బాబు మాయలో పడొద్దు | Actor Ali Slams Chandrababu Naidu in Visakhapatnam | Sakshi
Sakshi News home page

బాబు మాయలో పడొద్దు

Published Wed, Apr 3 2019 12:24 PM | Last Updated on Sat, Apr 6 2019 12:53 PM

Actor Ali Slams Chandrababu Naidu in Visakhapatnam - Sakshi

ఆనందపురం/పద్మనాభం(భీమిలి):నాలుగున్నేరళ్ల పాటు ఏ వర్గాన్ని పట్టించుకోని చంద్రబాబు మళ్లీ ఎన్నికల వేళ మహిళల ఓట్ల కోసం పసుపు–కుంకుమ పేరుతో ప్రలోభానికి తెరలేపారని సినీహాస్యనటుడు ఆలీ అన్నారు. బాబు మోసాలను గమనించిన మహిళలు ఈ సారి ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మహిళలే నిర్ణేతలని ఈ సారి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుంటేనే అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. పద్మనాభం మండలంలోని చేరిఖండంలో, ఆనందపురం మండలం నీళ్లకుండీలు జంక్షన్‌లో  మంగళవారం జరిగిన మహిళా ఆత్మీయ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్యాన్‌ గాలి జోరుగా వీస్తుందన్నారు. మే 23న వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించి పండగ చేసుకోవడం ఖాయమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే మాట తప్పని మడం తిప్పని వ్యక్తి అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణను గెలిపించాలన్నారు.

వైఎస్సార్‌ సీపీఎంపీ అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మహిళల ఓట్లే లక్ష్యంగా చంద్రబాబు తాత్కాలిక ప్రయోజనాలు కల్పించి మోసం చేయడానికి వస్తున్నాడని జాగ్రత్తగా ఉండాలన్నారు. పిల్లలు చదువుకు, రోగాల బారిన పడితే ఆస్పత్రులకు వెళ్లడానికి అప్పులు పాలవడంతో పాటు పొలాలను కూడా అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్య, వైద్యం అంతా ఉచితంగా అందుతాయని మహిళలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మాఫీ అంటూ మహిళలు ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ విషయాన్ని పక్కనపెట్టి కొత్త స్కీంలతో మోసం చేయడానికి వస్తున్నారని మహిళలు మోసపోవద్దన్నారు.

మహిళలకు రూ.లక్షలాది రూపాయలు వడ్డీ మాఫీ మొత్తాలను బాకీ పడ్డ చంద్రబాబు ఓట్లు కోసం పసుపు–కుంకుమ అంటూ హడావుడి చేస్తున్నారని మహిళలు గమనించాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించి ఆదుకుంటారని చెప్పారు. పార్టీ పార్లమెంట్‌ జిల్లా మహిళా అధ్యక్షరాలు పీలా వెంకటలక్ష్మి మాట్లాడుతూ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, మరలా జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాజన్న పాలన వస్తుందని చెప్పారు.  కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యం, పార్టీ నగర శాఖ అధ్యక్షురాలు గరికిన గౌరి, ముత్తంశెట్టి జ్ఞానేశ్వరి, ముత్తంశెట్టి ప్రియాంక, కాకర్లపూడి వరహాలరాజు, పద్మనాభం మండల అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు, ముఖ్యనాయకులు సుంకర గిరబాబు, చందక బంగారప్పడు, గోపాలకృష్ణమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement