
రాజ్యసభ ఎంపీ రామచంద్ర రావు
సాక్షి, ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్కార్‌కి మించిన నటుడని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ లోక్ సభలో స్పృహ లేకుండా కాంగ్రెస్‌ని ఉద్దేశించి అసత్యంగా మాట్లాడారని అన్నారు. ఏపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ అవమానించిందనే విషయం శుద్ధ అబద్ధమన్నారు. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మీద మోదీ అపారమైన జాలి, కరుణ చూపించిందనందుకు ధన్యవాదాలు అని అన్నారు. అంజయ్యని కాంగ్రెస్ చాలా అవమానించిందని మోదీ చెబుతున్నారని, లక్ష రూపాయల సూట్, కళ్ల అద్దాలు పెట్టుకుని అంజయ్య ఎప్పుడూ లేరని అన్నారు.
అంజయ్య మామూలు కూలీగా, సామాన్యుడిగా బ్రతికేవారని అన్నారు. అంజయ్య 1957 నుంచి చనిపోయేంత వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారని చెప్పారు. ఆయనకి కుల బలం లేదని, కానీ ప్రజాబలం ఉందని వ్యాఖ్యానించారు. అంజయ్య చనిపోయాక కూడా ఆయనను కాంగ్రెస్ పార్టీ గౌరవించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంజయ్యకి ఇన్ని చేసినా ఎస్సీ అయిన అంజయ్యని అవమానించారని మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
పీవీ నరసింహారావు గురించి కూడా మోదీ చాలా బాధ పడ్డారని ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావుకి ధన బలం లేదు, కుల బలం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రోత్సాహం వలన ఆంధ్రప్రదేశ్‌కి నరసింహారావు ఎంతో మేలు చేశారని చెప్పారు. పీవీ నరసింహారావు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నారని అన్నారు. అద్వానీకి మనకంటే ఎక్కువ మోదీ గురించి ఎక్కువ తెలుసునని, అలాంటి ఆయనను బొటన వేలితో తొక్కి పెట్టారని ఆరోపించారు. అద్వానీ మీద సీబీఐ కేసు పెట్టి ఈ వయసులో కూడా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. అద్వానీ ఆ రోజు చేపట్టిన పనుల వల్లే బీజేపీకి జవసత్వాలు వచ్చాయని గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు బీజేపీ పనికిరాని డాక్యుమెంట్లు ఇచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు 202 సీట్లు మాత్రమే ఉన్నాయని, కానీ బీజేపీ అప్పుడు అడ్డుపడి ఉంటే తెలంగాణ బిల్ పాస్ అయ్యేది కాదని స్పష్టం చేశారు. రాజ్యసభలో తాను, తన మిత్రులు కలిసి బీజేపీ వారిని బిల్లుని అడ్డుకోమని వేడుకున్నామని, కానీ ఆరోజు కాంగ్రెస్ పాత్ర చాలా చిన్నదని, బీజేపీ పాత్ర చాలా పెద్దదని వ్యాఖ్యానించారు. వారి సవరణలు అన్నీ ఉపసంహరించుకుని బిల్లుకు మద్దతు పలికారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment