Adityanath Yogi
-
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..
తొలిసారిగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ బలమైన స్థానం నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు అఖిలేశ్ యాదవ్ వచ్చే నెలలో ఎన్నికలలో మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పార్టీ వర్గాల అందించిన ఈ సమాచారాన్ని అతని మామ రాజ్యసభ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఈ రోజు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఆయన మేనల్లుడు మెజార్టీ ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే 1993 నుంచి కర్హాల్ వాసులు ప్రతి ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. కానీ బీజేపి 2002 ఎన్నికలలో ఆ స్థానాన్ని గెలిచినప్పటికీ, 2007లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీ కర్హాల్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ప్రస్తుతం కర్హాల్ సోబరన్ యాదవ్ ఆధ్వర్యంలో ఉంది. అంతేకాదు అఖిలేశ్ తండ్రి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఐదు అసెంబ్లీ స్థానాల్లో మైన్‌పురి లోక్‌సభ సీటు ఒకటి కావడం విశేషం. పైగా యూదవ్ స్వగ్రామమైన సైఫాయ్కి 5 కి.మీ దూరంలోనే కర్హాల్ ఉంది. అధికార పార్టీని గద్దె దింపేందకు ప్రాంతీయ పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్న అఖిలేశ్ యాదవ్ తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్నారు. అయితే ఆయన గతేడాది నవంబర్ నెలలో అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనని చెప్పారు. కాగా, బీజేపీ యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి పోటీకి దిగనుండటంతో అఖిలేశ్ యాదవ్ సైతం ఒత్తిడిని అధిగమించేందుకు పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అఖిలేశ్ ప్రస్తుతం యూపీలోని అజంగఢ్ నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్నా సంగతి తెలిసిందే. కాగా, అఖిలేశ్ యాదవ్ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2012లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎంఎల్సీ హోదాలోనే ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అలాగే ఆదిత్యనాథ్ కూడా బలమైన స్థానం నుంచే పోటీచేస్తున్నారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి.. ఆ నియోజకవర్గంలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు. (చదవండి: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక!) కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’ -
యూపీలో నేరగాళ్ల ఇష్టారాజ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్న పోలీసుల నివేదికను తప్పుపట్టిన ఆమె.. యూపీలో నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర గణాంకాలను తారుమారు చేసిన పోలీసులు నేరాల సంఖ్య తగ్గిందంటూ చెబుతున్నారని అఖిలేశ్ విమర్శించారు. శనివారం ప్రియాంక ట్విట్టర్లో..ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్లు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. నేర ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. నేరగాళ్లకు సర్కారు లొంగిపోయిందా?’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతోపాటు రాష్ట్రంలో నేరాలపై పలు నివేదికలను జత చేశారు. దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్ స్పందించారు. ‘మా ప్రభుత్వం నేరగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసింది. నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నేరాలు తగ్గాయి’ అని పేర్కొన్నారు. -
ఈ108 మంది చావుకు ఎవరు బాధ్యులు!?
సాక్షి, న్యూఢిల్లీ : ‘అవును! ఇంతటి విషాధానికి ఆదిత్యనాథ్ యోగియే బాధ్యత వహించాలి. ఇది గత ప్రభుత్వం హయాంలో జరిగి ఉంటే అది సమాజ్‌వాది పార్టీ బాధ్యతగా మేము కచ్చితంగా భావించేవాళ్లం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదు? వారి ప్రభుత్వం ఆధ్వర్యంలోనేగదా, పోలీసు వ్యవస్థ ఉన్నది. పైగా ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక పోలీసులకు స్వేచ్ఛ పెరిగింది. పోలీసుల అండదండలతోనే గదా! ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య కల్తీ మద్యం ఏరులై పారుతోంది’ అని కల్తీ మద్యం కారణంగా ధరమ్ పాల్ అనే 51 ఏళ్ల సోదరుడిని, సోను అనే 30 ఏళ్ల మేనల్లుడిని కోల్పోయిన శివపూర్ రైతు సుధీర్ కుమార్ మీడియాతో వ్యాఖ్యానించారు. చెవిటి, మూగ అయిన సోను దినసరి కూలి అని, మతిస్థిమితం లేని ఆయన తల్లిదండ్రులు ఆయనపైనే ఆధారపడి బతుకుతున్నారని స్థానికులు తెలిపారు. ‘అక్రమ మద్యం వ్యాపారులను సమూలంగా నిర్మూలించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి విషాధ సంఘటనలకు తెరపడదు. పలానా, పలానా ముఠాలు కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నాయని నేను స్వయంగా మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా ఈ విషయం కల్తీ వ్యాపారులకు తెలిసి పోయింది. వారు పలుసార్లు నాకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించారు. అప్పటి నుంచి నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా మానేశాను’ అని సహ్రాన్‌పూర్‌లో మద్యం ‘డీఅడిక్షన్’ కేంద్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త మమత ఆరోపించారు. మంగళవారం ఉదయం ధన్పాల్ సింగ్ మరణంతో కల్తీ మద్యం దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 108కి చేరుకుంది. 48 ఏళ్ల ధన్పాల్ సింగ్ దినసరి కూలి. ఆయన శవానికి సహరాన్‌పూర్‌లోని సేత్ బల్దేవ్ దాస్ బజోరియా జిల్లా ఆస్పత్రిలో అటాప్సీ నిర్వహించిన తర్వాత ఆస్పత్రి వర్గాల నుంచి ఆయన శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా ఆయన బంధువులు పోలీసులను ప్రాధేయపడ్డారు. ‘మీ ఒక్క శవమే కాదు, బోలెడు శవాలు ఉన్నాయి. అప్పగించడానికి ముందు బోలెడంతా తతంగం ఉంటుంది’ అని పోలీసు అధికారులు బంధువులపై విసుక్కున్నారు. ధన్పాల్ శవాన్ని పోలీసు వ్యాన్ ఎక్కించారు. ‘నా అన్న చావుకు పోలీసులు, అధికార యంత్రాంగం కారణం కాకపోతే, ఎవరు కారణం?’ అంటూ ధన్పాల్ సింగ్ తమ్ముడు రాకేశ్ సింగ్ అడిగిన ప్రశ్న ఒక్క మీడియా తప్పించి ఎవరు వినిపించుకోలేదు. ఉత్తరాఖండ్ సరిహద్దు సమీపంలోని బలుపూర్ గ్రామంలో ఈ ఫిబ్రవరి ఏడవ తేదీన ఓ ఇంటిలో జరిగిన 13వ రోజు కర్మ సందర్భంగా గ్రామస్థులు, బంధువులు కల్తీ మద్యం సేవించారు. కల్లు తిరగడం, కడుపునొప్పి, వాంతులతో వారంతా బాధపడ్డారు. వారిలో సకాలంలో ఆస్పత్రిలో చేరి బతికిన వాళ్లు తక్కువ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవానాన్ని అడ్డుకోలేక పోయింది. ఢిల్లీ, గుజరాత్ తరహాలో కల్తీ మద్యం వ్యాపారులకు మరణ శిక్ష విధించేలా ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2017, డిసెంబర్లో ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అయినా ఫలితం లేదు. 2018, జనవరి బారబంకిలో కల్తీ మద్యానికి 11 మంది మరణించారు. గత మే నెలలో కాన్పూర్‌లో కల్తీ మద్యానికి పది మంది మరణించిన నేపథ్యంలో వినయ్ సింగ్ అనే వ్యక్తి గిడ్డంగి మీద పోలీసులు దాడిచేయగా, కల్తీ మద్యం సరకులు దొరికాయి. ఆయన సమాజ్‌వాది పార్టీకి చెందిన మాజీ మంత్రి రామ్ స్వరూప్ సింగ్ గౌర్‌కు మనవడని తేలింది. వినయ్ సింగ్ సోదరుడు నీరజ్ 2017లో అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా కల్తీ మద్యం సరఫరా చేసే ముఠాలు మారుతాయి తప్ప మద్యం అక్రమ వ్యాపారం ఆగిన దాఖలాలు లేవని ప్రజలు చెబుతున్నారు. -
‘పేరు’ గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2017లో ఆదిత్యనాథ్ యోగిని ఎంపిక చేసినప్పుడు ‘కరడుగట్టిన హిందూత్వ’ వాదిని ఎంపిక చేయడానికి తామేమి వెనకాడమని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. అప్పటికీ గోరఖ్‌పూర్ ఆలయానికి పీఠాధిపతిగా కొనసాగుతున్న ఆయనపై పలు దొమ్మి కేసులతోపాటు మత ఘర్షణలు, హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారంటూ పలు కేసులు ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చాన తనపై ఉన్న అన్ని కేసులను తానే స్వయంగా కొట్టివేసుకున్నారు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను పాకిస్తాన్ టెర్రరిస్టుగా అభివర్ణించి, మసీదుల్లో హిందూ విగ్రహాలను ప్రతిష్టిస్తానంటూ ఆదిలోనే వివాదాస్పదుడిగా ముద్ర పడిన యోగి ఆదిత్యనాథ్ యూపీలోని అన్ని ముస్లిం ప్రాంతాల పేర్లను తొలగించి వాటి స్థానంలో హిందూ పేర్లను ప్రవేశ పెడుతూ పోతున్నారు. గోరఖ్‌పూర్‌లోని భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయానికి మహాయోగి గోరఖ్‌నాథ్ పేరును పెట్టారు. ముఘల్సరాయ్ రైల్వేస్టేషన్‌కు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ అని, మొఘల్ చక్రవర్తి అక్బర్ కనుగొన్న అలహాబాద్ నగరం పేరు మార్చి ప్రయాగ్‌రాజ్ పేరు పెట్టారు. ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్లు దీపావళి వేడుకల్లో ఆదిత్యనాథ్ ప్రకటించారు. గతంలోనే ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, హుమాయున్ నగర్‌ను హనుమాన్ నగర్‌గా మార్చారు. తాజ్ మహల్ పేరును కూడా మార్చి రామ్ మహల్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రామ రాజ్యాన్ని స్థాపిస్తానని ముఖ్యమంత్రయిన కొత్తలో ప్రకటించిన ఆయన పేర్ల ఆలోచనలో పడి ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయినట్లున్నారు. ఒక్క భారత్‌లోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే పేద ప్రాంతంగా, పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన రాష్ట్రంగా యూపీ ఇప్పుడు గుర్తింపు పొందింది. సబ్ సహారా ఆఫ్రికాలో పుట్టడం కన్నా యూపీలో ఓ శిశువు జన్మిస్తే నెల లోపల ఆ శిశువు మరణించే అవకాశాలు రెండింతలు ఉన్నాయని ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్ తాజా సంచికలో వెల్లడించింది. పొరుగునున్న నేపాల్‌కన్నా యూపీలో మనిషి ఆయుషు ప్రామాణం తక్కువ. నైజీరియా, బంగ్లాదేశ్‌లకన్నా సరాసరి రాష్ట్ర జీడీపీ రేటు తక్కువ. యూపీలోని కాన్పూర్ నగరాన్ని ప్రపంచంలోనే అతి కాలుష్యనగరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలనే ప్రకటించింది. ఇక మానవ అభివృద్ధి సూచికలో పాకిస్థాన్ కన్నా వెనకబడి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై యోగి దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
ఆదిత్యనాథ్ ఎత్తులు, జిత్తులు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లను దక్కించుకునేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చి హిందుత్వ ఎజెండాను ముందుకు నెట్టారు. రాష్ట్రంలోని చిన్నా, చితక పార్టీలను చేరదీసి ప్రధాన ప్రతిపక్షాలైన సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలను, ముఖ్యంగా సమాజ్‌వాది పార్టీని దెబ్బతీసేందుకు పెద్ద వ్యూహమే పన్నారు. సమాజ్‌వాది పార్టీ నుంచి విడిపోయి ఇటీవల ‘సమాజ్‌వాది సెక్యులర్ మోర్చా’ను ఏర్పాటు చేసిన శివపాల్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ బాబాయి)కు మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఖాళీ చేసిన ప్రభుత్వ బంగ్లాను ఆదిత్యనాథ్ కేటాయించారు. రాజాభయ్యాగా పేరు పొందిన స్వతంత్య్ర శాసన సభ్యుడు రఘురాజ్ ప్రతాప్ సింగ్‌ను చేరదీసి సమాజ్‌వాది పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖాళీ చేసిన ప్రభుత్వ బంగ్లాను కేటాయించారు. అఖిలేష్ యాదవ్‌తో పడక శివపాల్ యాదవ్ బయటకు వచ్చి బీజేపీలో చేరాలని అనుకోవడం, ఆయన తరఫున ఎస్పీ మాజీ నాయకుడు అమర్ సింగ్ మంతనాలు కూడా జరపడం తెల్సిందే. అయితే పార్టీలో చేరే బదులు కొత్త పార్టీని ఏర్పాటు చేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాది ఓట్లను చీల్చాలని, అందుకు ప్రతిఫలం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఆయన్ని ఒప్పించిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. బీజేపీ సూచనల మేరకు శివపాల్ యాదవ్ కొత్త పార్టీని ఏర్పాటు చేయడంతో అందుకు నజరానాగానే విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాను ఇప్పుడు కేటాయించారు. సమాజ్‌వాది సెక్యులర్ మోర్చాకు రాష్ట్రంలోని 30 జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు. సమాజ్‌వాది పార్టీకి మొదటి నుంచి బలం ఉన్న ఈ 30 జిల్లాలో ఇప్పుడు యాదవ్‌లు, ముస్లింలు సెక్యులర్ మోర్చా వైపు వెళ్లే అవకాశం ఉందని అటు మోర్చా అధ్యక్షుడు శివపాల్ యాదవ్, ఇటు బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాల్లో ఎస్పీ విజయావకాశాలను మోర్చా దిబ్బతీస్తుందని, తద్వారా తాము విజయం సాధించవచ్చన్నది బీజేపీ, ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి అంచనా. ఎస్పీలో తనకు అన్నుదన్నుగా నిలిచిన నాయకులంతా ఎన్నికల నాటికి తన మోర్చాలో చేరుతారని, అందుకు అవసరమైతే ధన సహాయం కూడా బీజేపీ చేస్తుందని శివపాల్ యాదవ్ నమ్ముతున్నారు. ఇక ‘కుండా’ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆరుసార్లు స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఇటీవల జనసత్తా పార్టీని ఏర్పాటు చేశారు. ఆదిత్యయోగి ప్రోద్బలంతోనే ఆయన ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఠాకూర్ల సమాజంలో మంచి బలమే ఉంది. ప్రతాప్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆయన ప్రభావితం చేయగలరు. కొత్త పార్టీని ఏర్పాటు చేసినందుకు నజరానాగానే ఆయనకు కూడా ప్రభుత్వం నివాసం దక్కిందని భావించవచ్చు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వరుసగా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతూ రావడంతో ఈ కొత్త వ్యూహాలకు ఆదిత్యయోగి శ్రీకారం చుట్టారని గ్రహించవచ్చు. వ్యూహాలు ఫలిస్తాయా? శివపాల్ యాదవ్ కొత్త పార్టీ ప్రభావం అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీపై కొంత ప్రభావం చూపించవచ్చేమోగానీ, విజయావకాశాలను దెబ్బతీసేంతగా ఉండదని, అందుకు కారణం ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు పూర్తిగా కుమారుడి పక్షాన నిలబడడమేనని కాన్పూర్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఏకే వర్మ అభిప్రాయపడ్డారు. గతంలో పార్టీలోని శివపాల్ యాదవ్ అసమ్మతి వర్గానికే ములాయం సింగ్ యాదవ్ మద్దతిచ్చిన విషయం తెల్సిందే. పైగా మాస్ జనాల్లో శివపాల్ యాదవ్‌కు ఆదరణ లేదని ఆయన చెప్పారు. ప్రతాప్ సింగ్ ప్రభావం కూడా ఒక్క నియోజకవర్గానికే పరిమితం అని తెలిపారు. ఇక్కడ ఓటర్ల మన స్థత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఓటర్లు సాధారణంగా విజయం సాధిస్తుందనుకున్న పార్టీకే ఓటు వేస్తారని, ఇలాంటి చిన్నా, చితక పార్టీలకు ఓటు వేసి ఓటును వృధా చేసుకోవాలని కోరుకోరని ఆయన చెప్పారు. -
మీ మనసులో ఏముందో చెప్పండి
లక్నో/న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ జోక్యం చేసుకోవడంపై ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముందు ఆయన తన ఆలోచనేమిటనేది విధిగా వెల్లడించాలని డిమాండ్ చేశాయి. ఈ వివాదం విషయంలో షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు చైర్మన్ వాసిం రజ్వి చేసిన వ్యాఖ్యలపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అవి అనవరసమంటూ మండిపడ్డాయి. ‘ఈ కేసులోని అన్నిపక్షాలతోనూ రవిశంకర్ సంప్రదింపులు జరుపుతారని చెబుతున్నారు. అయితే ఆయన ఇప్పటిదాకా తమను సంప్రదించలేదు’ అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) చైర్మన్ మౌలానా వలి రెహమాని బుధవారం స్పష్టం చేశారు. 12 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఒకసారి యత్నించారని, అయితే వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని సూచించారని గుర్తుచేశారు. ఈసారి ఆయన ఏ ఫార్ములాతో వస్తున్నారో చెప్పాలని, ఆ తర్వాత తమ ప్రతినిధి ఆయనతో సంప్రదింపులు జరుపుతారని అన్నారు. సీఎంతో రవిశంకర్ భేటీ రవిశంకర్ బుధవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వివాదాస్పద అయోధ్య స్థలాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. రవిశంకర్.. సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారని, ఈ భేటీ దాదాపు 20 నిమిషాలపాటు జరిగిందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఆదిత్యనాథ్‌తోపాటు రవిశంకర్..దిగంబర్ అఖాడాకు చెందిన సురేశ్ దాస్, జనమేజయ్ శరణ్ (రసిక్పీఠ్), రాజారాంచంద్ర ఆచార్య (నిర్మోహి అఖాడా)లతోపాటు అనేక హిందూ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇదొక ఆరంభం. నేను ఎంతో ఆశాభావంతో ఉన్నా. ఎవరూ మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించడం లేదు. అందరితోనూ అయోధ్య వివాదంపై సంప్రదింపులు జరుపుతా’ అని చెప్పారు. -
యూపీ సీఎం కార్యాలయానికి కాషాయం రంగు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ నిత్యం కాషాయ దుస్తులు ధరిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కార్యాలయ భవనానికీ కాషాయ హంగులు అద్దనున్నారు. సీఎం కార్యాలయమున్న లాల్‌బహదూర్ శాస్త్రి భవన్‌కు కాషాయం పెయింట్ వేయాలని నిర్ణయించారు. ఆదిత్యనాథ్ కార్యాలయంలోని టవళ్లు, టేబుల్ కవర్లు కూడా కాషాయ రంగులోనే ఉంటాయి. ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల కోసం పలు రంగుల్ని పరిశీలించినప్పటికీ కాషాయమే అత్యుత్తమంగా తేలిందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమర్నాథ్ అగర్వాల్ స్పందిస్తూ..‘ ఏ రంగు కూడా చెడ్డది కాదు. కానీ ప్రభుత్వ కార్యాలయాకు సైతం కాషాయం రంగు వేయడం మొత్తం పరిపాలనా వ్యవస్థను కాషాయీకరణం చేయడమే’ అని మండిపడ్డారు. ఇటీవల యోగి ఆవిష్కరించిన 50 బస్సులకు కూడా కాషాయం రంగు వేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ శిలాఫలకాలను కాషాయ వస్త్రాలతో అలంకరించడంతో పాటు బెలూన్లు కూడా కాషాయ రంగులోని వాటినే వాడారు. చివరికి రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు కాషాయ రంగులో ఉన్న బ్యాగులనే అందజేశారు. అంతేకాకుండా యోగి అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా అందించిన బుక్లెట్లను, ప్రభుత్వం అందించిన సమాచార డైరీలను కూడా ఈ రంగుతోనే ముద్రించారు. -
సీఎం వస్తున్నారు.. స్నానం చేసిరండి
లఖ్‌నవూ: మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనలో దారుణం జరిగింది. కులవ్యవస్థను రూపుమాపాలనే ప్రకటనలు కేవలం పేపర్లకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ అధికారులు మరో నిర్వాకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత వర్గాలను కలుస్తున్నారని తెలిసి అధికారులు, వారికి షాంపూలు, సోపులు ఇచ్చి ‘శుభ్రంగా స్నానం చేయండి’ అని ఆదేశించారట. వివరాల్లోకి వెళ్తే యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ గురువారం యూపీలోని కుషినగర్‌లో పర్యటించారు. కొద్దిసేపట్లో కుషినగర్‌కి చేరుకుంటారనగా జిల్లా అధికారులు స్థానికులైన ముషర్ వర్గానికి సబ్బులు, షాంపూలు అందించి ముఖ్యమంత్రిని కలిసే ముందు స్నానం చేసి రావాలని ఆదేశించారు. ముషర్ వర్గాన్ని అతి తక్కువ వర్గంగా భావిస్తారు. ఎలుకలను పట్టుకొని జీవిస్తారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారని తెలియగానే అప్పటికప్పుడు విద్యుద్దీపాలు, రోడ్లు, టాయిలెట్లు ఏర్పాటు చేశారు.గతంలో కూడా బీఎస్ఎఫ్ జవాను ప్రేమ్‌సాగర్ కుటుంబాన్ని యోగి కలవనున్నారని తెలిసి అప్పటికప్పుడు వారింట్లో సోఫా, ఏసీ, కార్పెట్లు ఏర్పటు చేశారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే వాటన్నింటినీ వాటన్నింటిని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. -
యోగీపై బీజేపీ అసంతృప్తి
► యోగీ యువసేనపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయల్లో ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఓ సంచలనం. కేవలం రెండు నెలల కాలంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అంతే కాదు ఆయనకంటూ ప్రత్యేకమైన ఓ యువసేన ఉంది. అదే హిందూ యువ వాహిని. అయితే ప్రస్తుతం ఈ యువ వాహిని పై బీజీపీ అధిస్ఠానం అసంతృప్తిగా ఉంది. ఇది ఆర్ఎస్ఎస్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటోంది. అయితే దీనిపై ఆర్ఎస్ఎస్, బీజేపీలు అసంతృప్తిగా ఉన్నాయి. హిందూ వాహిని ఆదిత్యానాథ్ ఆలోచన నుంచి వచ్చింది. గోరక్‌పూర్, ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి దీని ప్రభావం పూర్వాంచల్ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేది. తాజాగా హిందూ వాహిని, యోగి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం మొదలైంది. ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఇందులోచేరడం మెదలైప్పటినుంచి ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉంది. దీనిపై రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య స్పందించారు. వాహిని పేరు ఎత్తకుండా, దానిని గుర్తు చేసేలా పెరుగుతున్న ఇతర యువసేనలను సహించేదిలేదని, పార్టీ పరంగా అన్నీ ప్రాధాన్యతలు మొదట పార్టీకి, కార్యకర్తలకు ఇవ్వాలన్నారు. యోగి నామినేషన్ సమయంలో కూడా ఇలాంటి స్వంతత్ర వాహినులను బీజేపీ నేతలు వ్యతిరేకించారు. హిందూ వాహిని నెమ్మదిగా ఆర్ఎస్ఎస్లో కలుస్తుందని భావించారు. గతంలో రామ మందిర నిర్మాణం కోసం హిందు పరిషత్ చేస్తున్న ఉద్యమంలో కూడా ఆదిత్యానాథ్, ఆయన పూర్వికుడు అవైధ్యానాథ్ ప్రత్యేకంగా గుర్తింపు పోందారు. తాజాగా హిందూ యువ వాహిని భారీ ప్రణాళిక రచింది. ఏడాది పాటు పార్టీలో నియామకాలు ఆపేయాలని భావిస్తోంది. దీనిపై ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
బీఫ్ బదులు మటన్, చికెన్
లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): ముఖ్య మంత్రి ఆదిత్యా నాథ్ యోగి తీసుకున్న గోమాంస నిషేధంతో సింహాలకు బీఫ్ బదులు మటన్, చికెన్ పెట్టనున్నారు. అక్కడి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాటికి గొడ్డు మాంసం కరువైంది. దీంతో అధికారులు మటన్, చికెన్ అందజేస్తున్నారు. అయితే, దీని కారణంగా అక్కడి ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ భారం పడుతోందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లఖ్‌నవూ జూ, ఇటావాలోని సఫారీలో సింహాలున్నాయి. ఒక్కో సింహానికి రోజుకు సగటున 10కిలోల గొడ్డుమాంసం పెడుతుంటారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు రోజులుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని పశుమాంసం దుకాణాలు మూతబడ్డాయి. ఈ కారణంగా జూలోని సింహాలతోపాటు పులులు, నక్కలు, తోడేళ్లు, చిరుతలు, సివంగులకు కూడా మాంసం లభించటం గగనంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు కోడి, మేక లేక గొర్రెల మాంసాన్ని అందిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలతో గొడ్డుమాంసం కాంట్రాక్టర్‌ను మార్చి, మటన్, చికెన్ కాంట్రాక్టర్ ను వెతకాల్సి ఉందని చెప్పారు. ఈలోగా ప్రభుత్వ నిర్ణయంలో ఏమాత్రం మినహాయింపు లభించినా తిరిగి పశుమాంసాన్నే తెప్పిస్తామని అన్నారు. స్థానిక మాంసం దుకాణాలు మూతబడిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారుల నుంచి పశుమాంసం తెప్పించేందుకు గల అవకాశాలను అన్వేషిస్తున్నామని ఇటావా సింహాల సఫారీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ పటేల్ తెలిపారు.