సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ తొలి ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజల ఆశలను ఆవిరి చేసిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌తో జిల్లా ప్రజలకు ఒరిగేదేమీ లేదని అంటున్నాయి. ప్రాధాన్యత క్రమంలో జిల్లాకు నిధులు కేటాయిస్తారని ఆశించినా చివరకు నిరాశే మిగిలింది. రాష్ట్రస్థాయిలో వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్లో జిల్లాకు రావాల్సిన వాటా మినహా ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులూ జరగలేదు.
సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వేలకోట్లు కేటాయించిన ప్రభుత్వం జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులకు నామమాత్రంగానే నిధులు మంజూరు చేసింది. బడ్జెట్‌లో రాజీవ్‌సాగర్ (దుమ్ముగూడెం), ఇందిరాసాగర్, పెదవాగు, వైరా రిజర్వాయర్, గుండ్లవాగు, తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ నిధులు కేటాయించిన ప్రభుత్వం అవి ఏ ప్రాతిపదికన కేటాయించిందో మాత్రం స్పష్టతలేదు. రాజీవ్‌సాగర్‌కు రూ.11 కోట్లు, ఇందిరాసాగర్‌కు రూ.5 కోట్లు కేటాయించారు.
కిన్నెరసానికి రూ.10 లక్షలు, తాలిపేరుకు రూ.10 లక్షలు, వైరాకు రూ.10 లక్షలు, గుండ్లవాగుకు రూ.10 లక్షలు, పెదవాగుకు రూ.20 లక్షలు కేటాయించినట్లు బడ్జెట్‌లో చూపించారు.
రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అటవీశాఖ క్లియరెన్స్ రావాల్సి ఉన్నందున ఈ సంవత్సరం పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో నిర్మాణ పనులు కొనసాగడానికి అవసరమైన నిధులను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసిందని అధికారపార్టీ నేతలు అంటున్నారు.
ఆంధ్రా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉన్నందున ఇందిరాసాగర్ సైతం ఉన్నపళంగా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతోనే రూ.5 కోట్లు కేటాయించారని తెలుస్తోంది. జిల్లాలో రైతులు ఆశలు పెట్టుకున్న అనేక ప్రాజెక్టులు నిధులు కేటాయించలేదు. ఇలా విస్మరించిన వాటిలో భద్రాచలంలోని మోడుకుంట వాగు, వద్దిపేట వాగు, పినపాక నియోజకవర్గంలోని పులుసుబొంత ప్రాజెక్టులు ఉన్నాయి. ఇతర కేటాయింపుల్లోనూ జిల్లాకు తగు ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏరియా ఆస్పత్రులకు కోటి రూపాయలు మంజూరు చేస్తామని బడ్జెట్‌లో చెప్పిన ప్రభుత్వం జిల్లా వైద్యశాలను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయింది. ప్రభుత్వం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు, పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుదలకు ఎంత కేటాయిస్తుందో మాత్రం పేర్కొనలేదు.
జిల్లాలో అనేక తాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా వీటికి న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రజానీకానికి నిరాశే మిగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి రూ.2వేల కోట్లే కేటాయించడం..జిల్లాకు గుక్కెడు నీళ్లు రావడానికి ఏమేరకు నిధులు కేటాయిస్తారో తెలియని పరిస్థితి ఉంది.
ప్రభుత్వం అంకెలగారడీ, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ వంటి పార్టీలు విమర్శలు చేశాయి. టీఆర్‌ఎస్ మాత్రం ఇది జనరంజక బడ్జెట్‌గా అభివర్ణించింది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులకు మౌలిక సదుపాయాల కల్పనకు, గిరిజన సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించకపోవడంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తీవ్ర ఆక్షేపణ చేశారు.
ప్రభుత్వం జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో ఈ బడ్జెట్‌తో చెప్పకనే చెప్పిందని విమర్శలు చేశారు. బడ్జెట్ కేటాయింపులు నిరాశ జనకంగా ఉన్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు అన్నారు. ఈ స్థాయిలో కేటాయింపులు జరిగితే జిల్లా ప్రజల కలలు నెరవేరడానికి దశాబ్దాలు సరిపోవన్నారు.
బడ్జెట్‌లో వైద్యరంగాన్ని పూర్తిగా విస్మరించిందని, 104, 108 వంటివాటికి నిధులు కేటాయింపు సరిగా లేదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఫాస్ట్ పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందన్నారు.
బడ్జెట్‌లో జిల్లాకు సరైన ప్రాధాన్యమే లభించిందని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ అన్నారు. జిల్లా సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఆ మేరకే అన్ని రంగాలకు నిధులు కేటాయించిందన్నారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చితీరుతుందన్నారు. జిల్లాలో నిధులు ఎక్కడ అవసరమో అక్కడ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి
Published Thu, Nov 6 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement