
సమైక్యతను ముంచుతున్న ‘నీరు’
ఒక విచిత్రమైన కాలంలో మనమంతా జీవి స్తున్నాం. ప్రస్తుతం యావద్దేశం ఒక నాదంతో ఊగిపోతోంది. అదే జాతీయవాదం. మన జాతీయవాదానికి కీలకం ఏమిటంటే– జాతీయ సమైక్యత. అయితే ఆ విషయంలో మాత్రం ఎవరికీ పెద్దగా పట్టింపు ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకటి కాదు, పలు తీవ్ర వివాదాలతో ఈ దేశం సతమతమవుతోంది. వాటి గురించి ఏ జాతీయవాది అయినా తల మునకలై యోచించాలి. అది కూడా అత్యవసరమే అయినప్పటికీ ప్రస్తుతం నేను హిందూ–ముస్లిం ఘర్షణల గురించి, మైనారిటీ మతస్తుల స్థితిగతుల గురించి మాట్లాడడం లేదు.
జాతీయ సమైక్యతకు గొడ్డలిపెట్టుగా పరిణమించిన తీవ్ర స్థాయి ప్రాంతీయ సంఘర్షణల గురించి నేను చెబుతున్నాను. ఒకవైపున తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య మండుతున్న నదీజలాల వివాదాన్ని మనం చూస్తున్నాం. ఇంకోపక్కన పంజాబ్, హరియాణా రాష్ట్రాల నడుమ సాగుతున్న నదీజలాల రగడను కూడా గమనిస్తున్నాం. ఇక విశాల నాగాలాండ్ నినాదం మణిపూర్, నాగాలాండ్ మధ్య చిచ్చు రేగడానికి కారణమైంది. కానీ జాతీయవాదం గురించి గొంతెత్తి మాట్లాడేవారు ఎవరూ కూడా ఈ వివాదాలను పట్టించుకోవడం లేదు. పైగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వాటికి ఆజ్యం పోస్తున్నది.
పంజాబ్, హరియాణాల మధ్య రగులుతున్న నదీజలాల వివా దాన్నే తీసుకోండి! సుదీర్ఘంగా సాగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరిం చేందుకు ఈమధ్య ఒక అవకాశం అందివచ్చింది. రావీ–బియాస్ నదుల నీళ్ల పంపకానికీ, హరియాణా వాటాను పంపిణీ చేయడానికి వీలుగా సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణానికీ అనుకూలంగా వచ్చిన సదవకాశమది. సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పంజాబ్ ఆశిస్తున్నదని కొత్త ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మే 12వ తేదీన ప్రకటించారు. ఉత్తర ప్రాంత మండలి సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అంటే దశాబ్దకాలంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి రాజకీయ పార్టీలు ఈ అంశం మీద అనుసరిస్తున్న ధోరణి నుంచి ఒక మెట్టు దిగివచ్చినట్టే.
ఒక చుక్క నీటిని కూడా ఇతరులతో పంచుకునే అవకాశం పంజాబ్‌కు లేదని ఇంతకాలం ఆ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పక్షాలు పేర్కొంటూ వచ్చాయి. హరియాణా, రాజస్తాన్‌లకు నీటిని పంచే వీలు లేదని చెప్పడమే దీని అంతరార్థం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కావచ్చు, ఇంతకాలానికైనా కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి పాత వైఖ రిని సడలించడం ఆహ్వానించదగినది. హరియాణా ప్రభుత్వం ఈ అవ కాశాన్ని అందుకుని, వెంటనే చర్చల ప్రక్రియను ప్రారంభించి ఉండ వలసింది. దురదృష్టవశాత్తు అదేమీ జరగలేదు. ఎందుకంటే, న్యాయ పోరాటంలో పరిస్థితి తనకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ అంశంపై చర్చలు అవసరం లేదని హరియాణా భావించింది. చర్చల అవకాశాన్ని జారవిడుచుకుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్చలకు వచ్చిన సదవకాశాన్ని వదులుకుని మళ్లీ పాత ధోరణిని ఆశ్రయించాయి. ఇక రాజకీయ పార్టీలు కూడా యథాప్రకారం తమ తమ రాష్ట్రాల ప్రభుత్వాల వైఖరినే సమర్థించాయి. పరిస్థితి మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింది.
ఇదంతా దూరదృష్టి లేమితో వచ్చిన సమస్య. అవాంఛనీయం కూడా. సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణం వివాదం మీద వచ్చే నెల సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులో హరియా ణాకు అనుకూలమైన ఫలితం రావచ్చు. అయినా రాష్ట్రంలోని రాజ కీయ పార్టీల మద్దతుతో పంజాబ్ ప్రభుత్వం ఆ కాలువ నిర్మాణానికీ, హరియాణాకు నీటి పంపిణీ అడ్డుకోవడానికీ కనిపించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఇదో ఆరని రాజకీయ వివాదంగా అవతరిం చవచ్చు. నిజానికి నదీజలాల వాటాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నలభై ఏళ్ల క్రితం ఇచ్చిన తొలి అవార్డు ఇదే. ఇప్పుడు హరియాణా ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణంగా తలెత్తే రాజకీయ ఘర్షణ ఇంకొన్నేళ్లు సమస్య సాగేందుకే ఉపయోగపడుతుంది.
పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న ఈ జలవివాదం చాలా చిన్నది, పరిష్కారానికి అనువైనదని నేను చిరకాలంగా వాదిస్తున్నాను. ఈ సందర్భంలో ఒక ప్రతిపాదన చేస్తూ, రెండు రాష్ట్రాల ప్రజలు దానిని పరిగణనలోనికి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ ప్రతిపాదన సారాంశం ఏమిటంటే–హరియాణా ప్రభుత్వం పూర్వం నుంచీ కోరు తున్నట్టు కాకుండా, కొంత తక్కువ వాటాను స్వీకరించడానికి అంగీ కరించాలి. కాలువ నిర్మాణంతో సహా హరియాణా ప్రతిపాదనను అమలు చేయడానికి పంజాబ్ ప్రభుత్వం వెనువెంటనే ఆమోదించాలి.
ఇదొక సాంకేతికపరమైన వివాదం. ప్రస్తుతం రావి–బియాస్ నదీజలాల పంపిణీ వ్యవహారాల మీద పనిచేస్తున్న ట్రిబ్యునల్ ఎందుకు పరిష్కరించలేకపోతున్నదో అంతుపట్టదు. అయితే ఒకటి. ఈ ట్రిబ్యు నల్ పదవులను భర్తీ చేయకపోవడం వల్ల దశాబ్దకాలంగా పనిచేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసి ఈ వివాదం మీద తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశాన్ని కల్పించాలి. ఇక రెండో వివాదం– లభ్యమవుతున్న జలాలలో పంజాబ్ వాటా. 1976లో ఇచ్చిన ఇందిరా గాంధీ అవార్డ్ ప్రకారం పంజాబ్‌కు 22 శాతం జలాలను కేటాయించారు. ఇది అన్యాయమని ఇంతవరకు ఆ రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు వాదిం చాయి.
1981లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందం మేరకు పంజాబ్ వాటాను 22 శాతం నుంచి 25 శాతానికి పెంచారు. మళ్లీ 1987లో ఎరాది ట్రిబ్యునల్ తన తొలి నివేదికలో ఈ వాటాను 28 శాతానికి పెంచింది. దీనిని రాజకీయ పార్టీలు నిరాకరించాయి. మాల్వా ప్రాంత రైతులు మిగులు జలాల మీద ఆధారపడుతున్నారు. ఈ జలాల మీద హరియాణాకు చట్టబద్ధమైన హక్కు ఉంది. కానీ పరిస్థితిని బట్టి ఐదు శాతం వాటాను పంజాబ్‌కు ఇవ్వడానికి హరియాణా అంగీకరిం చాలి. ఇందుకు ప్రతిగా సట్లెజ్–యమున అనుసంధాన కాలువ నిర్మాణా నికి పంజాబ్ అడ్డంకులు లేకుండా చూడాలి. ఈ విషయాన్ని పంజాబ్ సుప్రీంకోర్టులో అంగీకరించాలి. ఆ రెండు రాష్ట్రాలలోను సజావుగా ఆలో చించే ప్రజలు, మేధావులు, రైతు సంఘాలు ఇప్పుడు తమ తమ ప్రభు త్వాలను చర్చలకు ప్రోత్సహించాలి. అది జాతీయ సమైక్యతకు వేసే సరైన అడుగు అవుతుంది.