శ్వేతపత్రమా? అసత్యాల పుట్టా? | White paper? The birth of lies? | Sakshi
Sakshi News home page

శ్వేతపత్రమా? అసత్యాల పుట్టా?

Published Tue, Aug 5 2014 12:04 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

శ్వేతపత్రమా? అసత్యాల పుట్టా? - Sakshi

శ్వేతపత్రమా? అసత్యాల పుట్టా?

విద్యుత్ రంగంపై చంద్రబాబు ఇటీవల వెలువరించిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నేటి విద్యుత్ సంక్షోభానికి బీజాలు పడింది తాను ముఖ్యమంత్రిగా చక్రాన్ని తిప్పిన కాలంలోనే అనే వాస్తవాన్ని కప్పిపుచ్చడం కోసం ఆయన వాస్తవాలను తారుమారు చేసే హస్తలాఘవం ప్రదర్శించారు.

కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యుత్‌రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ రంగంలో గత 20 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలను, ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తూ, విద్యుత్‌రంగ అభివృద్ధికి ప్రభుత్వం ముందున్న ఆలోచనలను.. ప్రణాళికను వివరిస్తూ, ప్రజలను కూడా సూచనలు తెలపమని కోరారు. అయితే ప్రస్తుతం విద్యుత్‌రంగంలో ఉన్న సంక్షోభ పరిస్థితులకు, గతంలో తాననుసరించిన విధానాల్లోనే బీజం పడిందన్న విషయాన్ని బాబు నేర్పుగా దాచి పెట్టారు. పైగా, తన హయాంలోనే మొత్తం అభివృద్ధి జరిగినట్లు చెప్పుకున్నారు. శ్వేతపత్రంలోని  వివరాలను చూస్తే గోబెల్స్ కూడా సిగ్గుతో తలవంచుకోవలసిందే...

బాబు గణాంకాల గారడి

విద్యుత్‌పై శ్వేతపత్రంలో ప్రధానంగా చంద్రబాబు హయాంలో అంటే 1994/1996 నుండి 2004 వరకు విద్యుత్ రంగంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించారు. అలాగే, 2004 నుండి 2014 వరకు ఇతర ప్రభుత్వాల విధానాలతో కుంటుపడిన విద్యుత్ రంగం, రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం, భవిష్యత్ ప్రణాళిక ల వివరాలు కూడా చేర్చారు. బాబు ‘శ్వేతపత్రం’ ప్రకారం 1994- 2004 మధ్య ఏపీ విద్యుత్ రంగంలో స్థాపిత సామర్థ్యం 5,061 మెగావాట్ల వరకు అంటే 90% పెరిగింది. కేంద్ర విద్యుత్ సంస్థ ఎన్‌టీపీసీ సింహాద్రి ప్లాంట్ నుంచి నూరు శాతం విద్యుత్తు రాష్ట్రానికే దక్కింది. విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 68% నుంచి 86%కి పెరిగింది. సరఫరా పంపిణీ నష్టాలు 37 నుండి 23 శాతానికి తగ్గాయి. ఇదంతా తన హయాంలో జరిగిన వృద్ధి అని ఆయన ఘనంగా  చెప్పుకున్నారు.

బాబు అధికారం కోల్పోవడంతోనే హఠాత్తుగా 2004-2014 మధ్య కాలంలో విద్యుత్ రంగం అంధకారం అయిపోయిందని నమ్మించాలని గత ఏడాది వెలువడిన అధికారిక లెక్కలతో సంబంధం లేని కాకిలెక్కలు చూపారు. కాంగ్రెస్ పాలనలో స్థాపిత సామర్థ్యం కేవలం 6,222 మెగావాట్లు మాత్రమే పెరిగిందని, గతంతో పోలిస్తే 56 శాతం మాత్రమే పెరుగుదల సాధ్యమైందని ఆయన చూపారు. విద్యుత్ ప్లాంట్‌ల సామర్థ్యం కూడా 86 శాతం నుండి 78 శాతానికి పడిపోయినట్టు చెప్పారు. ప్లాంట్‌లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. విద్యుత్ లోటు తీవ్రంగా పెరిగింది. డిస్కమ్‌ల రేటింగులు తగ్గిపోయాయి. విద్యుత్ కొనుగోలు ఖర్చు పెరిగింది. పంపిణీ నష్టాలు, ప్రజలపై చార్జీల భారాలు పెరిగాయి అంటూ గగ్గోలు పెట్టారు.

బాబు ‘శ్వేతపత్రం’ తయారు చేసిన అధికారులే సరిగ్గా ఏడాది క్రితం  2004 తర్వాతే విద్యుత్ రంగం ఎక్కువ ప్రగతిని సాధించిందని నివేదించిన విషయం ప్రజలు మరచిపోలేదు. ఆ అధికారులే గత పదేళ్లుగా రాష్ట్ర విద్యుత్ రంగంలో కీలక స్థానాల్లో ఉన్నారు. వారే నేడు బాబు హయాంలో విద్యుత్ రంగంలో వృద్ధి కుంటుపడిన విషయాన్ని మరుగున పరిచే ప్రయత్నం ‘శ్వేత పత్రం’లో చేయడం విశేషం. విద్యుత్ రంగం శ్వేతపత్రం పేర్కొన్న అంశాలను బట్టి గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన ‘అభివృద్ధి’ ప్రధానంగా నాలుగు అంశాల్లో జరిగిందని చెప్పారు. వీటిలో నిజానిజాలను పరిశీలిద్దాం.

 1. స్థాపిత సామర్థ్యం ‘పెరుగుదల’: విద్యుత్ ప్లాంట్‌ల స్థాపిత సామర్థ్యం 1994-2004 మధ్య 90 శాతం పెరిగిందని శ్వేతపత్రంలో ఉంది కాని ప్రాజెక్టుల వివరాలు మాత్రం లేవు. ఈ కాలంలో వచ్చిన విద్యుత్ ప్రాజెక్టులను చూస్తే వాటిలో చాలావరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినవేనని బోధ పడుతుంది. ఉదాహరణకు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 5వ స్టేజీ, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ 6వ యూనిట్, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్-2 వంటి ప్రాజెక్టులన్నీ గతంలోనే మొదలయ్యాయి. ఇక జలవిద్యుత్ కేంద్రాల్లో 900 మెగావాట్ల శ్రీశైలం విద్యుత్ కేంద్రం 1991-92లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలై 2001-03లో పూర్తయింది. తర్వాత 1994-95 మధ్యకాలంలో కేంద్రం నిర్మించిన ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్ర లేదు. చంద్రబాబు హయాంలో మొదలై, నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ల్యాంకో (351 మె.వా.), రిలయన్స్ (220 మె.వా) రెండూ ప్రైవేట్ ప్రాజెక్టులే. రాష్ట్రానికి గుదిబండలుగా వేళ్లాడుతున్న కొద్ది ప్రాజెక్టులలో ఈ రెండూ ఉన్నాయన్నది గుర్తించాలి.

 2. సరఫరా పంపిణీ నష్టాల ‘తగ్గుదల’: తన హయాంలో సరఫరా పంపిణీ నష్టాలు 37 శాతం నుంచి 23 శాతానికి తగ్గాయని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, 1994లో 18.94 శాతం ఉన్న నష్టాలు 2004 నాటికి 23 శాతానికి పెరిగినట్లు రికార్డులు చూపుతున్నాయి. ప్రపంచ బ్యాంకు నిర్దేశన మేరకు చంద్రబాబు హయాంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం 1995లో మొదలైంది. ప్రైవేటీకరణ జరగాలంటే విద్యుత్ సంస్థల పనితీరు అధ్వానంగా ఉన్నట్టు ప్రజలను భ్రమింపజేయడానికి అప్పట్లో ప్రభుత్వం తప్పుడు లెక్కలు సృష్టించింది. అందుకే 1994లో 18.94 శాతంగా ఉన్న నష్టాలను 1996లో 38 శాతానికి పెరిగినట్లు చూపించారు. నష్టాల తగ్గింపునకు వచ్చేసరికి 1999 నుండి 2004 వరకు నష్టాలను మాత్రమే శ్వేతపత్రంలో చూపించారు. తప్పుడు లెక్కలతో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలని బాబు చేసిన ప్రయత్నానికి.. నాడు జరిగిన విద్యుత్ ఉద్యమం, బషీర్‌బాగ్ కాల్పులతో బ్రేకులు పడ్డాయి.

 3. చార్జీల భారం మిథ్య: తన హయాంలో ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని ఎక్కువగా మోపలేదని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, గత 20 సంవత్సరాల్లో 2004 నుంచి 2009 మధ్య కాలంలో తప్ప, ప్రజలపై భారం లేని రోజు లేదు. ఏటా 15 శాతం వరకు చార్జీలను పెంచాలని పేదవర్గాలపై కూడా కాస్ట్ టు సర్వ్ పేరుతో అధిక భారం మోపాలన్న ప్రపంచబ్యాంకు మార్గదర్శకత్వంలో 2000లో 15 శాతం చార్జీలు పెంచారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను, చార్జీల పెంపును అడ్డుకున్న బషీర్‌బాగ్ ఉద్యమానికి ప్రజలెప్పుడూ రుణపడి ఉంటారు.

 4. ప్రణాళికాబద్ధ నిర్వహణ: తన హయాంలో విద్యుత్ రంగం ప్రణాళికాబద్ధంగా నడిచిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నిజానికి ఆ ప్రణాళిక ప్రపంచ బ్యాంకుదే. పొల్లు పోకుండా అమలు చేసింది మాత్రం చంద్రబాబు. ఏపీ విద్యుత్ రంగ పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టు పేరుతో ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న  ఒప్పందం ప్రకారం నష్టాల సాకు చూపెట్టి మొత్తం విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని భావించారు. అద్భుతంగా నడుస్తున్న ‘జెన్‌కో’ను కూడా వదిలిపెట్టలేదు. అద్భుతంగా నడుస్తోంది కాబట్టి దాన్ని అమ్మితే భారీగా ప్రభుత్వానికి రాబడి లభిస్తుందని, ఆ క్రెడిట్ మీకే దక్కుతుందని ఉద్యోగులకు నచ్చచెప్పాలని ఆ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగుల, ప్రజల ఉద్యమాల కారణంగా కారు చౌకకు విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసే కుట్ర అప్పట్లో విఫలమైంది.

 ప్రైవేటీకరణ భూతాలు మళ్లీ లేస్తున్నాయా?

 ఈ వివరాలను పరిశీలిస్తే బాబు శ్వేతపత్రం పచ్చి అబద్ధాల పుట్టని  తేలుతుంది. విద్యుత్ రంగ ప్రైవేటీకరణే తన విధానమని బహిరంగంగానే అప్పట్లో చెప్పిన బాబు ఇప్పుడు ప్రైవేట్ కొనుగోళ్ల కారణంగా చార్జీల భారం ప్రజలపై పడిందని చెప్పడం హాస్యాస్పదం. అనుమతులివ్వవద్దంటూ ప్రజలూ, నిపుణులూ వద్దంటున్నా అడ్డగోలుగా ప్రైవేట్ గ్యాస్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చిన బాబు, ఇప్పడు అవే ప్రాజెక్టులు గ్యాసులేక మూతపడ్డాయని గగ్గోలు పెట్టడం సబబేనా? ఇలా చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో మళ్లీ గతాన్ని ఘనంగా చెప్పుకోవడంతో ప్రజలకు అనుమానం కలుగుతోంది. అప్పటి ప్రైవేటీకరణ భూతాలు మళ్లీ నిద్రలేస్తాయా? అనే భయాలు పెరుగుతున్నాయి. ఏపీ జెన్‌కోను ప్రోత్సహిస్తామంటూ పేర్కొనడం మంచిదే. అలాగే గృహాలకూ, పరిశ్రమలకూ 24 గంటల విద్యుత్తు, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు ఆకర్షణీయమైన ప్రకటనలే. అయితే ఈ ప్రకటనలన్నీ ఆచరణకు వస్తే తప్ప నమ్మలేము. ఎందుకంటే బాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. నమ్మాలన్నా గత అనుభవాలు ప్రజలను నమ్మనీయకుండా చేస్తున్నాయి.
 
 (వ్యాసకర్త విద్యుత్ రంగ నిపుణులు) - కె. రఘు
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement