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగులో ఫారెస్ట్రీ కాలేజ్ , హార్టీకల్చర్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ తదితర సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూరగాయల సాగు చేయడానికి వీలుగా నిధుల కేటాయింపు జరిగినట్లు తెలిసింది. జిల్లాలో నాణ్యమైన విత్తన గింజలను పండించే విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమచారం. -
తెలంగాణ ఇంక్రిమెంట్‌కు రూ. 200 కోట్లు
- బడ్జెట్ తయారీకి కసరత్తు - ఈ నెలాఖరులోపు వివరాలు పంపండి - అన్నిశాఖలకు ఆర్థికశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఎన్నికలవేళ కాకుండా ఉద్యమం సందర్భంగా పలుసార్లు తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన ఇంక్రిమెంట్ హామీని నిలబట్టుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర సాధన సందర్భంగా తెలంగాణ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరుచేస్తామని కేసీఆర్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థికశాఖ ఇప్పటికే ఈ ఇంక్రిమెంట్‌పై కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి రూ.200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తుదినిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీని వల్ల తెలంగాణకు చెందిన నాలుగు లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. తొలిబడ్జెట్ తయారీ... తెలంగాణ తొలిబడ్జెట్ తయారీకి ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణకు చెందిన అన్ని శాఖలు తమ బడ్జెట్‌కు అవసరమైన వివరాలను ఈ నెలాఖరుకల్లా పంపించాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రధానంగా ఎన్నికలప్రణాళికలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా వ్యవహరించాలని, మేనిఫెస్టోలోని అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతిపాదనలు పంపాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. తెలంగాణ తొలిబడ్జెట్ అయినందున లోపాలకు తావులేకుండా జాగ్రత్తగా రూపొందించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది.