సాక్షి, హైదరాబాద్ : బంగారు తెలంగాణలో సగభాగం అయిన మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళల ఓట్లతో రాష్ట్రంలో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్.. నేడు వారి సమస్యలు పట్టించుకోవడం లేదని, మహిళలు నరకకూపంలోకి వెళ్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఆదివారం జరిగిన బోనాల వేడుకల్లో మహిళలు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. మేం మాట్లాడితే రాజకీయాలని కొట్టిపారేస్తారని, మరి భవిష్యవాణి చెప్పిన అమ్మవారే ఇలాంటివి చెప్పడం రాష్ట్రం మొత్తం టీవీల్లో చూసిందన్నారు.
ఆకుల విజయం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బంగారు బోనం తెచ్చినా కూడా మహిళల్లో ఆనందం లేదు. అధికారులు, పోలీసుల దురుసు ప్రవర్తనతో జోగిని శ్యామల కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మీ ప్రభుత్వ చేతకాని తనం. శ్యామల కన్నీళ్లు మీకు కనిపించలేదా కేసీఆర్. బంగారు బతుకమ్మతో పాటు బంగారు బోనం సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్‌ఎస్ ఎంపీ కవితది అయింది. రాష్ట్రంలో మహిళ అంటే కవిత ఒక్కరేనా. ఇంకో మహిళ కూడా కనిపించడం లేదా.? నిన్న మహిళా రిపోర్టర్లు, యాంకర్లు అక్కడ ధర్నా చేయాల్సిన దుస్థితి. భవిష్యవాణి చెప్పే వారు(స్వర్ణలత), జోగిని శ్యామల ఇలా అందరూ ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి ఆలోచించాలి.
కవితకు ఏం అర్హత ఉంది?
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు జాతర చేసుకుంటుంటే సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీస్ అధికారి సుమతి దురుసుతనానికి మీరు కారణం కాదా. స్వామీజీని బహిష్కరించిన తీరు, జోగిని పట్ల మీ తీరుపై మీరు సమాధానం చెప్పాలి. వచ్చే రోజుల్లో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరిస్తున్నాం. సికింద్రాబాద్‌లో బోనాన్ని ఏ అర్హతతో కవిత ఎత్తుకున్నారు. కవితకు, సికింద్రాబాద్‌కు ఏమైనా సంబందం ఉందా. సీఎం కేసీఆర్ సతీమణి బోనం ఇస్తే మాకు ఏ అభ్యంతరం ఉండేది కాదు. బోనాల నేపథ్యంలో జరిగిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని’ ఆకుల విజయ డిమాండ్ చేశారు.
బంగారు బోనం సమర్పించిన ఎంపీ కవిత
Comments
Please login to add a commentAdd a comment