బీఫ్ బదులు మటన్, చికెన్
Published Fri, Mar 24 2017 5:49 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): ముఖ్య మంత్రి ఆదిత్యా నాథ్ యోగి తీసుకున్న గోమాంస నిషేధంతో సింహాలకు బీఫ్ బదులు మటన్, చికెన్ పెట్టనున్నారు. అక్కడి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాటికి గొడ్డు మాంసం కరువైంది. దీంతో అధికారులు మటన్, చికెన్ అందజేస్తున్నారు. అయితే, దీని కారణంగా అక్కడి ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ భారం పడుతోందని అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో లఖ్‌నవూ జూ, ఇటావాలోని సఫారీలో సింహాలున్నాయి. ఒక్కో సింహానికి రోజుకు సగటున 10కిలోల గొడ్డుమాంసం పెడుతుంటారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు రోజులుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని పశుమాంసం దుకాణాలు మూతబడ్డాయి. ఈ కారణంగా జూలోని సింహాలతోపాటు పులులు, నక్కలు, తోడేళ్లు, చిరుతలు, సివంగులకు కూడా మాంసం లభించటం గగనంగా మారింది.
ఈ సమస్యను అధిగమించేందుకు కోడి, మేక లేక గొర్రెల మాంసాన్ని అందిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలతో గొడ్డుమాంసం కాంట్రాక్టర్‌ను మార్చి, మటన్, చికెన్ కాంట్రాక్టర్ ను వెతకాల్సి ఉందని చెప్పారు. ఈలోగా ప్రభుత్వ నిర్ణయంలో ఏమాత్రం మినహాయింపు లభించినా తిరిగి పశుమాంసాన్నే తెప్పిస్తామని అన్నారు. స్థానిక మాంసం దుకాణాలు మూతబడిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారుల నుంచి పశుమాంసం తెప్పించేందుకు గల అవకాశాలను అన్వేషిస్తున్నామని ఇటావా సింహాల సఫారీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ పటేల్ తెలిపారు.
Advertisement