అడ్వానీ సమయజ్ఞత | will think about narendra modi about his silent mode on national emergency | Sakshi
Sakshi News home page

అడ్వానీ సమయజ్ఞత

Published Sun, Jun 21 2015 1:45 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

అడ్వానీ సమయజ్ఞత - Sakshi

అడ్వానీ సమయజ్ఞత

మోదీ మౌనం వెనుక నిస్సహాయత ఉన్నదా, రాజకీయ చాణక్యం ఉన్నదా లేక ఆగ్రహం ఉన్నదా అన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. మౌనంగా ఉన్నంత మాత్రాన మోదీ ప్రజాస్వామ్య వ్వవస్థకు భంగం కలిగించే విధంగా తెగిస్తారని భావించడానికి ఆధారాలు లేవు. తెగించబోరని నమ్మకంగా చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. తన కత్తికి ఎదురు లేకుండా రాజ్యం చేసే మనస్తత్వం మోదీకి ఉన్నదని ఆయన 12 ఏళ్ళ గుజరాత్ పాలన తీరుతెన్నులూ, శంకర్‌సింగ్ వఘేలా వంటి పాత ప్రత్యర్థులను విడిచిపెట్టకుండా వెంటాడుతున్న వైనం ఒక వైపు గుబులు పుట్టిస్తున్నాయి.
 
 మళ్లీ ఎమర్జెన్సీ రాదన్న పూచీ లేదంటూ భారతీయ జనతా పార్టీ భీష్మాచార్యుడు లాల్‌కృష్ణ అడ్వానీ చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టడం ఆత్మహత్యా సదృశం. నలభై సంవత్సరాల కిందట ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులను గుర్తు చేసుకుంటే ఈ రోజూ అటువంటి వాతావరణం చూచాయగా  కనిపిస్తుం ది. అదే అభద్రతాభావం, అసహనం, అధికార దుర్వినియోగం, అప్రజాస్వా మిక ధోరణి, నిరంకుశ పోకడలూ  ఇప్పుడూ భయపెడుతూనే ఉన్నాయి. తూర్పు పాకిస్తాన్ విమోచనోద్యమాన్ని జయప్రదం చేసిన తర్వాత విజ యేందిరగా జాతి అభినందనలు అందుకున్న ఇందిరాగాంధీ, అనంతరం జరి గిన ఎన్నికలలో మొత్తం లోక్‌సభ స్థానాలలో మూడింట రెండు వంతులు కైవ సం చేసుకున్న తర్వాత నియంతగా మారిన పరిణామాలను తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.  రాయబరేలీ నుంచి  తన ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక, న్యాయవ్యవస్థపైనా, ప్రతిపక్షాలపైనా, ఉద్యమ నాయకులపైనా  కత్తికట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసేం దుకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించిన నాటి పరిస్థితులను నేటి పరిస్థితు లతో పోల్చి చూసుకుంటే చిత్రమైన అనుభూతి కలుగుతుంది.
 
 నాలుగు దశాబ్దాల కిందట బెంగుళూరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపులో పనిచేయడం గర్వంగా ఉండేది. నా జర్నలిస్టు జీవితంలో మొదటి మజిలీ అదే. ఎమర్జెన్సీని రామనాథ్ గోయెంకా నాయకత్వంలో సాహసోపేతంగా ప్రతిఘ టిస్తూ అద్భుతంగా పోరాడిన పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్. అదే గ్రూప్‌కు చెం దిన తెలుగు పత్రిక ‘ఆంధ్రప్రభ’ రాయలసీమ ఎడిషన్‌లో యువ జర్నలిస్టుగా పని చేయడం, ఆత్యయిక పరిస్థితిని ఎండగడుతూ వార్తలూ, వ్యాసాలూ రాయ డం, తరచు బెంగళూరు కేంద్రంగా పనిచేసే అరుణ్‌శౌరీ అక్షర పరాక్రమాన్ని దగ్గరగా చూడటం, చిక్కమగళూరు ఉప ఎన్నికలో ఇందిరాగాంధీ పోటీ చేసిన ప్పుడు రిపోర్టింగ్ విధులు నిర్వర్తించడంలో భాగంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి భవనం వెంకట్రామ్‌తో కలిసి ఎన్నికల సభలకు హాజరుకావడం ఎప్పటికీ మరపురాని మధురానుభూతులు.

ఎన్నికల వాతావరణం సమీ క్షిస్తూ తిరిగి తిరిగి రాత్రికి  భవనం, నేనూ ధర్మస్థలలో బస చేసిన అతిథి గృహానికి అర్ధరాత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి తలుపు తట్టారు. అప్పుడే వైఎస్‌ను మొట్టమొదట కలుసుకోవడం. భవనం, వైఎస్ సన్నిహిత మిత్రులు. వాన కురుస్తున్నా సరకు చేయకుండా ఇందిర ఎన్నికల ప్రచారం చేయడం చూశాం. జనతా పార్టీ అభ్యర్థి వీరేంద్రపాటిల్‌కు మద్దతుగా ప్రచారం చేయడా నికి చిక్కమగళూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఫైర్‌బ్రాండ్ జార్జి ఫెర్నాండెజ్ ఉద్వేగభరిత ప్రసంగాలూ విన్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి  దేవరాజ్ అర్స్ సమర్థ సారథ్యంలో ఇందిరాగాంధీ విజయం తథ్యమని వీరేం ద్రపాటిల్‌కూ తెలుసు. పార్టీ ఆదేశాన్ని శిరసావహించి పోటీలోకి దిగారు.

ఎమర్జెన్సీ విధించినందుకు నిరసనగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకీ యం ప్రచురించే స్థలాన్ని ఖాళీగా వదిలివేయడం, ఎక్స్‌ప్రెస్ సంపాదకుడుగా మూల్గాంవ్‌కర్‌ను తొలగించి నరసింహన్‌ను నియమించడం, నరసింహన్ కత్తి మీద సాము చేయడం, ఆంధ్రప్రభ సహాయ  సంపాదకుడు కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం అదే ఒరవడిలో సెన్సార్‌షిప్ నిబంధనలను అతిక్రమించకుండా, పూర్తిగా పాటించకుండా అక్షర విన్యాసాలు చేయడం బాగా గుర్తు. పీటీఐ, యూఎన్‌ఐ వార్తాసంస్థలను విలీనం చేసి సమాచార్‌గా మార్చిన నాటి సమా చార మంత్రి విద్యాచరణ్ శుక్లా ఇటీవలే చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మందుపా తరకు బలైనారు. ఆత్యయిక పరిస్థితిలో అటల్ బిహారీ వాజ్‌పేయి, అడ్వానీ ఇద్దరూ బెంగళూరు జైలులోనే ఖైదీలు. ఫిడేలు రాగాల డజన్ కవి తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి భార్య స్నేహలతారెడ్డి నిర్బంధం, మరణం, కన్నడప్రభ సంపా దకుడు ఖాద్రిశ్యామన్న ఖడ్గచాలనం హృదయానికి హత్తుకుపోయిన దృశ్యాలు. అడ్వానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇటీవల  ఇచ్చిన ఇంటర్వ్యూ చదివినప్పుడు ఈ జ్ఞాపకాలు నాలుగు దశాబ్దాలు వెనక్కు పరుగెత్తించాయి.
 
 ఎమర్జెన్సీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయం ఇందిరదే. ఉత్త రాదిలో అడ్రసు లేకుండా పోయినా ఇందిరా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మాత్రం చెన్నారెడ్డి, అర్స్‌ల సారథ్యంలో ఘనవిజయం సాధించింది. జనతా పార్టీ హయాంలోనే దేశంలో ఎమర్జెన్సీ మళ్ళీ  విధించే అవకాశం లేకుండా 48వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయినప్పటికీ ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం లేక పోలేదంటూ అడ్వానీ హెచ్చరి స్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని హరించే శక్తులు ఇప్పటికీ బలంగానే ఉన్నాయని అంటున్నారు.

పెద్దాయన ఈ వ్యాఖ్య ప్రధాని నరేంద్రమోదీని దృష్టిలో పెట్టుకొనే చేశారంటూ ప్రతిపక్ష నాయకులు విశ్లేషించారు. మొట్టమొదటి ప్రయోగం ఢిల్లీలోనే జరగవచ్చునంటూ ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అందుకే ఆయనను కలుసుకోవడానికి అడ్వానీ తిరస్కరించవలసి వచ్చింది. కలుసుకుంటే ప్రధానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు అర్థమయ్యేవారు అడ్వానీ. ఇందిరాగాంధీని దేవకాంత్ బారువా వంటి తాబేదార్లు ‘ఇండియా ఈజ్ ఇందిరా’ అంటూ స్తుతించిన విధంగానే, వ్యక్తి ఆరాధనకు పట్టంగట్టిన పద్ధతిలోనే ఇప్పుడూ ‘హర్‌హర్ మోదీ’ అంటూ భజనచేసేవారూ, మోదీ ... మోదీ అంటూ నినాదాలు చేసే వారు దేశంలోనూ, విదేశాలలోనూ అనేకమంది ఉన్నారు.  నాటి ప్రధాని చేతిలో సర్వాధికారాలూ ఉన్నట్టు నేటి ప్రధాని చేతిలోనూ అధికారం కేంద్రీకృతమై ఉంది.
 
మౌనం అంతరార్థం ఏమిటి?
ఇందిరకు ఎమర్జెన్సీ విధించాలంటూ సలహా చెప్పిన నాటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సిద్దార్థ శంకర్ రే వంటి నాయకులు ఇప్పుడూ అజ్ఞాతంగా ఉండే ఉంటారు. కొన్ని రోజులుగా నరేంద్రమోదీ పాటిస్తున్న మౌనం అందోళన కలిగి స్తోంది. ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ల మౌనంలో వ్యత్యాసం ఉంది. ఇందిర మౌనం వెనుక ఆగ్రహం, అభద్రతాభావం, అను మానభూతం ఉండేవి. పీవీ రాజకీయ చాతుర్యంలో మౌనం ఒక భాగం. మన్మో హన్‌సింగ్ మౌనం వెనుక ఉన్నది నిస్సహాయత. తనను నడిపిస్తున్న శక్తికి ఎదురు చెప్పలేని బలహీనత. ఐపీఎల్ క్రికెట్ రారాజుగా వెలుగొంది ఇప్పుడు చట్టానికి చిక్కకుండా లండన్‌లో తలదాచుకున్న లలిత్‌మోదీకి విదేశాంగమంత్రి హోదాలో సుష్మాస్వరాజ్ సహాయం చేసినట్టూ, ప్రతిఫలంగా అతని ఉపకారం పొందినట్టూ దేశం కోడైకూస్తున్నది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజే లలిత్‌మోదీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టూ, ఆమె కుమారుడూ, పార్లమెంటు సభ్యుడూ దుష్యంత్‌సింగ్‌కు చెందిన సంస్థ నిహాల్ట్ హెరిటేజ్ హోటల్ లిమిటెడ్‌లో పది రూపాలయ షేరును లలిత్‌మోదీ రూ. 96, 190కు కొనుగోలు చేసినట్టు సాక్ష్యాధారాలతో సహా వెల్లడైనా ప్రధాని మౌనంగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎంఎల్‌ఏ ఎల్విస్ స్టీఫెన్సన్‌కు ఓటు కోసం నోట్ల వ్యవహారంలో  రూ.50 లక్షలు చెల్లిస్తూ వీడియో కెమెరాకు చిక్కినా, స్టీఫెన్సన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు మాట్లాడినట్టు టేపులో సాక్ష్యం ఉన్నా నరేంద్రమోదీ నోరు మెద పడం లేదు.

కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఎన్‌డీఏ సర్కార్‌పైనా, ప్రధానంగా నరేంద్రమోదీపైనా దుమ్మెత్తిపోస్తున్నాయి. సుష్మానూ, రాజేనూ, చంద్రబాబు నాయుడినీ మౌనంగా ఉండటం ద్వారా మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తున్నందుకు ప్రతిపక్షాలు మోదీపైన ధ్వజమెత్తుతున్నాయి.  అయినా ఆయన మౌనం వీడటం లేదు. మోదీ మౌనం వెనుక నిస్సహాయత ఉన్నదా, రాజకీయ చాణక్యం ఉన్నదా లేక ఆగ్రహం ఉన్నదా అన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. మౌనంగా ఉన్నంత మాత్రాన మోదీ ప్రజాస్వామ్య వ్వవస్థకు భంగం కలిగించే విధంగా తెగిస్తారని భావించడానికి ఆధారాలు లేవు. తెగించబోరని నమ్మకంగా చెప్పడా నికి కూడా ఆధారాలు లేవు. తన కత్తికి ఎదురు లేకుండా రాజ్యం చేసే మనస్త త్వం మోదీకి ఉన్నదని ఆయన 12 ఏళ్ళ గుజరాత్ పాలన తీరుతెన్నులూ, శంకర్ సింగ్ వఘేలా వంటి పాత ప్రత్యర్థులను విడిచిపెట్టకుండా వెంటాడుతున్న వైనం ఒక వైపు గుబులు పుట్టిస్తున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠంగా వేళ్లూనుకున్న నేటి భారతంలో ఎమర్జెన్సీ వంటి దుస్సా హసాలకు తావులేదని  భరోసా మరోవైపు ఊరడిస్తున్నది. జరగరానిది జరిగినా అప్రజాస్వామిక ధోరణిని అడ్డుకో డానికి కొత్త యోధులు తెరపైకి వస్తారనే  విశ్వా సం కూడా లేకపోలేదు.  
 
 కేంద్రాన్ని, నరేంద్రమోదీని పక్కన పెట్టినా దేశంలో అధికారంలో ఉన్న వారికి ఎదురు చెప్పే సాహసం చేసేవారే తక్కువైనారు. ఇందిరాగాంధీ హయాంలో, ముఖ్యంగా ఎమర్జెన్సీ ఘట్టంలో ఆమె రెండో కుమారుడు  సంజయ్ గాంధీ చెలరేగి పోయినట్టే ఈ రోజు చాలామంది నాయకుల కొడుకులూ, కుమార్తెలూ చక్రం తిప్పుతున్నారు. వారిలో చాలామందికి అధికారం చెలాయించడం, అక్రమంగా డబ్బు సంపాదించడం ప్రధాన ఎజెండా. పిన్నవయస్సులోనే అహంకారం వారిని కమ్మేసింది.

హెచ్‌ఆర్ గోఖలే, రజనీపటేల్, బన్సీలాల్, యశ్పాల్ కపూర్,  ఓమ్ మెహతా బాపతు నాయకులు ఇప్పుడు ఇంకా అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడినట్టు స్పష్టంగా తెలిసిపోయినా ఆమెకు మద్దతు తెలిపేందుకు ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకు లందరూ క్యూకట్టారు. సుష్మాస్వరాజ్ సైతం విచక్షణారహితంగా వ్యవహరిం చినట్టు నిర్ద్వంద్వమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఆమెను కాపాడేందుకు బీజేపీ నాయకత్వం, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలూ సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. చంద్రబాబునాయుడు రేవంత్‌రెడ్డి చేత తప్పు చేయించారనే సంగతి బడి పిల్లలకు కూడా తెలిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని వెనకేసుకురావడా నికి అచ్చెంనాయుడు వంటి మంత్రులు పోటీ పడుతున్నారు. పైగా గవర్నర్ నరసింహన్‌ని అవహేళన చేస్తూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.
 
 నాటి యోధుల వీర గాథలు
 గతంలో ఇందిరలో కొట్టవచ్చినట్టు కనిపించిన నియంతృత్వ ధోరణులను నిర సిస్తూ పార్టీని వీడి లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అడుగులలో అడుగులు వేసిన చంద్రశేఖర్ వంటి యంగ్‌టర్క్‌లూ, జార్జిఫెర్నాడెజ్, మృణాళ్ గోరే, మధులిమాయే, మధుదండావతే వంటి యోధులూ ఇప్పుడు ఎంతోమంది కని పించడంలేదు. ముఖ్యమంత్రులు అక్రమాలు చేస్తున్నా, నిధుల దుర్వినియో గానికి పాల్పడుతున్నా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నేరం చేసి చేయలేదంటూ దబాయిస్తున్నా ఎదురు చెప్పే సాహసం కానీ నిరసనగా రాజీనామా చేసే తెగువ కానీ ఒక్క మంత్రీ, ఒక్క శాసనసభ్యుడూ  ప్రదర్శించడం లేదు. పైగా నిస్సిగ్గుగా వంత పాడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదు నియంతృత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న నాయకులున్న అన్ని  రాష్ట్రాలకూ వర్తిస్తుంది. రాజ కీయ నాయకత్వం  చట్టబాహ్యమైన పనులు చేయమని చెప్పినా మారు మాట్లా డకుండా ఊడిగం చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే అధికంగా ఉన్నట్టు న్నారు. చెన్నారెడ్డి ఆదేశాలను పాటించకుండా ధిక్కరించిన శంకరన్ వంటి ఉన్నతాధికారులు ఇప్పుడు కూడా ఉన్నారేమో తెలియదు. మనసు చంపుకొని, అంతరాత్మ గొంతు నొక్కి ఇష్టంలేని పనులు చేస్తున్న ఉన్నతాధికారులే ఎక్కువ.  సత్యనిష్ఠ, విలువలపట్ల అంకితభావం ఉన్న రాజకీయ నాయకులు కలికానికి కూడా కనిపించడం లేదు.

ఎన్నికలు ముగిసిన తర్వాత వారం రోజులు కూడా ఆగకుండా పార్టీలు ఫిరాయించే సంస్కృతి ప్రబలిన ఈ రోజులలో,  అధికార దుర్వినియోగం చేసి కోట్లకు పడగలెత్తడమే లక్ష్యంగా రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో ఇప్పుడే కాకపోయినా భవిష్యత్తులో  ఎవరైనా నియంత దేశంలో ఎమర్జెన్సీని మళ్లీ విధిస్తే దాన్ని ఎదిరించి పోరాడతామనే విశ్వాసం కలగదు.   బలమైన నాయకుడు అప్రజాస్వామికంగా, అనైతికంగా, చట్టవ్యతిరేకంగా వ్యవ హరించినా తప్పుపట్టేవారు స్వపక్షంలో లేనప్పుడు ఆ నాయకుడు తన ప్రవ ర్తనను సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ప్రాంతీయ పార్టీలలో అత్యధికం అధినాయకుల జేబు సంస్థలే. ఎదురు తిరిగినవారికి మనుగడ అసాధ్యం. దేశంలోని 29 రాష్ట్రాలలోనూ దాదాపు ఇదే పరిస్థితి దాపురించినందుకే బహుశా అడ్వానీ దేశప్రజలను బహుపరాక్ అంటూ హెచ్చరించి ఉంటారు. అడ్వానీ హితవాక్యాన్ని సదా మననం చేసుకోవాలి. స్వేచ్ఛకు చెల్లించాల్సిన మూల్యం నిరంతర జాగృతి అనే విషయాన్ని విస్మరించ కూడదు.  
 - కె.రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement