సాక్షి, హైదరాబాద్: ఒక పెద్ద హిట్ సినిమా వచ్చిన తరువాత అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చాలా సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని అనుకుంటున్నా ఈ ఏడాది అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'దేశంలోనే సంస్కృతి సంప్రదాయాల కోసం చేపట్టిన కార్యక్రమం ఇది ఒక్కటే. పంచడం, పుచ్చుకోవడం అనేది ఎక్కడా లేదు.. ఒక్క తెలంగాణ సంప్రదాయంలో మాత్రమే ఉంది. ఇండస్ట్రీలో అందరూ కలిసున్నప్పటికీ.. అభిమానుల వరకు వచ్చేసరికి ఒకరి మీద ఒకరి ద్వేషం కొనసాగుతుంది. హీరోల మధ్య సహృద్భావ వాతావరణం కల్పిస్తే అందరిలో మార్పు వస్తుంది. ఇండస్ట్రీలో కూడా అందరిని పిలిచి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేశాను. తరువాత పార్టీ కూడా ఏర్పాటు చేశాను.
తెలంగాణ సంస్కృతిలో దసరా పండగ రోజున జమ్మి ఆకులు ఇచ్చి పెద్దవాళ్లకి దండం పెట్టడం, తోటి వారిని కౌగిలించుకోవడం సంప్రదాయం. 17 సంవత్సరాలుగా దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం చేపట్టడం గర్వకారణం. పార్లమెంట్‌లో ఎంత తిట్టుకున్న బయట మాట్లాడుకునే తీరు అలయ్ బలయ్ లాంటిదిని' మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment