మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల
సాక్షి, విశాఖపట్నం: ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై అసభ్య వీడియోలు సృష్టించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయిస్తున్నావని, మహిళల పట్ల నీకున్న గౌరవం ఇదేనా చంద్రబాబు అని విశాఖ తూర్పు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల ధ్వజమెత్తారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ నగర కార్యలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నీ భార్య గురించి గొప్పలు చెప్పుకుంటావే... నీ కూతురు వయస్సున్న ఓ మహిళపై గత ఐదేళ్ల నుంచి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నావే.. ఇదేనా నీ సంస్కారం అని చంద్రబాబుపై మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని గొప్పలు చెప్పుకుంటావే ఇదేనా మహిళల పట్ల నీకున్న గౌరవమని ప్రశ్నించారు.
ఈ ఐదేళ్లలో యూట్యూబ్‌లో ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా వీడియోస్ అప్‌లోడ్ చేయించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. నీ కోడలు బ్రాహ్మణి ఫొటోలు ఎవరైనా పెడితే ఒక మహిళ ఎంత బాధపడుతుందో అర్థమవుతుందన్నారు. నీకు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో చూసుకోవచ్చు రా... అంతేగానీ ఒక మహిళ మీద అసభ్య వీడియోలతో దొంగదారుల్లో రావొద్దుని చంద్రబాబుని హెచ్చరించారు. అసభ్య వీడియోస్ యూట్యూబ్‌లో పెట్టిన చంద్రబాబు అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. బాబు పాలనలో మహిళలకు రక్షణే కరువైందన్నారు. నీ భార్య, కోడలు వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే మహిళ ఆవేదన తెలుస్తుందని ధ్వజమెత్తారు. ఎమ్మార్వో వనజాక్షిని మీ పార్టీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని కొట్టించినప్పుడే మహిళలంతా చంద్రబాబుని అసహ్యించుకున్నారన్నారు. పెందుర్తిలో ఒక దళిత మహిళను ఎమ్మెల్యే అనుచరుడు వివస్త్రను చేసి ఈడ్చిన చరిత్ర టీడీపీదని, మరో ఆరు రోజుల్లో రాక్షసపాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నేత నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment