తెలంగాణ ఇంక్రిమెంట్‌కు రూ. 200 కోట్లు
- బడ్జెట్ తయారీకి కసరత్తు
- ఈ నెలాఖరులోపు వివరాలు పంపండి
- అన్నిశాఖలకు ఆర్థికశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలవేళ కాకుండా ఉద్యమం సందర్భంగా పలుసార్లు తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన ఇంక్రిమెంట్ హామీని నిలబట్టుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర సాధన సందర్భంగా తెలంగాణ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరుచేస్తామని కేసీఆర్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆర్థికశాఖ ఇప్పటికే ఈ ఇంక్రిమెంట్‌పై కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి రూ.200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తుదినిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీని వల్ల తెలంగాణకు చెందిన నాలుగు లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
తొలిబడ్జెట్ తయారీ...
తెలంగాణ తొలిబడ్జెట్ తయారీకి ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణకు చెందిన అన్ని శాఖలు తమ బడ్జెట్‌కు అవసరమైన వివరాలను ఈ నెలాఖరుకల్లా పంపించాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రధానంగా ఎన్నికలప్రణాళికలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా వ్యవహరించాలని, మేనిఫెస్టోలోని అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతిపాదనలు పంపాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. తెలంగాణ తొలిబడ్జెట్ అయినందున లోపాలకు తావులేకుండా జాగ్రత్తగా రూపొందించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది.