
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కలైంగర్ కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. అశేష అభిమాన సంద్రం మెరినా బీచ్‌లో ఆయనకు బుధవారం సాయంత్రం కడసారి వీడ్కోలు పలికింది. అయితే నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా, రాజకీయ లబ్ది కోసం ముఖ్యమంత్రి పళనిస్వామి తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టిందనని ఆ పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐఏడీఎండీకేలో తన నాయకత్వంపై అయిష్టంగా ఉన్న పార్టీ క్యాడర్ టీటీవీ దినకరన్ వైపు చూస్తుండడంపై కలవరపడిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే, పళని నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు, ప్రముఖులు, సినీ తారలు కరుణ మృతిపట్ల సంతాపం ప్రకటిస్తుంటే.. ఏఐఏడీఎంకే రాజకీయాలు చేస్తోందనే వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై అన్ని పార్టీలు డీఎంకేకు మద్దతుగా నిలవగా.. ఏ ఒక్క పార్టీ కూడా ఏఐడీఎంకే అనుకూలంగా మట్లాడలేదు. టీటీవీ దినకరన్ కూడా ‘కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడలేను’అని తప్పించుకున్నారు. దినకరన్‌వైపు చూస్తోన్న పార్టీ క్యాడర్‌ను మచ్చిక చేసుకుందామనుకున్న పళని ప్రభుత్వానికి ఇంటా బయటా మద్దతు లభించలేదు. చివరికి కోర్టులో ఉన్న పిటిషన్ల ఉపసంహరణతో మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు లైన్‌క్లియర్ అయింది. అక్కడ కరుణానిధి అంత్యక్రియలకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. కొసమెరుపు.. పటిషన్ల ఉపసంహరణతో కోర్టు నిర్ణయానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కరుణ అంత్యక్రియలకు ఓకే చెప్పింది. కానీ, అప్పటికే ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో అనవసర వివాదానికి తెరలేపిన పళని స్వామి సెల్ఫ్ గోల్ చేసినట్లయింది.