ముంబై : మహారాష్ట్ర చరిత్రలో ఈరోజు చీకటి రోజు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. తెల్లవారుజామున హడావుడిగా ప్రభుత్వ ఏర్పాటు జరిగిందని.. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ధ్వజమెత్తారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉదయం అనూహ్యం పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్(బీజేపీ), ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్(ఎన్సీపీ) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి అహ్మద్ పటేల్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా... కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఇప్పటికీ కలిసే ఉన్నాయని స్పష్టం చేశారు. తామంతా కలిసి బల పరీక్షలో బీజేపీని ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలందరూ తమతోనే ఉన్నారని, ముగ్గురు మాత్రం వారి స్వగ్రామాల్లో ఉన్నందున ప్రస్తుతం తమ వెంట లేరన్నారు. రాజకీయంగా, చట్టపరంగా బీజేపీని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.(చదవండి : మహా ట్విస్ట్: పవార్, ఉద్ధవ్ ఠాక్రే ప్రెస్‌మీట్ )
ఇదిలా ఉండగా మహారాష్ట్ర తాజా పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఇక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ పాల్గొనకపోవడంతో కూటమి విచ్ఛిన్నమైందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్ తామంతా కలిసే ఉన్నట్లు ప్రకటించారు. ఇక మీడియా సమావేశంలో భాగంగా అజిత్ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన శరద్ పవార్.. అతడి స్థానంలో కొత్త శాసన సభా పక్ష నేతను ఎన్నుకుంటామని తెలిపారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment