ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీరు, కేజ్రీవాల్‌కు మద్దతు తదితర అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సోమవారం విలేకరులతో మాట్లాడిన మాకెన్... బెంగాల్‌లో మమతా బెనర్జీ, సీపీఎం కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావిస్తూ.. ‘ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉండే అధికారాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. బహుశా అది ఆ నలుగురికి(మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామి, చంద్రబాబు నాయుడు) తెలియదేమో’ అంటూ మాకెన్ వ్యాఖ్యానించారు.
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే...
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాలు తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయంటూ మాకెన్ విమర్శించారు. ‘అయినా ప్రభుత్వ అధికారులు(ఐఏఎస్‌లను ఉద్దేశించి) తమ కర్తవ్యాలను నిర్వర్తించడానికి వెనకడుగు వేయరు. కానీ ప్రభుత్వం వారిచేత అక్రమ పనులు చేయించాలనుకున్నపుడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకవేళ వారు సరిగా పనిచేయడం లేదంటే దాని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా రాజకీయం చేయడం ఏమాత్రం బాగాలేదు. అధికారులు ఏ పార్టీకి చెందిన వారు కారన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందంటూ’ వ్యాఖ్యానించారు.
కాగా, ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో.. అజయ్ మాకెన్ వ్యాఖ్యలను బట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే దానిపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment