సీఎం వస్తున్నారు.. స్నానం చేసిరండి
లఖ్‌నవూ: మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనలో దారుణం జరిగింది. కులవ్యవస్థను రూపుమాపాలనే ప్రకటనలు కేవలం పేపర్లకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ అధికారులు మరో నిర్వాకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత వర్గాలను కలుస్తున్నారని తెలిసి అధికారులు, వారికి షాంపూలు, సోపులు ఇచ్చి ‘శుభ్రంగా స్నానం చేయండి’ అని ఆదేశించారట.
వివరాల్లోకి వెళ్తే యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ గురువారం యూపీలోని కుషినగర్‌లో పర్యటించారు. కొద్దిసేపట్లో కుషినగర్‌కి చేరుకుంటారనగా జిల్లా అధికారులు స్థానికులైన ముషర్ వర్గానికి సబ్బులు, షాంపూలు అందించి ముఖ్యమంత్రిని కలిసే ముందు స్నానం చేసి రావాలని ఆదేశించారు. ముషర్ వర్గాన్ని అతి తక్కువ వర్గంగా భావిస్తారు. ఎలుకలను పట్టుకొని జీవిస్తారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారని తెలియగానే అప్పటికప్పుడు విద్యుద్దీపాలు, రోడ్లు, టాయిలెట్లు ఏర్పాటు చేశారు.గతంలో కూడా బీఎస్‌ఎఫ్ జవాను ప్రేమ్‌సాగర్ కుటుంబాన్ని యోగి కలవనున్నారని తెలిసి అప్పటికప్పుడు వారింట్లో సోఫా, ఏసీ, కార్పెట్లు ఏర్పటు చేశారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే వాటన్నింటినీ వాటన్నింటిని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.