హరియాణా : ఢిల్లీలో మాదిరిగానే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం హిసర్‌లో కేజ్రీవాల్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
‘హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి.. గతంలో ఢిల్లీలో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేస్తాం. గత యాభైఏళ్లుగా హరియాణాను అభివృద్ధి చేయటంలో పాలకులు విఫలమయ్యారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించండి’ అని ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీలో తన పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేశానని, ఒక్క అవకాశం ఇస్తే హరియాణాలోనూ అదే అభివృద్ధిని చేపడతాని ఆయన అన్నారు. హరియాణా ప్రభుత్వం ప్రజల మధ్య మతఘర్షణలను పోత్సహిస్తోందని సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఉద్దేశించి కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు.
‘కాంగ్రెస్ అవినీతితో విసిగిపోయిన హరియాణా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. కానీ, బీజేపీ కూడా అదే అడుగుజాడల్లో నడుస్తోంది. కాబట్టి, మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి’ అని ఆయన ప్రజలను కోరారు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ.. రైతులను ఆదుకోవడంలో విఫలమైందని.. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment