సామాన్యుడు పొరపాటున రోడ్డుమీద తప్పు చేస్తే చలాన్లతో బాదిపడేసే మన ట్రాఫిక్ అధికారులు మరి ఎర్రబుగ్గల కార్లను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు? గతంలో ఒకసారి సుప్రీంకోర్టు స్వయంగా ఎర్రబుగ్గల కార్ల వ్యవహారంపై మొట్టికాయలు వేసినా మళ్లీ అదే తీరు. ముఖ్యమైన అధికారులు మాత్రమే ఎర్రబుగ్గల కార్లు ఉపయో గించాలన్న నిబంధనలను గాలికి వదిలి గల్లీ నాయకుల నుంచి కార్పొ రేటర్లు, చోటామోటా నేతలు సైతం బుగ్గకార్లను దుర్వినియోగం చేయ డమే కాకుండా రోడ్డు మీద ట్రాఫిక్ సిబ్బందిపై ఘర్షణకు దిగటం సర్వ సాధారణమైపోయింది. రోగులను తీసుకెళుతున్న అంబులెన్స్‌లను సైతం లెక్క చేయకుండా వీరు హల్‌చల్ చేస్తున్నారు.
పైగా ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా బుగ్గకార్లలో ప్రయాణం చేస్తూ, ఎవరైనా తనిఖీ చేస్తే పెద్దపదవులలో ఉన్న వాళ్ల పేర్లు చెప్పి ట్రాఫిక్ అధికారులను బెదిరించడం వంటి సంస్కృతికి అలవాటు పడిపోయారు. దీంతో పోలీసులు కూడా ఒక్కోసారి మనకెందుకులే అని చూసీ చూడ కుండా వదిలేయడం వల్ల అసాంఘిక శక్తులు కూడా దీన్ని ఆసరాగా చేసు కుని పెట్రేగి పోతున్నారు. రోడ్డుమీద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఈ ఎర్రబుగ్గ కార్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు శాఖ సంయుక్తంగా పథకం రూపొందించి బుగ్గకార్లను సరైన వ్యక్తులు మాత్రమే ఉపయోగించేలా తగు చర్యలు చేపట్టాలి.
-పద్మావతి వివేకనగర్, హైదరాబాద్