మార్పే మౌలిక లక్ష్యం: సంఘటితమే కర్తవ్యం
కె.విజయగౌరి
ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్న రోజులు. మరికొన్ని దేశాలలో స్వేచ్ఛ కోసం, జాతి విము క్తికై పోరాటాలు జరుగుతున్న రోజులు. సమాజ పరిణామక్రమంలో మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యలపై ఉద్యమాలు ప్రారంభమవుతున్న రోజులు. మహిళలు ప్రపంచీకరణ నేపథ్యంలో సంఘటితం కావాలని ఉద్బోధించే రోజు మార్చి 8 రానే వచ్చింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూ ర్తినిచ్చిన ఘటన 1857, మార్చి 8న న్యూయార్క్‌లో జరిగింది. ఇదొక తీవ్ర మైన పోరాటం. పనిచేసే ప్రదేశాలలో సౌకర్యాల కోసం, వేతనాల పెంపు కోసం, పనిగంటలు తగ్గించుకోవడానికి, ఓటు హక్కు కోసం వేలాది మంది మహిళలు సమ్మె చేశారు. బట్టల మిల్లులలో పనిచేసే కార్మికులు ‘‘ఆకలి కడు పులతో పనిచేయడంకన్నా పోరాడుతూ చావటం మేలు’’ అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మహిళలను కదిలించింది. ఆ సందర్భంగా యాజమా న్యం కాల్పులు జరిపింది. 146 మంది యువతులు చనిపోయారు. అయినా పట్టుదలతో పోరాటం కొనసాగించారు. యజమానులు తలొగ్గక తప్ప లేదు, బేరసారాలకు వచ్చారు. పురుషులకి ఏ మాత్రం తీసిపోమని నిరూ పించారు. తమను తాము బలమైన ఉద్యమం ద్వారానే రక్షించుకోగలమనే విశ్వాసం పొందగలిగిన ఉద్యమం సంఘటితమైంది. ఈ ఉద్యమం అనేక పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం, పని హక్కు కోసం, వృత్తి శిక్షణ కోసం డిమాండ్ చేశారు. మహిళా విముక్తి ఉద్యమాల చిహ్నాలకు గుర్తుగా మార్చి 8ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ప్రతియేటా ఒక అంశాన్ని ప్రకటిస్తూ పురోగతి సాధించాలని సారాంశం. ఈ ఏడాది ‘తక్షణమే విధిగా సాధించుకోవడమే’ మహిళల లక్ష్యంగా ప్రకటించింది.
తక్షణమే సాధించుకోవడంలో అనేక అంశాలు ఉంటాయి. సమాజం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుందనేది పరిణామక్రమం చెప్పే సత్యం. ఈ పరిణామక్రమంలో మహిళల స్థానం ఎక్కడ? ప్రత్యేకంగా ఇప్ప టికీ మహిళల సమస్యల గురించి చర్చించవలసిన అగత్యం ఎందుకు వస్తుం ది? మనుధర్మ కాలం నుంచి ఉండే భావజాలం ఎందుకు కొనసాగుతోంది? మహిళలపై ఎందుకు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు? వంటి అంశాలు నేటికీ చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఇది మన దేశ పాలకుల నిర్లక్ష్యవైఖ రికి నిదర్శనమని చెప్పక తప్పదు. అయినా తన శక్తిసామర్థ్యాలను నిరూపిం చుకుంటున్నా ప్రగతి నిరోధకశక్తులు ఆటంకంగానే ఉన్నాయి. కాని, స్త్రీల దృక్పథం సార్వత్రికమైంది. తాము తక్కువ వారమనే సంప్రదాయ భావ జాలాన్ని ఛేదించి ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అనే గురజాడ విశాల దృక్పథానికి చేరువ కావాలంటే మహిళలను పట్టి పీడిస్తున్న సమస్య లపై పోరాటాలు చేయాలి. అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంలో ప్రతిపౌరునికి నిర్దేశించిన రాజ్యాంగపరమైన హక్కులను సాధించి అమలు చేసుకోవాలి. ఇదే ఐక్యరాజ్య సమితి పిలుపు.
భారతదేశంలో పదేళ్లకోసారి జరిగే సెన్సెక్స్ లెక్కల ప్రకారం గత వందే ళ్లుగా మహిళల జనాభా తగ్గుముఖం పడుతూనేవస్తోంది. 2040 నాటికి దేశంలో నవ వధువుల కొరత ఏర్పడుతుందని ఐరాస హెచ్చరించింది. పార్లమెంటులో మహిళా ఎంపీల శాతం 11 శాతానికి మించి లేకపోవడం మహిళా సాధికారత భావననే ప్రశ్నార్థకం చేస్తోంది. ఉద్యోగాల కోత విధిం చాలంటే నేటికీ మహిళలే తొలి లక్ష్యం అవుతున్నారు. 2 దశాబ్దాలుగా ప్రపం చవ్యాప్తంగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు స్వావలంబనకు బదులుగా కొన్నివర్గాల స్త్రీలపై మరింత భారం మోపాయి. దేశంలోని బడులలో నేటికీ 1 నుంచి 5వ తరగతి వరకు 29 శాతం మంది బాలికలే డ్రాప్ అవుట్ అవు తున్నారు. విద్యారంగంలో సంస్కరణలు అమ్మాయిలను చదువుకు మరింత దూరం పెడుతున్నాయి. మీ కోసమే ఇన్ని పథకాలు తెస్తున్నామని ప్రభుత్వా లు చేస్తున్న ప్రకటనలు ప్రచారార్భాటంగానే మిగులుతున్నాయి.
విశాల భారతదేశంలో కోట్లాది మహిళలు మరుగుదొడ్లు లేక బహిర్భూ మికి ఆరుబయటకు వెళ్తే ప్రతి వంద మందిలో ముగ్గురు అత్యాచారాలకు గురవుతున్నారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు చెందిన సుప్రీంకోర్టు తీర్పు అమలుకావడం లేదు. నిర్భయ చట్టం తెచ్చినా నానాటికీ అత్యాచా రాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. పని హక్కును గ్యారంటీ చేయ డం లేదు. ఆడపిల్లలు యాచకులుగా తిరుగుతున్నారు. కట్నం కష్టాలు తగ్గ డం లేదు. వలసలు తగ్గడం లేదు. అక్షరాస్యత ఆశించిన విధంగా లేదు. చట్ట సభలలో రిజర్వేషన్లు అమలు కావడం లేదు. కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అమలుకావడం లేదు. 80 శాతం మహిళలు పనిచేస్తున్న అసంఘటిత రంగాలలో రక్షణ, భద్రత కరువు. అనేక దశాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితంగా కొంత అభివృద్ధిని సాధించగలిగినా, మహిళలను ప్రథమ శ్రేణి పౌరురాలుగా గౌరవం పొందాలంటే పై ఆటంకాలన్నింటిపై ప్రత్యేకమైన కృషి చేసి విధిగా సాధించుకోవాలి. దీని కోసం అన్ని వర్గాల మహిళలు సంఘటితం కావడంవల్లనే సాధ్యపడుతుంది. ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టగలిగాయి. అటువంటి వ్యవస్థ గురించి, మహిళల వీరోచిత పోరా టాల గురించి చర్చించుకునే ప్రాధాన్యత కలిగిన రోజు. క్లారాజట్కిన్, రోజా లగ్టెంబర్గ్, అలెగ్జాండ్రాకాల్లంతాయ్, కృపస్కయా వంటి అంతర్జాతీయ శ్రామిక మహిళా నాయకులను మళ్లీ తలచుకొని సామాజిక మార్పు అనే మౌలిక లక్ష్యం వైపుగా అత్యధిక సంఖ్యాక మహిళలను సంఘటితం చేయ డమే కర్తవ్యంగా ఈ ఏడాది మహిళా దినోత్సవం జరగాలని ఆకాంక్షిస్తూ...
(నేడు 105వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
(వ్యాసకర్త ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు)