సాక్షి, అమరావతి/బి.కొత్తకోట: ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లలో ఐదు శాతాన్ని రాష్ట్రంలో కాపులకు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మిగిలిన ఐదు శాతం రిజర్వేషన్లను ఈబీసీలకు ఇస్తామన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళవారం టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో కాపులకు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పదిశాతం రిజర్వేషన్లలో ఐదుశాతం కాపులకు ఇవ్వాలని ఎప్పుడో కేంద్రానికి పంపించామని, కానీ అప్పుడు బీజేపీ ఒప్పుకోలేదన్నారు. నాలుగేళ్లలో పెన్షన్లను పది రెట్లు చేశామని, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250 కోట్లు ముందస్తు చెల్లింపు చేయనున్నామని, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను తీసేశామని చెప్పారు.
కోల్‌కతాలో జరిగిన సభతో బీజేపీ నాయకుల్లో భయం మొదలైందన్నారు. ఏపీకి ఎక్కువ నిధులిచ్చామన్న కేంద్రమంత్రి గడ్కరీ వ్యాఖ్యలు అబద్ధమని, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కే ఎక్కువ నిధులిచ్చారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకన్నా ఏపీకి తక్కువ ఇచ్చారని, పోలవరం నెలలో చేస్తామని ఏడాది జాప్యం చేశారని, డీపీఆర్–2 ఆమోదానికి ఏడాది జాప్యం చేశారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి బీజేపీ వల్ల జరగలేదని, తమ స్వయంకృషి వల్లే జరిగిందన్నారు. 25న రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ‘పసుపుకుంకుమ’ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలను తెలిపేందుకు 22 పార్టీల ప్రతినిధులతో ఈసీని కలుస్తామని చెప్పారు. కాగా, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ మంగళవారం ఉండవల్లిలో చంద్రబాబును కలిసారు.
రూ.2,600 కోట్లతో చిత్తూరుకు గండికోట నీరు
వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్ నుంచి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీరు అందించేందుకు రూ.2,600 కోట్లతో పథకాన్ని చేపట్టామని సీఎం చెప్పారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్పసముద్రంలో కృష్ణా జలాలకు హారతి కార్యక్రమ సభ జరిగింది. మంత్రులు దేవినేని ఉమా, అమరనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభనుద్దేశించి సీఎం మాట్లాడారు. పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న నీటిసమస్య తీర్చేందుకు గండికోట నుంచి రెండు టీఎంసీల నీటిని పైప్‌లైన్ ద్వారా తరలించి దాహార్తి తీర్చాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని తెలిపారు. కృష్ణానీరు 29న మదనపల్లెకు చేరనున్న సందర్భంగా జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలిపారు.
కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు
Published Wed, Jan 23 2019 3:39 AM | Last Updated on Wed, Jan 23 2019 3:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment