నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ తొలి బడ్జెట్... రాజీలోని పోరాటంతో రాష్ట్రం సాధించిన టీఆర్‌ఎస్ తొలిసారి ప్రవేశపెట్టబోతోన్న బడ్జెట్.. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కలల బడ్జెట్.. అందుకే ఇపుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకర్‌లు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో మెతుకుసీమపై ఎలాంటి వరాలు కురుస్తాయోనని జిల్లా వాసులంతా ఎదురుచూస్తున్నారు. మన ఆశలకు తగ్గట్టుగానే తొలి బడ్జెట్‌లో మనకే తొలి ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాకతీయల కాలంలో ఆతర్వాత నిజాం హయాంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు కాలంతో పాటే అంతర్థానమయ్యాయి. మాయమైన చెరువులకు మళ్లీ జీవం పోసి నాటి జలకళను తెప్పించి, బీడు భూములను తడిపే దిశగా కేసీఆర్ సర్కారు తొలి అడుగులు వేస్తోంది. ఉన్న ఒక్క మంజీరా జీవనదిని వలస వాదులు చెరబట్టి హైదరాబాద్‌కు తరలించుకుపోతే, ఉన్న చిన్న నీటి వనరులతోనే ఆయకట్టుకు నీరు పారించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కసరత్తు చేశారు.
నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇంతకాలం కాంట్రాక్టర్ల జేబులు నింపిన చెరువుల మరత్తుల పునరుద్ధరణ ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుల శాఖ మంత్రి హరీష్‌రావు ఈ జిల్లాకు చెందిన బిడ్డలే కావటంతో బడ్జెట్‌లో జిల్లాకే పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.
రోడ్ల విస్తరణ కోసం రూ.1000 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు రూ. 500 కోట్లు వాటర్ గ్రిడ్‌లకు రూ. 500 కోట్లు, గ్రీన్‌హౌస్‌కు రూ.200 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు సమాచారం. ప్రాణహిత- చేవెళ్ల, సింగూరు, ఘణపురం ప్రాజెక్టులకు కూడా బడ్జెట్‌లో నిధుల వరద పారినట్టు తెలుస్తోంది. ఇవికాకుండ ‘మన ఊరు- మన ప్రణాళిక’ పథకం కింద సిద్ధం చేసిన ప్రతిపాదనల కోసం రూ.1,500 కోట్లు ఇచ్చి, తొలి తెలంగాణ బడ్జెట్ మెతుకు సీమ రైతాంగం ఆశలను చిగురించే విధంగా రూపొందించినట్లు తెలుస్తోంది.
సామాజిక ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ
జిల్లాలో ఇటీవలే నీటివనరులకు సంబంధించి నీటిపారుదలశాఖ సమగ్ర సర్వే నిర్వహించింది. జిల్లాలో మొత్తం 9,970 నీటి వనరులు ఉన్నట్లు తేలింది. వీటిలో 578 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 109 ఆనకట్టలు, 5,509 పంచాయతీరాజ్ కుంటలు, 274 ప్రైవేటు కుంటలు, 1,927 చెక్‌డ్యాంలు, 1,336 పర్కులేషన్ ట్యాంకులు, 237 ఇతర నీటి వనరులు ఉన్నాయి.
వీటి మీదనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. జిల్లాలో గుర్తించిన చెరువుల, కుంటలను ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో దశల వారీగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని 20 శాతం చెరువుల, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులను చేపట్టనున్నారు. నీటివనరుల సమగ్ర సర్వే ఆధారంగా అధికారులు జిల్లాలో మొదటి దశలో చెరువులు, కుంటల మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
జిల్లాలో మొదటి దశ కింద 1,588 చెరువులు, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 175, దుబ్బాకలో 275, గజ్వేల్‌లో 239, అందోలులో 124, సంగారెడ్డిలో 107, పటాన్‌చెరులో 92, జహీరాబాద్‌లో 25 చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నారు. నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 551 చెరువుల మరమ్మతు పనులు చేపట్టే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం.
వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి దశల వారీగా జిల్లాలోని ప్రతి ఇంటికీ తాగునీటి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. మొత్తం 446 కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీళ్లు అందించే యోచనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంది. దీనికోసం ప్రభుత్వం రూ.5,600 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. తాగునీటికోసం సింగూరు ప్రాజెక్టు నుంచి 8 టీఎంసీల నీళ్లను వాడుకునేందుకు రూపకల్పన చేసినట్లు సమాచారం.
మండలానికి రెండు లేన్ల రోడ్లు
బడ్జెట్‌లో జిల్లాలోని రోడ్లకు అధిక ప్రాముఖ్యత కల్పించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించినట్లుగా మెదక్ జిల్లాలో రోడ్ల విస్తరణకు రూ.1,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు సమాచారం. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ కనీసం రెండు లేన్ల రోడ్లు నిర్మించే విధంగాబడ్జెట్‌లో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
మెదక్ నుంచి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు, ఇస్‌మల్కాపూర్ నుంచి హైదరాబాద్ వరకు నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు సమాచారం. దీంతోపాటు గజ్వేల్, సంగారెడ్డి పట్టణాల్లో రింగ్ రోడ్డు నిర్మాణానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.
విత్తనోత్పత్తి హబ్‌గా
జిల్లాలో గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లోరూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. గజ్వేల్ పట్టణంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగులో ఫారెస్ట్రీ కాలేజ్ , హార్టీకల్చర్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ తదితర సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూరగాయల సాగు చేయడానికి వీలుగా నిధుల కేటాయింపు జరిగినట్లు తెలిసింది. జిల్లాలో నాణ్యమైన విత్తన గింజలను పండించే విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమచారం.