విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెంగళరాయుడు, అన్నవరపు కిషోర్ తదితరులు
సాక్షి, చిలకలూరిపేట : విలేకరి శంకర్‌ను హత్యచేయించింది, మరో విలేకరి సురేంద్రనాథ్ ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి కల్పించింది మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దంపతులేనని ఎస్సీ నాయకుడు పంగులూరి వెంగళరాయుడు ఆరోపించారు. ప్రత్తిపాటి దంపతుల అరాచకాలపై వార్తలు రాశాడనే అక్కసుతో శంకర్‌ను హత్య చేయించి, ఆ నేరాన్ని తనపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎస్సీ విభాగం నాయకులు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్‌తో కలసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరాయుడు మాట్లాడుతూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైఎస్సార్ సీపీ అభ్యర్థి విడదల రజనిపై ఓడిపోతాననే భయంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను ప్రత్తిపాటి పుల్లారావు మాయమాటలు నమ్మి మంచివాడని భావించి 2014 ఎన్నికల్లో ఆయన విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం నియోజకవర్గం మొత్తానికి తెలుసన్నారు.
ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి పదవి చేపట్టాక ఆయన, ఆయన భార్య నియోజకవర్గంలో చేస్తున్న అరాచకాల గురించి రాశాడనే కారణంతోనే విలేకరి శంకర్‌ను మంత్రి సామాజిక వర్గీయులతో హత్య చేయించి, ఆ నేరాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు శంకర్‌తో ఎలాంటి ఆస్తి తగాదాలు ఇతర వివాదాలు లేవని, అలాంటి తరుణంలో విలేకరిని హత్య చేయాల్సిన అవసరం తనకు ఏ మాత్రం లేదని వివరించారు.
రేషన్ బియ్యం, మట్టి, ఇసుక తదితర కుంభకోణాలకు పాల్పడిన మంత్రి, ఆయన సతీమణికి మాత్రమే విలేకర్లను చంపాల్సిన అవసరం ఉంటుందన్నారు. తన ప్రమేయం లేకపోవటంతోనే కోర్టు ఆ కేసును కొట్టివేసిన విషయం మంత్రికి బాగా తెలుసన్నారు. మరో విలేకరి మానుకొండ సురేంద్రనా«థ్ ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి కల్పించిన ఘనత కూడా మంత్రి దంపతులదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ హత్య కేసు విషయమై సీబీఐతో విచారణ నిర్వహిస్తే నిజాలు వెలుగుచూస్తాయని, ఈ మేరకు తాను సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
మంత్రికి దమ్ముంటే సీబీఐతో కేసును పునర్విచారణ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. టీడీపీలో జరిగిన అవమానాలు, అపనిందలు భరించలేక తాను ఆ పార్టీని వీడి ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరినట్లు చెప్పారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ నాయకుడు అన్నవరపు కిషోర్ మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గీయులను అణగదొక్కిన మంత్రి ప్రత్తిపాటికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దళితులను, పోలీసులను అరే, ఒరే .. అని సంబోధించిన ఘనత ప్రత్తిపాటి దంపతులకే సొంతమన్నారు.
ప్రకాశం జిల్లా నుంచి వచ్చి చిలకలూరిపేటలో ఉంటున్న ప్రత్తిపాటి పుల్లారావు విడదల రజనిది ఈ నియోజకవర్గం కాదని విమర్శించటం ఆయన అవివేకానికి అద్దం పడుతోందన్నారు. ఆడపిల్లకు మెట్టినిల్లే సర్వస్వం అన్న విషయం ఆయనకు తెలియకపోవటం బాధాకరమన్నారు. విలేకరి హత్య కేసుతో పాటు, మంత్రి అవినీతి కుంభకోణాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు కొప్పుల జ్యోతిరత్నబాబు, బొల్లెద్దు చిన్నా, గడ్డం వెంకట్రావు, సాతులూరి రవి, ముత్తయ్య, మూకిరి కోటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment