ఊపిరి బిగబట్టిన మేఘం
ఊపిరి బిగబట్టిన మేఘం
సాయంత్రాల్ని
నల్లగా కౌగిలించుకుంటుంది
ఆకాశం
బిగ్గరగా అరుస్తూ
ఒకానొక పొడి దృశ్యాన్ని
పొక్కిలి చేస్తుంది
తడి అద్దాల్లోంచి
వెలుతురు దీపాలు
అబ్‌స్ట్రాక్ట్ చిత్రాలను తలపిస్తాయి
కొంచెంగా తెరిచిన
తలుపు సందులోంచి
వాన పంపిన రహస్య సందేశాన్ని
మోసుకొస్తుంది గాలి
దేహమంతా
వాన కనులను చిత్రించుకుంటూ
జ్ఞాపకం బాల్యం రొమ్మును
ముద్దాడుతుంది
వానంతా
రాత్రి కలలో తడిచాక
మెలుకువ మీద
స్వప్నాన్ని ఆరేసుకోవడం
చంద్రున్ని తాగినంత మత్తుగా ఉంటుంది
- శ్రీనివాస్ సాహి
8106689529