సాక్షి ప్రతినిధి, చెన్నై: దినకరన్‌కు మద్దతుగా నిలిచారనే ఆరోపణల కారణంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల సహా 46 మంది పార్టీ జిల్లా కార్యదర్శులపై సీఎం ఎడపాటి పళనిస్వామి గురువారం బహిష్కరణ వేటు వేశారు. వారందరినీ పార్టీ పదవులు, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వేటు పడిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆర్ సామితో పాటు మదురై, విల్లుపురం, ధర్మపురి, తిరుచ్చిరాపల్లి, పెరంబులూరు జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నారు.
కాగా, జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ జయలలిత స్నేహితురాలు శశికళకు సమన్లు జారీ చేసినట్లు ఈ నెల 22న కమిషన్ కార్యాలయం వెల్లడించింది. శశికళ బెంగళూరు జైల్లో ఉన్నందున లిఖితపూర్వకంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం నమోదు చేసుకుంటామని, తప్పనిసరైన పక్షంలో నేరుగా విచారణ జరుపుతామని తెలిపింది.
కాగా, జయ చికిత్సపై ఆధారాలు అందజేయాల్సిందిగా ఈనెల 22వ తేదీన ఈ మెయిల్ ద్వారా కమిషన్ నుంచి వచ్చిన సమన్లను జైలు అధికారులు శశికళ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మెయిల్ ద్వారా వచ్చిన సమన్లను ఆమె నిరాకరించినట్లు, నేరుగా వచ్చి సమన్లు అందజేస్తేనే స్వీకరిస్తానని ఆమె వివరణ ఇచ్చినట్లు జైలు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఈ మెయిల్ ద్వారా శశికళకు సమన్లు పంపలేదని విచారణ కమిషన్ వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment