4 వేల కి.మీ.; మరో వారసుడి ప్రజాయాత్ర! | Aditya Thackeray Begins 4000 Km Maharashtra Tour Ahead Assembly Elections | Sakshi
Sakshi News home page

4 వేల కి.మీ.; మరో వారసుడి ప్రజాయాత్ర!

Published Thu, Jul 18 2019 5:13 PM | Last Updated on Thu, Jul 18 2019 5:40 PM

Aditya Thackeray Begins 4000 Km Maharashtra Tour Ahead Assembly Elections - Sakshi

ముంబై : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న మరాఠా పార్టీ ఈ దఫా ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివసేన చీఫ్‌ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, పార్టీ యూత్‌వింగ్‌ నాయకుడు ఆదిత్య ఠాక్రేను సీఎం అభ్యర్థిగా బరిలో దింపాలని యోచిస్తోంది. ఆదిత్యను భవిష్యత్‌ నాయకుడిగా తీర్చిదిద్దేందుకు ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌తో శివసేన ఒప్పందం కుదర్చుకున్నట్లుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రే గురువారం ప్రజాయాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గడపగడపకూ శివసేన విధానాలను చేర్చాలనే ఉద్దేశంతో జన ఆశీర్వాద యాత్ర పేరిట ఆదిత్య ఠాక్రే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. పార్టీ సీనియర్‌ నేతలు ఏక్‌నాథ్‌ షిండే, రామ్‌దాస్‌ కదమ్‌లతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పార్టీ శ్రేణులు వెంటరాగా ప్రత్యేక వాహనం(కారు)లో ఆదిత్య ఠాక్రే బయల్దేరారు. జలగాన్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక పర్యటనకు సంబంధించిన విశేషాలను ఆదిత్య ఠాక్రే ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

చదవండి : మహారాష్ట్ర సీఎంగా ఆదిత్య ఠాక్రే!?

జన ఆశీర్వాద యాత్ర గురించి ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ...‘ మహారాష్ట్రలోని ప్రతీ ఇంటికి శివసేనను చేర్చాలనే  సంకల్పంతో నేడు ఈ యాత్ర ప్రారంభించాను. సరికొత్త మహారాష్ట్ర నిర్మాణం మాతోనే సాధ్యం. శివసేన యువకులు, రైతులు, మహిళల పక్షపాతి. ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుంది. వారి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఓట్లను అడిగేందుకు నేను ఈ యాత్ర చేపట్టలేదు. నా దృష్టిలో ఇది ఒక పవిత్ర తీర్థ యాత్ర. సమస్యలను ఎలా పరిష్కరించాలో నా తండ్రి, తాతయ్య నుంచి నేర్చుకున్నాను. నేటి నుంచి దానిని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తాను’ అంటూ భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు.

చదవండి : అమిత్‌ షా హామీ ఇచ్చారు..నెక్ట్స్ సీఎం!

తనేం చేస్తున్నాడో తనకు తెలుసు..
జన ఆశీర్వాద యాత్ర గురించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ..‘ తను చేపట్టిన ఈ యాత్రపై ఆదిత్య ఠాక్రేకు పూర్తి అవగాహన, స్పష్టత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో శివసేనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసేందుకు, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయమని ఆదిత్య ప్రజలకు విఙ్ఞప్తి చేస్తారు. శివసేన విధానాల గురించి సభల్లో ప్రసంగిస్తారు. ఆదిత్య ఠాక్రే నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా’  అని వ్యాఖ్యానించారు. కాగా కాబోయే మహారాష్ట్ర సీఎం ఆదిత్య ఠాక్రే అంటూ సంజయ్‌ రౌత్‌ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పార్టీలోని సీనియర్‌ నాయకులు సహా పలువురు యువ నాయకులు కూడా ఉద్ధవ్‌ ఠాక్రే స్థానాన్ని భర్తీ చేసి ముఖ్యమంత్రి కాగల సత్తా ఆదిత్యకు మాత్రమే ఉందని అభిప్రాయపడుతున్నారు. అన్నీ సజావుగా జరిగితే 29 ఏళ్ల ఈ యువ నాయకుడే సీఎం అవుతాడంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ వారసుడిగా రంగంలోకి దిగిన ఉదయనిధి స్టాలిన్‌ కూడా ప్రజాయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

చదవండి : ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement