ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్ : ఆంధ్రప్రదేశ్ నుంచి విష పూరిత చేపలు ఎగుమతి అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అస్సాం ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగపరిచింది. ఒడిశా రాష్ట్రానికి కూడా నిత్యం ఆంధ్రప్రదేశ్ నుంచి విశేషంగా చేపలు దిగుమతి అవుతాయి. రాష్ట్ర చేపల అంగడిలో ఆంధ్రప్రదేశ్ చేపల వాటా సింహభాగంగా కొనసాగుతోంది. అస్సాం ప్రభుత్వం వెలువరించిన భయానక ప్రకటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న చేపల్ని పరీక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయ–పశు సంవృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియను నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. నిపుణుల పరీక్షల నివేదిక ఆధారంగా బాధ్యుల్ని గుర్తించి కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర వ్యవసాయ–పశు సంవృద్ధి శాఖ మంత్రి ప్రదీప్ మహారథి హెచ్చరించారు. విషపూరిత చేపల విషయంలో తమ విభాగం ప్రత్యేకంగా విచారణ నిర్వహించిన మేరకు తగిన చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసిన చేపలకు అస్సాం ప్రభుత్వం గత నెల 29వ తేదీన ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విషపూరిత చేపల్ని దిగుమతి చేసినట్లు తేలిందని అస్సాం సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పిజూష్ హజారికా ప్రకటించారు. చేపలకు విష పూరిత ఫార్మాలిన్ రసాయనం ప్రయోగించి ఆంధ్రప్రదేశ్ ఎగుమతి చేస్తోంది. అక్కడినుంచి పలు ప్రాంతాలకు చేపలు విరివిగా ఎగుమతి అవుతున్నాయి. వాటిలో ఒడిశా ఒకటి కావడంతో కలకలం రేగింది.
అస్సాంలో ఆంధ్రా చేపల నిషేధం
ఫార్మాలిన్ విష పూరిత రసాయనం ప్రయోగంతో ఆ రాష్ట్రం ఎగుమతి చేసిన ఆంధ్రప్రదేశ్ చేపల వినియోగాన్ని నిషేధించినట్లు అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. 10 రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్ చేపల్ని అస్సాంలో విక్రయాలకు నిషేధించినట్లు అస్సాం సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పిజూష్ హజారికా ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు ఆంధ్ర ప్రదేశ్ చేపల విక్రయంపట్ల నిఘా వేస్తారు. ఉల్లంఘనల్ని అధిగమించి ఫార్మాలిన్ పూత కలిగిన ఆంధ్రా చేపల్ని విక్రయించే వారికి భారీగా జరిమానా విధించే అధికారాల్ని జిల్లా కలెక్టర్లకు కల్పించారు. నిందితులకు 2 నుంచి 7 ఏళ్ల వరకు ఖైదు, రూ.10 లక్షల జరిమానా విధిస్తామని అస్సాం ప్రభుత్వం హెచ్చరించింది.
ఫార్మాలిన్ రసాయనం ఏమిటి?
మనుషుల మృతదేహాలను దీర్ఘకాలం పదిల పరిచేందుకు వినియోగించే రసాయనం ఫార్మాలిన్. ఈ రసాయనం ప్రయోగించడంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి. మొప్పల గుండా ఫార్మాలిన్ రసాయనాన్ని చేపల్లోనికి చొప్పిస్తారు. ఇలా చేయడంతో వారాల తరబడి చేపలు తాజాగా ఉంటాయి.
ఫార్మాలిన్ ఛాయలు ఇలా..
ఫార్మాలిన్ ప్రయోగించిన చేపలు సాధారణ చేపల కంటే గట్టిగా ఉంటాయి. ఈ చేపల్ని తింటే రబ్బరులా అనిపిస్తాయి. దీనిపై పొలుసు సాధారణ చేపల కంటే రాటుదేలి ఉంటుంది. ఫార్మాలిన్ రసాయనం ప్రయోగంతో చేపమొప్పలు ఎర్రగా నిగనిగలాడతాయి. కళ్లు సజీవతను సంతరించుకుంటాయి. ఈ చేపల్ని వండే సమయంలో భిన్నమైన వాసన వస్తుంది. ఫార్మాలిన్ మానవ శరీరంలో చొరబడితే కేన్సర్ సంభవించే ఆస్కారం ఉన్నట్లు కొన్ని వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment