06–03–2018, మంగళవారం
ఇంకొల్లు శివారు, ప్రకాశం జిల్లా
అధికార పార్టీ నేతల భూదాహానికి అంతే లేకుండా పోతోంది..
పాదయాత్రలో ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి వెళ్లినా తాగునీరు, రుణ మాఫీ, సంక్షేమ పథకాలు అందలేదన్న ఫిర్యాదులు ఎక్కువగా వచ్చేవి. కానీ ఈ రోజు అధికార పార్టీ నేతల భూదాహంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. ఏ విధంగా భూదురాక్రమణలకు పాల్పడుతున్నారో, పేదల భూములు లాగేసుకునేందుకు ఏ విధంగా సిద్ధమవుతున్నారో బాధితులు నాకు చెప్పారు. దేవరపల్లి గ్రామంలో 46 దళిత కుటుంబాలవాళ్లు 40 ఏళ్లుగా 22 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారట. 4 దశాబ్దాల కిందటే ఇందిరాగాంధీ హయాంలో బీ ఫారాలు పొందిన ఆ భూములే వారికి జీవనాధారంగా మారాయట.
తమకు ఆ భూములపై పూర్తి హక్కులున్నప్పటికీ.. గతంలో చంద్రబాబు పాలనలో ఐదేళ్లపాటు ఆ భూముల్లో పంటలు పండించుకోనీయకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారని, 2004లో నాన్నగారు అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ భూముల్లో పంటలు పండించుకునే అవకాశం కల్పించారని చెప్పారు. 2014 వరకూ ఎలాంటి ఇబ్బందీ రాలేదన్నారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ సర్కార్ రావడంతో కష్టాలు మొదలయ్యాయట.ఆ పార్టీకి ఓటేయలేదని కక్ష గట్టారట. నీరు – చెట్టు కార్యక్రమం పేరుతో గత ఆగస్టులో రాత్రి వేళ.. దాదాపు 400 మంది పోలీసులను దించి ఆడామగ అనే తేడా లేకుండా అరెస్టులు చేసి, నిర్బంధించారని, పొక్లెయిన్‌లు తెచ్చి తమ భూముల్ని తవ్వించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కోర్టుకెళ్లామని వివరించారు. ఇది నిజంగా దారుణం.
పేదలపై ఈ విధంగా కక్షగట్టడం, వారి జీవనాధారంపై దెబ్బకొట్టడం అన్యాయం. చినగంజాం షెడ్యూల్డ్ కులాల సేవా సంక్షేమ సంఘం ప్రతినిధులదీ ఇదే బాధ. 60 కుటుంబాలకు చెందిన నిరుపేద దళితులు గత 15 ఏళ్లుగా 56 ఎకరాల భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో కష్టాలు మొదలయ్యాయని కన్నీరుపెట్టారు. టీడీపీ నేతలు బినామీల పేర్లతో తప్పుడు రికార్డులు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, వారికి అధికారులు అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో ఇసుక అక్రమ వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారని, అర్హత లేనివారి పేర్లతో ఆన్‌లైన్లలో తప్పుడు రికార్డులు కూడా పెట్టారని తెలిపారు. గత్యంతరంలేక.. జరుగుతున్న మోసంపై తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు. వాళ్లకు ఆ పరిస్థితి రావడం నిజంగా శోచనీయం. పేదల భూములకు ప్రభుత్వమే రక్షణ కల్పించకపోతే ఎలా?
ఇంకొల్లు పట్టణంలో ముస్లిం మైనార్టీ సోదరులు నన్ను కలిసి.. వారికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకొన్నారు. 30 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ఇంకొల్లు పట్టణంలో ఒక్కొక్కరికి రెండున్నర సెంట్ల చొప్పున 518 ప్లాట్లు ఇచ్చిందట. లబ్ధిదారుల్లో ఎక్కువమంది ముస్లిం మైనార్టీలే ఉన్నారని తెలిపారు. ఆ ప్లాట్లలో ఇప్పటి వరకు చదును చేయడం, రోడ్లు వేయడం, నీటి వసతి, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదట. అందువల్లే నివాసాలు ఏర్పాటుచేసుకోలేకపోయామని చెప్పారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక.. తామంతా వైఎస్సార్ సీపీకి చెందిన మైనార్టీలమని స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతలు కలిసి తమ పట్టాలు రద్దు చేయించారని తెలిపారు. ఆ ప్లాట్లను వారి అనుయాయులకు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. తమపట్ల కక్షపూరితంగా వ్యవహరి స్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వాటిలో సౌకర్యాలు కల్పించి మేలు చేయాల్సిందిపోయి.. పార్టీల వివక్ష చూపిస్తూ తమ అనుయాయులకు ఇప్పించుకోవాలనే దుర్బుద్ధితో పట్టాలను రద్దు చేయించడం చాలా దారుణం. అధికార పార్టీ నేతల భూదాహానికి అంతే లేకుండా పోతోంది. నిరుపేదలను కూడా టీడీపీ నేతలు దోచుకో వడం, వారికి ప్రభుత్వ ముఖ్యులే వత్తాసు పలకడం అత్యంత దారుణం.
ప్రపంచంలోని ఉత్తమ నటీనటులకు ఆస్కార్ అవార్డులు ప్రకటించినట్లు పత్రికల్లో చూశాను. ప్రత్యేక హోదా విషయంలో డ్రామాలాడుతూ రాష్ట్రంపై దొంగ ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు నటనాకౌశలాన్ని చూసి ఉంటే.. ఆస్కార్ అవార్డు ఆయనకే ఇచ్చేవారేమో! ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచడం కోసం ప్రభుత్వాలు వారికి ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూముల పట్టాలిస్తాయి. మీ ప్రభుత్వంలో అవేవీ చేయకపోగా.. వారికున్న కొద్దిపాటి భూములను సైతం బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యంగా లాక్కోవడం న్యాయమేనా? వారి ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షించడం ధర్మమేనా? కాపాడాల్సిన కనురెప్పే కంటిని కాటేస్తే.. ఆ కన్నీటి వెతలను ఎవరితో చెప్పుకోవాలి?
Comments
Please login to add a commentAdd a comment