సీఎం ‘వికాస్‌ యాత్ర’.. మరి వారిది ఏ యాత్ర..! | Ahead Of Maharashtra Assembly Elections Congress Will Face BJP | Sakshi
Sakshi News home page

సీఎం ‘వికాస్‌ యాత్ర’.. మరి వారిది ఏ యాత్ర..!

Published Mon, Jul 8 2019 10:48 AM | Last Updated on Mon, Jul 8 2019 5:02 PM

Ahead Of Maharashtra Assembly Elections Congress Will Face BJP - Sakshi

ముంబై : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి కాంగ్రెస్‌ బయటపడినట్టు లేదు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ముంబై కాంగ్రెస్‌ చీఫ్‌ మిలింద్‌ డియోరా, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ఇక ఎన్నికల ముందే రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగిన మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ కూడా అదే బాటలో నడిచారు. అయితే, లోక్‌సభ ఎన్నికల సమయంలో సీట్ల పంపకంలో తన మాట చెల్లుబాటు కావడం లేదనే అసహనంతో కాకుండా రాహుల్‌ రాజీనామా అనంతరం ఆయన పదవికి గుడ్‌బై చెప్పడం గమనార్హం. అయితే, ఈయేడు చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతల వైఖరి బీజేపీకి మరింత బలం చేకూర్చేదిగా తయారైంది.

బీజేపీని ఎదుర్కొంటుందా..!
అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతున్న మహారాష్ట్ర కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో తేలిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 48 సీట్లలో కాంగ్రెస్‌ 1 చోట మాత్రమే విజయం సాధించగా ఎన్డీయే కూటమి 41 సీట్లను కైవసం చేసుకుంది. ఇక ఈయేడు చివరల్లో అసెంబ్లీ జరుగనుండటంతో అధికార బీజేపీ దూకుడు పెంచింది. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. లోక్‌సభ ఎన్నికల విజయంతో ఆగిపోవద్దని, మరింత కష్టపడి పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తెద్దామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘వికాస్‌ యాత్ర’ పేరుతో ఆయన త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు అటు జాతీయస్థాయిలో, ఇటు రాష్ట్రంలోనూ నాయకత్వ కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పరిస్థితి జిల్లాల్లో మరింత గందగోళంగా తయారైంది.

మంత్రి పదవి ఇచ్చి లాగేసుకున్నారు..
ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీనియర్‌ లీడర్‌ రాధాకృష్ణ విఖే పాటిల్‌ను బీజేపీ లాగేసుకుంది. ఆయనకు మంత్రిపదవి కూడా కట్టబెట్టింది. బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలు క్యూ కట్టారని రాష్ట్ర మంత్రి గిరిష్‌ మహాజన్‌ వంతి నేతలు చెప్తుండటం గమనార్హం. మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా మాజీమంత్రి బాలాసాహెబ్‌ థారోట్‌ బాధ్యతలు చేపట్టనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, చవాన్‌ రాజీనామామై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేనట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌తో పొత్తుకు ఎన్సీపీ సై..!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకు ఎన్సీపీ సిద్ధమైంది. ఈ విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మల్లిఖార్జున ఖర్గేతో చర్చలు జరుపేందుకు సుముఖంగా ఉంది. అయితే, సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్‌ ఎవరిని రంగంలోకి దించుతుందో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో నాయకుడు కరువైనవేళ ఏమేరకు బీజేపీతో ఢీకొంటుందో చూడాలి..!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement