సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లను దక్కించుకునేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చి హిందుత్వ ఎజెండాను ముందుకు నెట్టారు. రాష్ట్రంలోని చిన్నా, చితక పార్టీలను చేరదీసి ప్రధాన ప్రతిపక్షాలైన సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలను, ముఖ్యంగా సమాజ్‌వాది పార్టీని దెబ్బతీసేందుకు పెద్ద వ్యూహమే పన్నారు.
సమాజ్‌వాది పార్టీ నుంచి విడిపోయి ఇటీవల ‘సమాజ్‌వాది సెక్యులర్ మోర్చా’ను ఏర్పాటు చేసిన శివపాల్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ బాబాయి)కు మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఖాళీ చేసిన ప్రభుత్వ బంగ్లాను ఆదిత్యనాథ్ కేటాయించారు. రాజాభయ్యాగా పేరు పొందిన స్వతంత్య్ర శాసన సభ్యుడు రఘురాజ్ ప్రతాప్ సింగ్‌ను చేరదీసి సమాజ్‌వాది పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖాళీ చేసిన ప్రభుత్వ బంగ్లాను కేటాయించారు. అఖిలేష్ యాదవ్‌తో పడక శివపాల్ యాదవ్ బయటకు వచ్చి బీజేపీలో చేరాలని అనుకోవడం, ఆయన తరఫున ఎస్పీ మాజీ నాయకుడు అమర్ సింగ్ మంతనాలు కూడా జరపడం తెల్సిందే. అయితే పార్టీలో చేరే బదులు కొత్త పార్టీని ఏర్పాటు చేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాది ఓట్లను చీల్చాలని, అందుకు ప్రతిఫలం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఆయన్ని ఒప్పించిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. బీజేపీ సూచనల మేరకు శివపాల్ యాదవ్ కొత్త పార్టీని ఏర్పాటు చేయడంతో అందుకు నజరానాగానే విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాను ఇప్పుడు కేటాయించారు.
సమాజ్‌వాది సెక్యులర్ మోర్చాకు రాష్ట్రంలోని 30 జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు. సమాజ్‌వాది పార్టీకి మొదటి నుంచి బలం ఉన్న ఈ 30 జిల్లాలో ఇప్పుడు యాదవ్‌లు, ముస్లింలు సెక్యులర్ మోర్చా వైపు వెళ్లే అవకాశం ఉందని అటు మోర్చా అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ఇటు బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాల్లో ఎస్పీ విజయావకాశాలను మోర్చా దిబ్బతీస్తుందని, తద్వారా తాము విజయం సాధించవచ్చన్నది బీజేపీ, ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి అంచనా. ఎస్పీలో తనకు అన్నుదన్నుగా నిలిచిన నాయకులంతా ఎన్నికల నాటికి తన మోర్చాలో చేరుతారని, అందుకు అవసరమైతే ధన సహాయం కూడా బీజేపీ చేస్తుందని శివపాల్ యాదవ్ నమ్ముతున్నారు.
ఇక ‘కుండా’ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆరుసార్లు స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఇటీవల జనసత్తా పార్టీని ఏర్పాటు చేశారు. ఆదిత్యయోగి ప్రోద్బలంతోనే ఆయన ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఠాకూర్ల సమాజంలో మంచి బలమే ఉంది. ప్రతాప్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆయన ప్రభావితం చేయగలరు. కొత్త పార్టీని ఏర్పాటు చేసినందుకు నజరానాగానే ఆయనకు కూడా ప్రభుత్వం నివాసం దక్కిందని భావించవచ్చు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వరుసగా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతూ రావడంతో ఈ కొత్త వ్యూహాలకు ఆదిత్యయోగి శ్రీకారం చుట్టారని గ్రహించవచ్చు.
వ్యూహాలు ఫలిస్తాయా?
శివపాల్ యాదవ్ కొత్త పార్టీ ప్రభావం అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీపై కొంత ప్రభావం చూపించవచ్చేమోగానీ, విజయావకాశాలను దెబ్బతీసేంతగా ఉండదని, అందుకు కారణం ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు పూర్తిగా కుమారుడి పక్షాన నిలబడడమేనని కాన్పూర్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఏకే వర్మ అభిప్రాయపడ్డారు. గతంలో పార్టీలోని శివపాల్ యాదవ్ అసమ్మతి వర్గానికే ములాయం సింగ్ యాదవ్ మద్దతిచ్చిన విషయం తెల్సిందే. పైగా మాస్ జనాల్లో శివపాల్ యాదవ్‌కు ఆదరణ లేదని ఆయన చెప్పారు. ప్రతాప్ సింగ్ ప్రభావం కూడా ఒక్క నియోజకవర్గానికే పరిమితం అని తెలిపారు.
ఇక్కడ ఓటర్ల మన స్థత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఓటర్లు సాధారణంగా విజయం సాధిస్తుందనుకున్న పార్టీకే ఓటు వేస్తారని, ఇలాంటి చిన్నా, చితక పార్టీలకు ఓటు వేసి ఓటును వృధా చేసుకోవాలని కోరుకోరని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment