నటుడు శ్రీహరి ఇకలేరన్న వార్తను టాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. శ్రీహరి అంటే ఒక విలన్, కాదు క్యారక్టర్ ఆర్టిస్ట్... కమేడియన్, కాదు కాదు ఓ రియల్ స్టార్! ఇవన్నీ కాదు ఆయనంటే ఎదో ఒక పాత్ర కాదు; అల్లరి చేసే పిల్లల చెవి మెలేసే మామయ్య, చెల్లెళ్ల వెంటపడే పోకిరుల తోలుతీసే అన్నయ్య. శకునంలా ఎదురొచ్చినట్టు, పొలమారితే గుర్తొచ్చినట్టు...ఎంతో దగ్గరగా.. చనువుగా... కొన్ని సార్లు సొంత మనిషిలా, అంతే దూరంగా... బెరకుగా... మరికొన్ని సార్లు పరాయివాడిలా .... అనిపించి, కనిపించిన శ్రీహరి కేవలం తెర మీద బొమ్మ కాదు, తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర. 1964 ఆగస్టు 15న హైదరాబాద్ లోని బాలానగర్ జన్మించిన శ్రీహరి సుమారు 97 సినిమాల్లో నటించారు. తమిళంలో మా పిళ్లై, తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రంతో సినీ జీవితాన్ని ఆరంభించారు.
ఫైటర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా చెరగని ముద్ర వేశారు. ఆయన భార్య సినీ డ్యాన్సర్ డిస్కో శాంతి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీహరి చివరి చిత్రం తుఫాన్.
పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. తన కూతురు అక్షయ ఫౌండేషన్ ద్వారా శ్రీహరి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలో నాలుగు గ్రామాలను దత్తతకు తీసుకున్నారు.
49 ఏళ్ల వయసులో కాలేయ సంబంధ వ్యాధితో అకాల మరణం చెందడం చిత్ర పరిశ్రమ ప్రముఖులను షాక్కు గురిచేసింది. ఆయన మృతికి సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.