సభాపతుల కోసం ఓ సవరణ | Uttarakhand issue is a lesson to assembly speakers, Devulapalli Amar writes | Sakshi
Sakshi News home page

సభాపతుల కోసం ఓ సవరణ

Published Wed, May 18 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

సభాపతుల కోసం ఓ సవరణ

సభాపతుల కోసం ఓ సవరణ

డేట్‌లైన్ హైదరాబాద్

రాజ్యాంగాన్ని మనం బోలెడుసార్లు సవరించుకున్నాం. ఇంకో సవరణ, అది కూడా రాజకీయాలలో నైతిక విలువల రక్షణ కోసం చేసుకోవలసిన సమయం వచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద స్పీకర్‌లకు కాకుండా గవర్నర్‌లకు నిర్ణయాధికారాలు ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన తాజా పరిణామాలనే ఉదాహరణగా తీసుకుని, పార్లమెంట్ చర్చించి తగిన సవరణలు తెచ్చి ఫిరా యింపుల మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
 
న్యాయస్థానాల పుణ్యమా అని ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గండం గడిచి బయటపడింది, ఓ వారం రోజుల కిందట. ఇది కాంగ్రెస్ అంతర్గత సమస్య అని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఎంత సమర్ధ్థించుకోవాలని చూసినా, ఉత్తరాఖండ్‌లో ఆ పార్టీకి శృంగభంగం అయిం దన్న విషయం వాస్తవం.

ఉత్తరాఖండ్ శాసనసభ గడువు ముగియడానికి ఇంకా ఏడెనిమిది నెలలే మిగిలి ఉంది. స్వల్ప ఆధిక్యతతో, అవినీతి ఆరోపణల మధ్య నెట్టుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నాలుగేళ్లూ ఇబ్బంది పెట్టనందుకు ఆ రాష్ర్టంలో బీజేపీకి మంచి పేరే వచ్చింది. ఈ ఎనిమిది మాసాలు కూడా అలాగే కొనసాగనిచ్చి ఉంటే 2017 ఆరంభంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఖాయంగా గెలిచి ఉండేది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో చేసిన ప్రయోగమే ఇక్కడా చేయబోయి అనవసరంగా ఆ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చే సువర్ణావకా శాన్ని జార విడుచుకుంది. బీజేపీ పెద్దలు ఈ మాట ఒప్పుకోరు. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే, మాకు సంబంధం లేదంటారు. అదే నిజమయితే రాష్ర్టపతి పాలన తెచ్చే ప్రయత్నమే చేసి ఉండకూడదు. రాష్ర్టపతి ఉత్తర్వులను న్యాయ స్థానాలు తోసిపుచ్చే పరిస్థితి తెచ్చుకుని ఉండాల్సింది కాదు. సరే, కాసేపు బీజేపీ చేస్తున్న వాదనతోనే ముందుకు పోదాం. కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు.

ఆ శాసనసభ స్పీకర్ వెంటనే వారిని అనర్హులుగా ప్రకటించి, శాసన సభలో బలపరీక్ష సందర్భంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేయ కుండా నిలువరించారు. దాంతో హరీశ్ రావత్ ప్రభుత్వం బలపరీక్షలో విజ యం సాధించగలిగింది. ఉత్తరాఖండ్ శాసనసభ స్పీకర్‌ను ఇందుకు అభినం దించాల్సిందే. కాంగ్రెస్ టికెట్ మీద ఎన్నికయి ప్రభుత్వాన్ని కూల్చేందుకు పార్టీ ఫిరాయించాలని భావించిన శాసనసభ్యులకు ఆయన తగిన శాస్తి చేశారు. ఆ తొమ్మండుగురు శాసనసభ్యులు హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తట్టినా లాభం లేకపోయింది. స్పీకర్  నిర్ణయం సరయినదే అన్నాయి కోర్టులు కూడా. మరి అదే స్పీకర్ బలపరీక్ష రోజునే బీజేపీ నుంచి ఫిరాయించి, రావత్ పంచన చేరిన ఎమ్మెల్యేల మీద ఏ చర్యా ఎందుకు తీసుకోలేదు?

చర్చనీయాంశం అవుతున్న స్పీకర్లు
ఇలాంటి సందర్భాలలోనే  శాసనసభల గౌరవ స్పీకర్ల పాత్ర చర్చనీయాంశమ వుతున్నది. వివాదాస్పదం కూడా అవుతున్నది. ఇంతసేపూ ఉత్తరాఖండ్ వ్యవ హారం గురించి మాట్లాడుకున్నది ఎందుకంటే అక్కడి మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ శాసనసభ్యుల ఫిరాయింపుల వ్యవహారం బరితెగించి సాగుతున్నది. రెండు రాష్ట్రాల శాసనసభల స్పీకర్లూ ఏళ్లు గడు స్తున్నా ఈ ఫిరాయింపుల నాటకాన్ని కొనసాగిస్తున్నారు తప్ప, ఏ చర్యా లేదు. తెలంగాణ  రాష్ర్టంలో వేరే పార్టీల నుంచి గెలిచిన మొత్తం 23 మంది శాసనసభ్యులు అధికార పక్షం పంచన చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క ప్రతిపక్షం నుంచి 16 మంది శాసనసభ్యులు అధికార తెలుగుదేశం గూటికి వలసపోయారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు సంవత్సరాలలో పార్టీ ఫిరాయించిన ఈ 39 మంది శాసనసభ్యులు ఒకటే బృందగానం చేశారు. అది తమ నియోజకవర్గాల అభివృద్ధి. అంటే ప్రభుత్వం అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుల నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేస్తుందా? ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వదా? రాష్ర్ట ప్రజలందరూ ప్రభుత్వానికి సమానం కాదా? ప్రతి పక్షాలు ప్రాతినిధ్యం వహిస్త్తున్న నియోజకవర్గాల ప్రజలు పన్నులు కట్టడం లేదా? ఎంత వింతగా ఉంది ఇది?

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాలతో సఖ్యంగా ఉండో, పోరాడో నియోజకవర్గాలకు కావలసినన్ని నిధులు తెచ్చుకుని అద్భుతమయిన అభి వృద్ధి సాధించి చూపించిన ప్రజా ప్రతినిధులు మనకు చరిత్రలో చాలా మంది కనిపిస్తారు. నియోజకవర్గాల అభివృద్ధి అనేది ఒక సాకు. వీరంతా తమ సొంత అభివృద్ధి కోసమే పోతున్నారు. కోట్ల రూపాయల కాంట్రాక్టులు, భూములు, రక రకాల స్వప్రయోజనాలను ఆశించి పోతున్న వాళ్లే వీళ్లంతా. ఉత్తరాఖండ్ స్పీకర్‌లాగా రెండు తెలుగు రాష్ట్రాల స్పీకర్లు ఎందుకు సత్వర నిర్ణయం తీసు కోలేదు? ఎందుకు ఏళ్లు గడిపేస్తున్నారు? ఉత్తరాఖండ్ స్పీకర్ నిర్ణయాన్ని కూడా చర్చించవలసిందే. ఎందుకంటే ఉత్తరాఖండ్‌లో అధికార పక్షం నుంచి తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కాబట్టి స్పీకర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే రావత్ సర్కారు కనుక మైనారిటీలో పడి ప్రతిపక్ష బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కనుక అధికారపక్షాన్ని ఆదుకోవడానికి ఫిరాయించినా కూడా ఆ రాష్ర్ట స్పీకర్ ఇదే నిర్ణయం తీసుకునే వారా అన్నది అనుమానాస్పదమే. తొమ్మిదిమంది కాంగ్రెస్ సభ్యుల మీద అనర్హత వేటు వేసిన అదే స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలు రావత్ వైపు వస్తే ఎందుకు ఊరు కున్నట్టు? ఎందుకంటే స్పీకర్ అధికార పక్షానికి సంబంధించిన వారే కావడం. రెండు తెలుగు రాష్ట్రాల లో జరుగుతున్నది కూడా అదే.
 

విపక్షం కాబట్టే!
ప్రతిపక్షాలకు చెందిన శాసనసభ్యులు అధికారపక్షానికి వలసపోతున్నారు కాబట్టి స్పీకర్లు ఏ చర్యా తీసుకోవడం లేదన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. రాష్ర్టం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికలలో గెలిచినప్పుడు టీఆర్‌ఎస్ సంఖ్యాబలం అరవై రెండు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యకు ఒక్కటే స్థానం ఎక్కువ. ఆ పరిస్థితులలో ప్రతిపక్షాలు కొద్దిమంది శాసనసభ్యులను తమ వైపు తిప్పుకున్నా ప్రభుత్వం నిలవడం కష్టం అయ్యేది. అప్పుడు కూడా స్పీకర్ ఇప్పటివలెనే వ్యవహరించేవారా? అవతల ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే. అరవై ఏడుగురు సభ్యులతో ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ 21 మంది తెలుగుదేశం సభ్యులను తన వైపు తిప్పుకుని ఉంటే  ఆ ప్రభుత్వం పరిస్థితి ఏమిటి? అప్పుడు కూడా అక్కడి స్పీకర్ ఇప్పటివలెనే వ్యవహరించేవారా? ఇదంతా స్పీకర్లు వివాదా స్పదులవుతున్నారు, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది అని చెప్పడానికే. శాసన వ్యవస్థకు ఉండే పవిత్రతను ఎవరూ ప్రశ్నించకూడదు, స్పీకర్ నిర్ణయాలను కూడా ప్రశ్నించకూడదు నిజమే కానీ, ఇటువంటి సంద ర్భాలలో స్పీకర్ల వ్యవస్థ చర్చలోకి రాక తప్పదు.

ఎన్టీ రామారావు అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడయిన రెండుసార్లు స్పీకర్‌ల వ్యవస్థ విమర్శకు గురయింది, గవర్నర్‌లు కూడా నిందలు మోయ వలసి వచ్చింది. మొదటిసారి కేంద్ర ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని గవర్నర్‌ను మార్చి సభలో బలపరీక్షకు అవకాశం కల్పించి నందుకు ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. రెండవసారి ఆ అవకాశమే రాకుండా చేసి ఆయనను అధికారానికి దూరం చేయగలిగారు. రాష్ర్టపతి ఉత్తర్వులనే, తాజాగా ఉత్తరాఖండ్ వ్యవహారంలో జరిగింది, న్యాయస్థానాలు పక్కన పెట్టినప్పుడు స్పీకర్‌ల నిర్ణయాలనో లేదా నిష్క్రియాపరత్వాన్నో ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఫిరా యింపుల ప్రహసనం మీద అక్కడి ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. న్యాయస్థానాలు ఏం చెబుతాయో చూడాలి. ఒకే రకమయిన రెండు సమస్యలకు రెండు భిన్నమయిన పరిష్కారాలు ఉంటాయా?

మరో సవరణ అవసరం కాదా!
భారత రాజ్యాంగాన్ని మనం బోలెడుసార్లు సవరించుకున్నాం. ఇంకో సవ రణ, అది కూడా రాజకీయాలలో నైతిక విలువల రక్షణ కోసం చేసు కోవలసిన సమయం వచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద స్పీకర్‌లకు కాకుండా గవర్నర్‌లకు నిర్ణయాధికారాలు ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగు తున్నది. కానీ కేంద్రం నియమించే గవర్నర్‌లు ఎంత స్వతం త్రంగా నిర్ణయాలు తీసుకోగలరు? కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన తాజా ఫిరాయింపులనే ఉదాహరణగా తీసుకుని, పార్లమెంట్ చర్చించి తగిన సవ రణలు తెచ్చి పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

కొసమెరుపు : ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రయత్నం బెడిసికొట్టాక కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల మీద తెగ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు భాగస్వాములుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, మీ ఆప్తమిత్రుడు, ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే ఈ నీతిమాలిన వ్యవహారం నడుస్తున్నది, దాన్నేం చేస్తారు అని వెంకయ్య నాయుడుని ఒక్క మీడియా మిత్రుడయినా అడిగిన పాపానపోలేదు.
 
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement