బడ్జెట్ కేటాయింపులపై నిరసనలు
తెలంగాణ తొలి బడ్జెట్‌లో విద్యారంగానికి సరైన కేటాయింపులు జరపలేదని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించాయి. ఈమేరకు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బడ్జెట్ ప్రతులను తగులబెట్టారు.
ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఓయూకు తీరని అన్యాయం జరిగిందని ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం ఆర్ట్స్ కళాశాల ఎదుట రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను వేర్వేరుగా దహనం చేశారు. వర్సిటీల నిధులను పెంచి ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
టీటీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యారంగానికి తీరని ద్రోహం చేసిందని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను, విద్యార్థి అమరుల కలలను కల్లలు చేశారని టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఆంజనేయగౌడ్ విమర్శించారు. ఈమేరకు తెలంగాణ టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య పార్కు వద్ద టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళిక, బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యారంగానికి 16 శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం 10 శాతమే కేటాయించిందని విమర్శించారు. కార్యక్రమంలో టీటీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ గౌడ్, రాష్ట్ర నాయకులు సాయి, కిరణ్, రఘుకిరణ్, శ్రావణ్, శరత్ చంద్ర, సుశాంత్, పృథ్వీ, సాయినాథ్‌రెడ్డి, అర్జున్, వర్ధన్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో...
చిక్కడపల్లి : బడ్జెట్‌లో విద్యారంగానికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌నాయక్, కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ విద్యారంగానికి ఇంత తక్కువగా నిధులిస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విద్య, ఉపాధికి ప్రాధాన్యతలేని బడ్జెట్ వృధా అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట రమేష్, సహాయ కార్యదర్శి జగదీష్, నాయకులు గణేష్, జావిద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో.....
హిమాయత్‌నగర్ : బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం నారాయణగూడలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ, సహాయ కార్యదర్శి ఎం.వేణు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు సత్యప్రసాద్, నగర నాయకులు కృష్ణనాయక్, చైతన్య, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ మర్చిపోవడం దారుణమని వారు విమర్శించారు.