మహిళా బిల్లు మళ్లీ మొదటికి..
ఎన్నో యుద్ధాల తర్వాత 2010లో రాజ్యసభ బిల్లును ఆమోదించినా, లోక్‌సభలో పక్కకు నెట్టేశారు. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న ఏ బిల్లు అయినా, సభ రద్దయితే మురిగిపోతుంది. ఇప్పుడదే జరిగింది.
ఎన్నికల రుతువు ఆగమించిన వేళ - ప్రతి రాజకీయకూట మిలో అధికారపు ఆశలు మోసులెత్తుతున్నాయి. ఓటర్లను ఆకర్షించే వాగ్దానపు కలకూజితాలు కాస్త ముందే మొదల య్యాయి. ఓ పక్షం.. అభివృద్ధి - సుస్ధిరతా మంత్రాలతో ముగ్ధుల్ని చేసే వ్యూహంలో మునిగితోలుతోంది. పదేళ్లుగా అధికారం చెలాయిస్తున్న మరోపక్షం - ప్రజాకర్షక పథకాలూ ‘భారత్ నిర్మాణ్’కి రాళ్లెత్తిన వైనాలూ వెల్లడిస్తూ చాలారోజులుగా ప్రచారం చేస్తోంది. తాజాగా జాట్ ఓటర్లకు రిజర్వేషన్ గాలమేయడం.. ముస్లిం సబ్‌కోటాపై స్టే ఎత్తేయాలని ‘సుప్రీం’ను ఆశ్రయించడం.. రాహుల్ రాష్ట్రాలు కలియదిరుగుతూ స్త్రీ సాధికారతా జపం చేయడం - ఇవన్నీ కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగమే. పార్టీల కార్యక్రమాల్ని ప్రముఖంగా ప్రచురిస్తున్న పత్రికలు.. రంజైన రాజ కీయకేళిని రక్తి కట్టించేందుకు రంగంలోకి దిగిన పత్రికలు.. కోట్లాది మహిళలకు ప్రాతినిధ్యం వహించే తొమ్మిది మహిళా సంఘాల డిమాండ్ల పత్రాన్ని మాత్రం పట్టించుకోలేదు.
చట్టసభలో స్త్రీలకు మూడింట ఒక వంతు స్థానాలిచ్చేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్‌బిల్లును 16వ లోక్‌సభలో తప్పక ఆమోదించాలనేది పై పత్రంలో ఒక డిమాండ్. మహిళాసంఘాలు 17 ఏళ్లుగా ఈ చట్టంకోసం పోరాడుతున్నాయి. తమ రాజకీయ గుత్తాధిపత్యానికి గండి పడుతుందని భయపడినవాళ్లు రకరకాల సాకులతో మొదట బిల్లును వ్యతిరేకించారు. స్త్రీల రాజకీయహక్కులకు సమాజ మద్దతు లభిం చడంతో- పార్టీలోనే రిజర్వేషన్లూ ద్విసభ్య నియోజకవర్గాలూ వంటి కొత్త ఆయుధాలకు పదునుపెట్టారు. 1996లో యునెటైడ్‌ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. తర్వాత వచ్చిన ఎన్డీయే, యూపీఏ పాలకులు ఏకాభిప్రాయం లేదంటూ బిల్లును ప్రవేశపెట్టలేమన్నారు. ఎప్పటికీ సాధ్యం కాని ‘ఏకాభిప్రాయాన్ని’ పదేపదే వల్లె వేసిన పాలకులు తమకు లాభించగల బిల్లుల విషయంలో ఈ సూత్రం పాటించలేదు. చివరికి ఎన్నో యుద్ధాల తర్వాత 2010లో రాజ్యసభ బిల్లును ఆమోదించినా, లోక్‌సభలో పక్కకు నెట్టేశారు. లోక్‌సభలో పెండిం గ్‌లో ఉన్న ఏ బిల్లు అయినా, సభ రద్దయితే మురిగిపోతుంది. ఇప్పుడదే జరిగింది. వ్యవహారం మొదటికొచ్చింది.
స్త్రీలు చట్టసభలకు ఎన్నికయితే ‘పంచాయతీరాజ్’ అనుభవమే పునరావృతమవుతుందనీ స్త్రీలు డమ్మీలుగా మిగులుతారని కొందరి ‘భయం’. అయితే మహిళా ఉద్యమకారుల అధ్యయనాలు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నాయి. వారి అధ్యయనం ప్రకారం - బినామీ పాలన ఎంత వాస్తవమో స్వతంత్రంగా బాధ్యతగా పనిచేసే మహిళా ప్రతినిధుల సంఖ్య పెరగడమూ అంతే వాస్తవం. చొరవగా ముందుకు సాగేవాళ్లు ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తోం ది. ఉద్యమాలతో సంబంధాలున్నచోట.. మద్దతు లభించిన చోట వాళ్లు ప్రతికూల వాతావరణం ఎదుర్కొని పని చేయగలుగుతున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి మహిళలకు అండగా నిలబడి శిక్షణ ఇస్తే.. బినామీల పాలనను అడ్డుకుంటే మంచి మార్పులొచ్చే అవకాశముంది. పంచాయతీల్లో మహిళల ప్రవేశం - స్త్రీలను ఇంటికి పరిమితం చేసిన ఫ్యూడల్ సంప్రదాయాన్నీ సవాలు చేయగలిగింది. ఇలాంటి సానుకూల మార్పుల్ని గమనించిన తర్వాతే మహిళా ఉద్యమకారులు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేశారు.
ఆధునికచరిత్రలో ఏ కాలంలో చూసినా, రాజకీయ హక్కుల విషయంలో స్త్రీలను పక్కకు నెట్టేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రోద్యమాన స్త్రీల సాహసాన్ని కళ్లారా చూసిన నాయకులు ఉద్యమానంతరం వాళ్లను ఇళ్లకే పరిమితం చేశారు. 499 స్థానాలున్న తొలి పార్లమెంట్‌లో స్త్రీలు 22 మందే. స్వాతంత్య్రానంతరం రాజకీయాల్లో, ప్రజాపోరాటాల్లో చురుకైనపాత్ర పోషించిన స్త్రీలను అభ్యర్థులుగా నిలపడంపై పార్టీలు ఏనాడూ దృష్టి సారించలేదు. అందుకే- చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యపరంగా మనదేశానిది 108వ స్థానం. పార్లమెంట్‌లో మహిళా ప్రతినిధులు 11 శాతం. ఇది ప్రపంచ సగటు (21.4శాతం)లో సగమే.
స్త్రీ - పురుష సమానత్వం ప్రాథమిక మానవహక్కులతో ముడివడిన విషయం మాత్రమే కాదనీ, దీనిపైనే పలురంగాల అభివృద్ధి ఆధారపడి ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ చెబుతారు. అణచివేత భావాలు వేళ్లూనిన సమాజానికి ఈ దృక్కోణాన్ని అర్థం చేయించాలిప్పుడు. అందుకు రాజకీయహక్కులు కావాలి. అణచివేత భావజాలాన్ని సవాల్ చేయడానికి.. సమాజవైఖరిలో మార్పు తీసుకురావడానికి.. ప్రజాస్వామిక సమాజనిర్మాణానికి.. స్త్రీలు చట్టసభల్లో ప్రవేశించితీరాలి. కాబట్టి హక్కులపోరాటం కొనసాగాలి - బిల్లు ఆమోదం పొందేవరకు.. సమానావకాశాలు సాధించేవరకు.
వి.ఉదయలక్ష్మి