
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ
తెలంగాణాలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి గెలవబోతున్నామని ..
హైదరాబాద్: పుల్వామా దాడుల తర్వాత భారత వైమానిక దళాల విజయ పరంపర ఈ దేశాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. శుక్రవారం బండారు దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం తీసుకున్న దౌత్య నిర్ణయాలు పాకిస్తాన్‌ని ఏకాకి చేశాయన్నారు. అభినందన్ భారత్‌కి తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మోదీ చొరవ వల్లే అభినందన్ విడుదల అవుతున్నారని చెప్పారు. దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఒకే తాటిపై ఉన్నాయనే సంకేతాలు ప్రపంచానికి స్పష్టమయ్యాయని అన్నారు. భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటం కేవలం తీవ్రవాదులపైనేనని అన్నారు. పాక్‌పై యుద్ధం చేయాలనేది భారత ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని వ్యాఖ్యానించారు. పాక్ ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసే బాధ్యత పాక్ తీసుకోవాలని సూచించారు. అప్పుడే శాంతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణాలో అన్నిస్థానాల్లో పోటీ
తెలంగాణాలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీలో ఉంటారని వ్యాక్యానించారు. ఎన్నికల కోసం పలు కార్యక్రమాలు రూపొందించామని, అవి విజయవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగినట్లు సర్వేల ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు.
పాలన గాడిలో పడలేదు!
కేసీఆర్ కేబినేట్ విస్తరించినప్పటికీ పరిపాలన గాడిలో పడలేదని విమర్శించారు. కీలక శాఖలన్నీ కేసీఆర్ దగ్గరే పెట్టుకోవడంతో పనులు జరగడం లేదని వివరించారు. పురపాలక శాఖల్లో ఫైల్స్ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయని అన్నారు. యూపీఏలోని పార్టీలు జాతీయస్థాయిలో పొత్తు పెట్టుకుంటాయి.. కానీ రాష్ట్రాల్లో కలిసి ఉండవని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తప్పక 300 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు.