ఒక పద్మ తల్లి | Varavararao writes on padma's mother | Sakshi
Sakshi News home page

ఒక పద్మ తల్లి

Published Thu, May 4 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

ఒక పద్మ తల్లి

ఒక పద్మ తల్లి

సందర్భం
తన చైతన్యంతో పద్మ ఒక జీవితాన్ని ఎంచుకున్నది. న్యాయమో.. అన్యాయమో ఈ దోపిడీ వ్యవస్థ వేసే సవాళ్లను, శిక్షలను ఆమె స్వీకరించాలి. స్వీకరిస్తుంది. మరి ఆ తల్లి మరణానికి, ఆ అక్క జీవితానికి ఈ సమాజం బాధ్యత పడవద్దా?!

పద్మ తల్లి చనిపోయింది. ఏప్రిల్‌ 29 ఉదయం బాత్‌రూంలోకి వెళ్లి పడిపోయింది. మెదడులో నరాలు చిట్లి చనిపోయినట్లు ఆ తరువాత వైద్యుడు చెప్పాడు. అప్పటికామె వారం రోజులుగా నలతగా ఉన్నదని, ఇంక తన పని అయిపోయిందని అంటూ ఉండేదని ఆమె కూతుళ్లు చెప్పారు. నలభై ఏళ్లు ఏడుగురు సంతానానికి సేవలు చేసి ఎవరితో చేయించుకోకుండా వెళ్లిపోయింది. యాభై ఏళ్ల నుంచి మానసికంగా ఎదగని కూతురును దగ్గర పెట్టుకొని ఆమె కోసమే ఒక గది, తనదైన ఒక సంసారం ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌లో ఎక్కడో మారుమూలలో ఉంటున్నది. ఆ కూతురును చంటిపాపలా చూసుకుంటున్నది. పద్మ కోసం ఆమె పదేళ్ల నిరీక్షణ ముగిసింది. బహుశా శనివారం ఏప్రిల్‌ 29 నుంచే ఆమె మట్టిపొరల్లో శాశ్వతంగా నిద్రపోతుంటుంది. ఈ పదేళ్లూ ఎప్పుడూ కంటి మీద కునుకు లేకుండా ఆ కూతురు కోసం నిరీక్షణ.

హైదరాబాద్‌లో 1990ల ఆరంభంలో ఆమె మూడో కూతురు పద్మకు విప్లవ రాజకీయాలు అబ్బాయి. చైతన్య మహిళా సంఘంలో తొలి నాయకత్వంలో ఆమె ఉన్నారు. వాళ్లు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతి పోరాటంలో ఆమె ఉన్నది. ఎక్కువ కాలం బహిరంగ ప్రజా ఉద్యమాల్లోనే పనిచేసింది. హైదరాబాద్‌లో బస్తీల్లో, విద్యార్థుల్లో, హాస్టల్స్‌లో ఆమె మహిళల్లో పనిచేసిన మేర తలలో నాలుకగా పనిచేసింది తన మెత్తటి నవ్వుతో మృదువైన మాట లతో ఎందరి స్నేహాలనో పొందింది.

1994 డిసెంబర్‌ నుంచి 1995 మార్చి వరకు జైలులో ఉన్న నక్సలైటు ఖైదీల, జీవిత ఖైదీల విడుదల కోసం చేసిన పోరాటానికి బయట వెల్లువెత్తిన సంఘీభావంలో చైతన్య మహిళా కెరటం కూడా ఉన్నది. 1999 సెప్టెంబర్‌లో ఈ జైలు పోరాటానికి నాయకత్వం వహించిన రాజకీయ ఖైదీ మోడెం బాలకృష్ణ విడుదలయ్యాడు. బహుశా 2000లో పద్మ బాలకృష్ణ సాహచర్యాన్ని ఎంచుకోవడమే ఆమె చేసిన పెద్ద నేరం అయింది. ఆ సహచర్యంలో ఆమె కొద్ది రోజు లైనా గడిపిందో తెలియదు. అప్పటికామె విశాఖపట్నంలో మహిళా ఉద్యమంలో పనిచేస్తున్నది.

పదేళ్ల క్రితం భిలాయిలో ఒక సహచరితో పాటు ఆమె ఒక ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు ఏపీ ఎస్‌ఐబీ పోలీ సులు ఆమెను అరెస్టు చేశారు. అప్పటికే అనుమానంతో ఏపీహక్కుల సంఘాల నేతలకు ఫోన్లు చేసింది కాబట్టి ఆమె తన ప్రాణాలు కాపాడుకుంది. పోలీసులకు ఆ కక్ష ఉన్నది. రెండు రోజుల క్రితమే ఏప్రిల్‌ 27న పద్మ తల్లి ఫోన్‌ చేసింది. ‘‘పద్మను ఈరోజు కోర్టుకు తీసుకువచ్చారట. ఆమె లాయర్‌ ఫోన్‌ చేసి పద్మ విడుదలవుతుంది, ఎవరినైనా పంపించి తీసుకువెళ్లండి’’ అని. తన చిన్న కూతురు, మనమడు వెళ్తారని, ఎక్కడైనా తల తాకట్టు పెట్టయినా కారు ఏర్పాటు చేస్తానని, వెంట ఎవరైనా లాయరు వెళ్తారా అని అడిగింది. మాకు ఆశ్చర్యం అయింది.

మాకు ఎవరికీ తెలియని సమాచారం. ఇంకా రెండు కేసులున్నాయి. ఒక కేసులో వాదనలు ముగిసి మే 15న తీర్పు ఉంది. మరో కేసు ట్రయల్‌కు ఎంత సమయం పడుతుందో తెలియదు. కాకపోతే కొన్నాళ్లుగా జడ్జి.. బంధువులు వచ్చి బెయిల్‌ పెట్టి, జమానత్‌ పెట్టి బంధువులే తీసుకుపోతే బెయిల్‌ ఇస్తానని అంటున్నాడట. కొన్నేళ్ల క్రితం తల్లి తప్ప బంధువులు ఎవరూ ఆమెను చూడ్డానికి రాలేదని అతనికి తెలుసు. ఇటీవల కాలంలోనైతే ఆమె లాయర్లు కూడా ఆమెను చాలా అరుదుగా కలుస్తున్నారు.

ఆ తరువాత మరో హైసెక్యూరిటీ జైలు జగదల్‌పూర్‌కు ఆమెను పంపారు. అక్కడ సుదీర్ఘ కాలపు విచారణ తరువాత కేసులన్నీ కొట్టేసి విడుదలవుతాననుకున్న రోజు. తెలంగాణ నుంచి ఇద్దరు న్యాయవాదులు వెళ్లారు. కోర్టులో కేసు కొట్టేసి, విడుదల ఉత్తర్వులు ఇచ్చి అందుకోసం జైలుకు తిరిగి తీసుకువెళ్లే సమయానికి మరో రెండు కొత్త కేసుల్లో రెండు వారెంట్లు. ఆమె లోపలికి. కోర్టులో నోరు నొచ్చేలా వాదించిన న్యాయవాదులు అసహాయంగా బయటికి. ఈ తంతు నడుస్తూనే ఉంది.

ఇంతకూ ఈ పద్మ పదేళ్లుగా ఎదుర్కొంటున్న కేసులు తన మీదివి కావు. ఆమె రాయ్‌పూర్‌ జైలు నుంచి విడుదలైనప్పుడు మిగిలిన కేసులు చూసినప్పుడు అర్థమైంది ఏమిటంటే ఈమె మొదటి అరెస్టు కన్నా ఎంతో ముందే ఆదిలాబాద్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో అమరురాలైన ఒక పద్మ మీద నమోదయి ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను ఈ పద్మ మీద చూపుతున్నారు. రాస్తున్నంత సేపూ నా భయ సందేహాలు ఏమిటంటే చైతన్య మహిళా సంఘం పది మంది నాయకత్వాన్ని మావోయిస్టులని రుజువు చేయడానికి పోస్టర్లు వేసినట్లుగా ఇప్పుడు వాటికి పద్మ ఫొటో కూడా జోడిస్తారేమోనని!

అంతకన్నా తన కష్టాల నుంచి, నిరీక్షణ నుంచి విముక్తమైన ఆ తల్లి గురించి కాదు, ధైరాయిడ్‌తో, అనారోగ్యంతో జైలే చిరునామాగా మారిన పద్మ గురించీ కాదు. ఆ తల్లి వదిలి వెళ్లిన ఆ మానసికంగా ఎదగని మధ్యవయస్కురాలైన కూతురు శేషజీవితానికి ఆలనా, పాలనా ఏమిటి?. తన చైతన్యంతో పద్మ ఒక జీవితాన్ని ఎంచుకున్నది. న్యాయమో.. అన్యాయమో ఈ దోపిడీ వ్యవస్థ వేసే సవాళ్లను, శిక్షలను ఆమె స్వీకరించాలి. స్వీకరిస్తుంది. ఆమె రాజకీయాలను, ఆమె విశ్వాసాలను ప్రేమించే వాళ్లు, గౌరవించే వాళ్లు ఆమెకు అండగా ఉన్నారు. ఉంటారని ఆశిద్దాం. మరి ఆ తల్లి మరణానికి, ఆ అక్క జీవితానికి ఈ సమాజం బాధ్యత పడవద్దా?!

వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు
వరవరరావు

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement