సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశాన్ని విభజిస్తోందని, బలహీనం చేస్తోందని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రజల మధ్య విభజన తెచ్చేలా, రాజ్యాంగ వ్యతిరేకంగా సీఏఏను కేంద్రం తెరపైకి తెచ్చిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ సీఏఏ కేవలం ముస్లింలకే కాకుండా అణగారిన వర్గాలు, పేదలు, మహిళలందరికీ వ్యతిరేకంగా ఉందన్నారు.
సీఏఏపై కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో ఎవరికీ భయపడబోమన్నారు. అలాగే రాష్ట్రంలో వచ్చే నెల ఒకటి నుంచి మొదలుకానున్న జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) ప్రక్రియను వెంటనే నిలుపుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కేరళ తరహాలో ఎన్‌పీఆర్‌ను నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. తన ప్రసంగంలో అక్బరుద్దీన్ ఇంకా ఏమన్నారంటే...
దేశం కోసం తల నరుక్కుంటా...
పౌరసత్వ సవరణ చట్టం దేశ పౌరులను విదేశీయులుగా, విదేశీయులను దేశ పౌరులుగా మారుస్తోంది. సీఏఏ ముస్లిం వ్యతిరేకమని, ముస్లింలు ఈ చట్టానికి వ్యతిరేకమని చూడాల్సిన అవసరం లేదు. ఈ చట్టం పేదలకు వ్యతిరేకం. పెద్దగా చదువు రాని భారతీయులకు వ్యతిరేకం. దేశ మహిళలకు వ్యతిరేకం. ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు వ్యతిరేకం. ఈ చట్టం పేద హిందూ సోదరులకు వ్యతిరేకం. నేను ముస్లిం కావడంపట్ల, భారతీయుడిని కావడంపట్ల గర్వపడుతున్నా.
అయితే నన్ను కేవలం ముస్లింగానే చూస్తున్నారు. అలా కాకుండా నన్ను భారతీయ ముస్లింగా చూడాలి. కానీ కొందరు దేశద్రోహి అని, పాకిస్తాన్ వెళ్లాలని అంటున్నారు. నేను ఈ దేశవాసిని. దేశం కోసం అవసరమైతే ప్రాణం అర్పిస్తా... తల నరుక్కుంటా. దేశం కోసం హిందూ, ముస్లిం, సిక్కులంతా ప్రాణాలు అర్పించారు. ఈ దేశం ప్రతి ఒక్కరిది. ఏ మతాన్నీ ఆచరించని వారిది కూడా. అయితే ప్రస్తుత చట్టం దేశాన్ని విభజిస్తోంది.
దేశాన్ని ఏకం చేసే చట్టాలు కావాలి...
దేశాన్ని ఏకం చేసే చట్టాలు, ఆలోచనలు మనకు కావాలి తప్ప విద్వేషాలు కాదు. విరిగిన హృదయాలు, దూరమైన ఇద్దరు సోదరులను దగ్గరికి తెచ్చేలా చట్టాలు ఉండాలి తప్ప దూరం పెంచేవిగా కాదు. సీఏఏ వంటి చట్టాలతో ప్రజల మధ్య దూరం పెరిగింది. మనం ఈ దేశంలో సోదరభావంతో కలసిమెలసి బతికామని వేల ఏళ్ల మన చరిత్ర చెబుతోంది. కానీ ఇలాంటి చట్టంతో దేశాన్ని విభజించడంతోపాటు బలహీనపరుస్తున్నారు. దేశంలో విద్వేషపు గోడలు నిర్మిస్తున్నారు.
సీఎం కేసీఆర్‌ను చూసి గర్విస్తున్నా...
దేశంలో విద్వేషాలు పెరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ శాసనసభలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టి చేసిన ప్రసంగం యావత్ దేశానికి వెళ్తున్న ఆశాకిరణంలా ఉంది. దేశంలోని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులను సమ దృష్టితో చూసే వ్యక్తులు ఉన్నారని కేసీఆర్ నిరూపించారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్దామనే సీఎం మాకు ఉన్నారని నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది.
సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన 8వ రాష్ట్రం తెలంగాణ అయినా వాటిపై సమగ్ర వివరాలతో తీర్మానం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. అందరినీ సమ దృష్టితో చూస్తుందనే టీఆర్‌ఎస్‌కు మజ్లిస్ దగ్గరగా ఉంది. అందుకే మున్ముందూ టీఆర్‌ఎస్ చేయి వదలం. టీఆర్‌ఎస్ చేపట్టే కార్యక్రమాలకు చేదోడుగా ఉంటాం. తీర్మానం చేసినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు.
ఎన్నార్సీ అక్రమం...
2019 వరకు దేశ పౌరుడిగా ఉన్న నా ఓటు తీసుకొని ప్రధాని కుర్చీలో కూర్చొన్న వ్యక్తి.. దేశ ప్రజల పౌరసత్వంపై వేలెత్తి చూపుతున్నారు. ఎన్నార్సీ అమలు చేస్తే నాకు పౌరసత్వం ఉంటుందో లేదో అనుమానమే. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి సభలో ఉంటానో లేదో కూడా తెలియదు. ఈ చట్టం ఎలా ఉందంటే అక్రమ కొడుకు పుట్టిన ఏడాది తర్వాత తండ్రి పుట్టినట్టు ఉంది. ఎన్నార్సీ ప్రక్రియ పూర్తిగా అక్రమం. దీనికి చట్టబద్ధత లేదు. దేశ ప్రజల గోప్యతకు ఇది భంగం కలిగించేలా ఉన్నందునే దీన్ని వ్యతిరేకిస్తున్నాం.
సందేహాత్మక పౌరులు ఎక్కడికెళ్లాలి?
ఎవరినైనా సందేహాత్మక పౌరులుగా ప్రకటించే అధికారాన్ని ఎన్నార్సీ కల్పిస్తోందని, ఇది అనేక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అస్సాంలో తండ్రికి పౌరసత్వం లభిస్తే తల్లికి లభించలేదు. తల్లిదండ్రులకు దొరికితే పిల్లలకు దొరకలేదు. భార్యకు దొరికితే భర్తకు దొరకలేదు. కుటుంబంలోని ప్రతి వ్యక్తిపైనా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంచడం సరికాదు. ఒకవేళ గత రికార్డులతో పోలిక కుదరకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌తో పోల్చి సందేహాత్మక పౌరుడిగా ప్రకటిస్తారు. దీనిపై విదేశీయులు.. విదేశీయుల ట్రిబ్యునల్‌కు వెళ్తారు.
మరి సందేహాత్మక పౌరులు ఎక్కడికి వెళ్తారు? వారిని డిటెన్షన్ కేంద్రాలకు తరలించాలి. ఒక్కో డిటెన్షన్ కేంద్రంలో 3 వేలకు మించి ఉండరాదు. ఒక్కో డిటెన్షన్ కేంద్రానికి రూ. 45 కోట్లు కావాలి. ఒకవేళ 10 కోట్ల మంది సందేహాత్మక పౌరులుంటే 33 వేల డిటెన్షన్ కేంద్రాలు కావాలి. దీనికితోడు ఏ వ్యక్తి అయినా మరో వ్యక్తి పౌరసత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే బాధితుడు తన జాతీయత నిరుపించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది బ్లాక్ మెయిలింగ్‌కు దారితీస్తుంది.
మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రశ్నలు...
ఎన్‌పీఆర్‌లో అడుగుతున్న వివరాలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. చాలా దుఃఖంగా, బాధతో, సిగ్గుతో చెబుతున్నా. మహిళలు ఒకవేళ వారి వయసు చెప్పలేని స్థితిలో ఉంటే అధికారులు వారిని చూసి వయసును బేరీజు వేయాలని, పెళ్లైన తర్వాత శోభనం (కంజ్యూమేషన్ ఆఫ్ మ్యారేజీ) నాటికి మహిళలకు ఉండే వయసును బేరీజు వేయాలని ఎన్‌పీఆర్ మ్యాన్యువల్‌లో నిబంధనలు పెట్టడం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే. మన అమ్మ, అక్క, చెల్లెళ్ల ఆత్మగౌరవంతో కేంద్రం ఆటలాడుతోంది.
చదవండి:
దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది
పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం
సజల.. సుజల.. సస్యశ్యామల తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment