గ్రామాల్లో ఉచితంగా సేవలందిస్తున్న డాక్టర్ రవిశంకర్
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సరిపోదు..సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు ఆ వైద్యుడు. సమాజాన్ని పీడిస్తున్న రోగాలకు చికిత్స చేసేందుకు పోరాటబాట ఎంచుకున్నారు. ఓ వైపు ఉచితవైద్యశిబిరాల ద్వారా సేవలందిస్తూనే.. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రెండేళ్లుగా పాదయాత్ర చేస్తున్నారు. ఆయనే జగిత్యాలకు చెందిన యువ వైద్యుడు సిరికొండ రవిశంకర్.
– జగిత్యాలజోన్
రవిశంకర్‌కు చిన్నప్పటి నుంచి సమాజస్పృహ ఎక్కువ. ప్రజలు వేసిన ఓట్లతో గెలుపొంది వారినే నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధులపై పోరాడేతత్వం ఆయనది. 2002– 08 వరకు ఖమ్మంలో ఎంబీబీఎస్ చదివారు. కోర్సు అనంతరం వైద్యుడిగా పలు ఆస్పత్రుల్లో సేవలు అందించారు. 2014లో జగిత్యాలకు వచ్చిన రవిశంకర్ ఓ ఆస్పత్రిని ప్రారంభించారు.
రెండేళ్లపాటు వైద్యసేవలందించారు. ఓ వైపు ఆస్పత్రి నిర్వహిస్తూనే మరో వైపు ఖాళీ సమయాల్లో గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిచారు. ఇందుకు ఓ అంబులెన్స్ కొనుగోలు చేశారు. దాదాపు 500 వరకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. అయినా ఆయనకు ఏదో అసంతృప్తి. అదే సమాజంలోని సమస్యలపై పోరాటలకు ప్రేరణగా నిలిచింది.
ప్రజా సమస్యలపై పోరుబాట
రోగులకు ఉచిత వైద్యం అందిస్తూనే... 2016 నుంచి పూర్తిస్థాయిలో ప్రజాసమస్యలపై పోరాటం ప్రారంభించారు. ఉచిత వైద్యశిబిరాల ద్వారా గ్రామీణుల వద్దకు వెళ్లి వారిని పీడిస్తున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్థోమత లేక గ్రామీణులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి.. జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఉద్యమించారు.
దాదాపు 200 రోజులుగా నిరసన దీక్షలు చేశారు. రోజుకో సమస్యపై తన ఇంటి నుంచి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న కలెక్టరేట్‌కు చేరుకొని వినతిపత్రం ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 120 సమస్యలపై ఫోకస్ చేశారు. అంతేకాకుండా దాదాపు వెయ్యి వేపమొక్కలను నాటడం, ఇంకుడుగుంతలపై గ్రామీణులకు సైతం అవగాహన కల్పించారు.
ముందు డాక్టర్.. వెనుక అంబులెన్స్
డాక్టర్ నిరసన వినూత్న శైలిలో ఉంటుంది. రోజుకో సమస్యపై ఫ్లెక్సీతో ముందు డాక్టర్ వెళ్తుంటే.. వెనుక అంబులెన్స్ అనుసరిస్తుంటుంది. అంబులెన్స్‌లోని స్పీకటర్ల ద్వారా వచ్చే పాటలతో ప్రజలను ఆయా సమస్యలపై ఉత్తేజితులను చేస్తుంటారు.
పిచ్చోడు అన్నవారే.. మద్దతుగా..
రోజుకో సమస్యపై ఇలా పాదయాత్రగా డాక్టర్ వెళ్తుంటే..మొదట పిచ్చోడు అన్నవారే నేడు మద్దతుగా నిలుస్తున్నారు. వైద్యుడిగా పనిచేస్తే వచ్చే డబ్బులను వదులుకొని ఇలా చేయడం ఏంటని హేళనగా మాట్లాడిన వారే.. ఆయన పట్టుదల చూసి వెంట నడుస్తున్నారు.
సోషల్‌మీడియా వేదికగా..
డాక్టర్ ఎప్పటికప్పుడు తాను చేసే కార్యక్రమాల వివరాలను సోషల్‌మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తుంటారు. తాను చేసిన కార్యక్రమాలకు మద్దతుగా ఎవరిని సాయం కోరడం కానీ, డబ్బు సాయం కానీ అడగరు. ఒంటరిగానే ముందుకెళ్తున్నారు. తాను చేసే కార్యక్రమాలకు సైతం రోజుకు రూ.100 నుంచి రూ.200లోపే ఖర్చు అవుతున్నట్లు డాక్టర్ తెలిపారు. తన పోరాటం ద్వారా ఒక్క సమస్య పరిష్కారమైన విజయంగానే భావిస్తానని రవిశంకర్ స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment